అనుమతుల్లేకుండా వెంచర్స్.. పట్టించుకోని యంత్రాంగం

–  పోతారంలో అక్రమ వెంచర్ 
– ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
– డీటీసీపీ అనుమతులు లేకుండానే ప్లాట్ల విక్రయాలు
– మోసపోతున్న కొనుగోలుదారులు
నవతెలంగాణ – బెజ్జంకి
ఒకప్పడు పట్టణాలకే పరిమితమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పుడు పల్లె ప్రాంతాలకు విస్తరించింది. పచ్చని పంట పొలాలు కూడా వ్యాపారుల చేతుల్లో పడి కనుమరుగవుతున్నాయి. మండల కేంద్రానికి ప్రధాన రోడ్లకు అనుకుని ఉన్న వ్యవసాయ సాగు భూములు వెంచర్లుగా రూపాంతరం చెందుతున్నాయి. అధికారులు, పాలకులు మామూళ్ల మత్తులో పడి పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. వెంచర్ ముసుగులో అక్రమ వ్యాపారం సాగుతున్నా అధికారులు అచేతన స్థితిలో ఉండడం గమనార్హం. ఎలాంటి అనుమతుల్లేకుండా ఏర్పాటుచేసిన వెంచర్ వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి అక్రమ వెంచర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
మండల పరిధిలోని పోతారం గ్రామ శివారులోని సర్వే నంబర్ 801,802,803,804,805 యందు సుమారు మూడెకరాల విస్తీర్ణంలో వ్వసాయేతర భూమిగా మార్చకుండానే వ్యాపారస్తులు ఎలాంటి ప్రభుత్వ అనుమతుల్లేకుండా అక్రమ వెంచర్ ఏర్పాటుచేసి ప్లాట్ల విక్రయాలు సాగిస్తున్నారు. అధికారుల మాటలపైనే అక్రమ వెంచర్ ఏర్పాటుచేశారు. ప్రజల ఆకాంక్షనే పెట్టుబడిగా పెట్టి ఆకాశాన్ని అర చేతులో చూపిస్తూ ఫ్లాట్లు అంటగడుతూ,  ప్రజలను మోసగిస్తూ , వ్యాపారులు కోట్లు దండుకుంటున్నారు. ఇలా అక్రమ భూ దందా జరుగుతున్నా రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల అధికారుల్లో పట్టింపు లేదని, వారి అండదండలు పుష్కలంగా ఉన్నాయని గ్రామస్తులు భాహటంగానే అంటున్నారు.
అంతా మాటలపైనే..అధికారుల మాటలపైనే వెంచర్ లే అవుట్ గీసి, డీటీసీపీ అనుమతుల్లేకుండా ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ,వ్యాపారులు యథేచ్ఛగా ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. పోతారం గ్రామ శివారులో వ్యాపారస్తులు అక్రమంగా వెంచర్ ఏర్పాటుచేసి ప్లాట్లు విక్రయిస్తున్న అధికార యంత్రాంగం, పంచాయతీ పాలకవర్గం సభ్యులు వెంచర్ నిర్వహాకులు సాగిస్తున్న అక్రమ వ్యాపారానికి వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు గ్రామంలో వెల్లువెత్తుతున్నాయి.
నిబంధనల ఉల్లంఘన..డీటీసీపీ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటుచేసి, వ్యాపారులు వెంచర్ యందు ప్లాట్లను విక్రయిస్తున్నారు. డీటీసీపీ నిబంధనలను పూర్తిగా ఏర్పాటుచేసి నిర్ణీత రుసుమును ప్రభుత్వానికి చెల్లింపులు చేసి, వెంచర్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలి. అన్ని అనుమతులను పరిశీలించి అధికారులు అనుమతులు జారీ చేయాలి. ఎలాంటి అనుమతుల్లేకుండా వెంచర్ ఏర్పాటుచేసి ప్లాట్ల విక్రయాలు సాగిస్తూ ప్రజలను మోసం చేస్తున్న అధికారులు, వ్యాపారుల మాటలపైనే అధారపడడం పలు అనుమానాలు దారితీస్తున్నాయి. ఇప్పటికైనా పంచాయతీ రాజ్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు స్పందించి అక్రమ వెంచర్లకు అడ్డుకట్ట వేసి, చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
విచారణ జరిపి చర్యలు చేపడుతాం
పోతారం గ్రామ శివారులో ఏర్పాటుచేసిన వెంచర్ పై పంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు.ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేస్తే విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చివేతలు చేపడతాం.– విష్ణు వర్ధన్, ఎంపీఓ బెజ్జంకి.
కఠిన చర్యలు తీసుకుంటాం:  పోతారం గ్రామ శివారులో వ్యవసాయ సాగు భూమిలో వెంచర్ ఏర్పాటు చేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారని మా దృష్టికి రాలేదు.  ఎలాంటి అనుమతుల్లేకుండా వెంచర్ ఏర్పాటు చేసినట్లు తేలితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం – ఎర్రోల్ల శ్యామ్, తహసిల్దార్ బెజ్జంకి. 
Spread the love