వార్తా పత్రికల్లో ప్రచురితం అయ్యే చిన్న చిన్న కథలు, కవితలు, సామాజిక, రాజకీయ వ్యాసాలు చదవడం ద్వారా నాకు సాహిత్యం పట్ల అభిరుచి ఏర్పడింది. డిగ్రీ వరకు తెలుగు సాహిత్యాన్ని ఆసక్తిగా చదవుకున్న నాపై హిందీ సాహిత్య ప్రభావం పడింది. సామాజిక స్పహను, సామాజిక దోపిడీ, భూస్వామ్య పెత్తందారి రుగ్మతలను ప్రేమ్ చంద్ తన నవలల ద్వారా ప్రతిబింప జేసిన విధానం ఆకట్టుకొని, నన్ను మొత్తం హిందీ సాహిత్యం వైపు ఆకర్షించేలా చేసింది. ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పిజీ చేస్తున్నప్పుడు హిందీలో ఉత్తమ రచనల వెతుకులాటలో దొరికిన అరుదైన పుస్తకం ‘ఓం ప్రకాష్ వాల్మికి’ రాసిన ‘జూఠన్’ ఒక అంటరాని వాని ఆత్మకథ. ఇది ఓంప్రకాష్ జీవితచరిత్ర, దళిత సమాజం తాలుకు సమస్యలకు సంబంధించినది. సమాజంలో మనుషుల్లా ఉంటూ జంతుజీవితాలను జీవిస్తున్న అభాగ్యుల జీవుల చిత్రణ ఈ నవల. జూఠన్ అంటే ‘ఎంగిలి’ అని అర్థం.
ఇది నన్ను నేను పోల్చి చూసుకునేలా, ఓదార్చుకునేలా, నన్ను నేను మరింత దఢంగా మలచుకోవడానికి ఎంతగానో ప్రభావితం చేసిన ఆత్మకథ. దుఃఖం, బాధ, వేదనాభరితమైన పీడనతో నిండిన ప్రపంచం ఈ ఆత్మకథలో విస్తరించి ఉంది. వీటన్నింటినీ దాటుకుని ఓం ప్రకాశ్ వాల్మీకి ఎలా పెరిగాడు, ఎలా జీవించాడు, తనను తాను ఓ దఢమైన తిరుగుబాటు శక్తిగా ఎలా వద్ది చేసుకున్నాడనేది ఈ ఆత్మకథ. ఇది కేవలం ఒక వ్యక్తి ఆత్మకథ మాత్రమే కాదు. మొత్తం దళిత సమాజం తాలూకు దుఃఖం, బాధ, పోరాటం, సామాజిక సమస్యలను వ్యక్తపరచే ఓ గొప్ప రచన. డా. జీవి. రత్నాకర్ తెలుగు అనువాదానికి జి. కళ్యాణ్ రావు తన ముందుమాటలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
తన కొడుకు బాగా చదువుకుని పెద్దవాడై ఈ నరక జీవితం నుంచి విముక్తి పొందాలని, కులాన్ని సంస్కరించాలని, మొత్తం దళిత సమాజాన్ని బాగు చేయాలనే తండ్రి కోరిక. అందుకోసం తండ్రి, కొడుకులు చేసిన తిరుగుబాటు చరిత్రే ఈ జూఠన్. అయితే ఈ ప్రయాణంలో తానూ అనుభవించిన నరకయాతను చిత్రీకరించిన తీరు మనల్ని కలచివేస్తుంది. జూఠన్ తన పాఠశాల రోజుల్లో ఎదురుకున్న అనేక సంఘటనల గురించి ప్రస్తావిస్తూ ”మిగతా వారి నుండి నేను చాలా దూరంగా నేలపైన కూర్చుండేవాడిని. నేను కూర్చున్న చోటు వరకు చాప ఉండేది కాదు. కొన్ని సమయాల్లో అందరికంటే వెనక కూర్చోవలసి వచ్చేది. చాలాసార్లు నన్ను అకారణంగా కొట్టేవారు. ఒకసారి ఓంప్రకాశ్ 4వ తరగతిలో ఉన్నప్పుడు ప్రధానోపాధ్యాయుడు అతడిని పాఠశాల, ఆటస్థలం శుభ్రపరచమని హుకుం జారీ చేసేవాడు. నిండా పదేండ్లు లేని ఆ పిల్లవాడ్ని ఆ పని తీవ్రమైన వెన్ను నొప్పితో బాధించేది. నీళ్లు తాగడానికి కూడా అనుమతించేవాడు కాదు. అలా ఓం ప్రకాశ్‌తో పాఠశాలను, మైదానాన్ని అనేక సార్లు ఊడ్పిస్తారు. ఇదంతా గమనించిన ఓంప్రకాశ్ తండ్రి తన కొడుకు చేయి పట్టుకొని వెళ్ళిపోతూ ఉపాధ్యాయులందరితో ”మీరు ఉపాధ్యాయులు… కాబట్టి వదిలి వేస్తున్నాను… కాని మీరు ఒక విషయం గుర్తుంచుకోండి… ఇతడు ఇక్కడే… ఈ పాఠశాలలోనే చదువుతాడు. వీడు ఒక్కడే కాదు, వీడి తర్వాత కూడా చాలామంది చదువుకుంటారు. ఒరేరు మా పిల్లవాడు రెండు అక్షరాలు నేర్చుకుంటే నీదేం పోయింది. నిన్ను ఎందుకు బ్రతిమిలాడాలి” అని హెచ్చరిస్తాడు. ఈ ఘటన ద్వారా దళితులకు విద్యను దూరం చేయడానికి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేశారో అవగతమవుతుంది. జూఠన్ ఆత్మకథ అమితంగా నన్ను ఆకట్టుకోవడానికి నా స్వీయానుభూతులే కారణం. అవన్నీ ఈ ఆత్మకథను చదువుతున్నంతసేపూ నేమరేసుకున్నాను. కండ్ల నీళ్ళను అదుపు చేసుకున్నాను. ఈ వేధింపుల వల్ల చదువుకు దూరమైన నా మిత్రుల ఘోషను మళ్లీ ఒక సారి స్మరించుకున్నాను. అకారణంగా ఎస్సీ హాస్టల్ విద్యార్థులను కొట్టినప్పుడు, ఒళ్ళంతా వాతలతో వాచిపోయిన తీరు గుర్తొస్తే ఇప్పటికీ వెన్నులో వణుకు పుడుతోంది.
అప్పుడు ఓంప్రకాష్ వాల్మీకి పాఠశాలలో హింసకు, చీత్కారానికి గురి కాబడ్డా, పాయకానాలు కడిగించడం లాంటివి చేపిస్తూ మీకు చదువు ఎందుకు అన్న మాటలు టీచర్లచేత అనేక సార్లు విని, బెత్తంతో తీవ్రంగా దెబ్బలు తిని విద్యకు దూరం చేయబడినా, నాలాంటి వాళ్ళు అకారణంగా దెబ్బలు తిన్నా, గాయాలపాలైనా కారణం ఒక్కటే కులం. అదే విషయాన్ని ‘జూఠన్’ నవల స్పష్టం చేస్తోంది.
– సిలపాక వెంకటాద్రి, 9133495362