– అంబేడ్కర్ ను కించపరిస్తే సహించేది లేదు.
– రాయపోల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్ట రాజు
నవతెలంగాణ – రాయపోల్ : భారత రాజ్యాంగ నిర్మాత డా. బీ.ఆర్ అంబేడ్కర్ ను కించపరిచేలా ‘అంబేడ్కర్ కల్పిత నాయకుడు’ పేరుతో పుస్తకం రాస్తూ, సోషల్ మీడియా వేదికల ద్వారా ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న హమారా ప్రసాద్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని రాయపోల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్ట రాజు అన్నారు. శుక్రవారం రాయపోల్ మండల కేంద్రంలో హమారా ప్రసాద్ రచిస్తున్న అంబేద్కర్ కల్పిత నాయకుడు పుస్తకం పై నిరసన వ్యక్తం చేస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రజలందరికీ హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం కల్పించిన భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ ప్రపంచ మేధావిగా, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన నాయకుడిగా ఆయనకు దేశ, విదేశాల్లో విశిష్ట గుర్తింపు ఉందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలు, సంస్థలు అంబేడ్కర్ ఆలోచనలు,సామాజిక న్యాయం, సమానత్వంపై చేసిన కృషిని అధ్యయనం చేస్తు కీర్తిస్తున్నాయని పేర్కొన్నారు.ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతిని విజ్ఞాన దివాస్ గా నిర్వహించాలని స్వయంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిందన్నారు. అలాంటి మహనీయుడు అంబేడ్కర్ చరిత్రను వక్రీకరించేలా పుస్తకాలు రాయడం, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు.హమారా ప్రసాద్ వ్యాఖ్యలు, పుస్తకంలోని అంశాలపై ప్రభుత్వం, పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి అతడిపై దేశద్రోహం కేసు నమోదు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్‌ను అవమానించడం అంటే రాజ్యాంగ విలువలను, సామాజిక న్యాయ స్ఫూర్తిని అవమానించడమేనని ఆయన అన్నారు.అంబేడ్కర్ ఆశయాలైన సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం, సామాజిక న్యాయాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని పుట్ట రాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సొక్కం స్వామి, శ్రీనివాస్, భాస్కర్, నాగరాజు, నవీన్, భానుప్రసాద్, దేవరాజ్, చాణక్య, భరత్ తదితరులు పాల్గొన్నారు.



