నవతెలంగాణ – వనపర్తి
అమరజీవి కామ్రేడ్ ఈ.ఆశీర్వాదం 26వ వర్ధంతిని అతని స్తూపం దగ్గర పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ 26వ వర్ధంతి కార్యక్రమానికి ఆయన ఈ ఆశీర్వాదం కుమారుడు ఈ నిపున్, సీపీఐ(ఎం), జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి ఎం పరమేశ్వర ఆచారి, సీపీఐ(ఎం) 18 వ వార్డు కౌన్సిలర్ గంధం మదన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
వారు మాట్లాడుతూ గత 26 సంవత్సరాలుగా సీపీఐ(ఎం) కార్యకర్తలు ఆశీర్వాదం స్తూపం దగ్గర పూలమాలలు వేసి గత 26 సంవత్సరాలుగా ఘనంగా నివాళులర్పిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు ప్రసంగిస్తూ .. కామ్రేడ్ ఈ ఆశీర్వాదం విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ మొట్టమొదటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శిగా పనిచేశారని గుర్తు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్. బి చదువుతూ విద్యార్థి ఉద్యమంతో పనిచేయడంతో పాటు ఎమర్జెన్సీ కాలంలో రహస్యంగా మారువేషంలో వచ్చి వనపర్తిలో పార్టీ నిర్మాణానికి కృషి చేశారని తెలిపారు. పార్టీ పునర్నిర్మాణానికి ఎంతో సేవలు అందించారని కొనియాడారు. హైదరాబాదులో ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపకుల్లో ముఖ్యులుగా ఈ ఆశీర్వాదం పనిచేశారని, హైదరాబాదులో పూర్తి కాలం కార్యకర్తగా పనిచేశారని అన్నారు.
అనంతరం లాయర్ వృత్తి చేస్తూ వనపర్తి పట్టణంలో సీపీఐ(ఎం) అభివృద్ధికి ఎనలేని సేవలందించారని కొనియాడారు. 1995 తర్వాత డివిజన్ కమిటీ సభ్యులుగా చివరిదాకా పని చేశారని, అనేక పేదల సమస్యలపై ఉద్యమించారని అన్నారు. 2000 సంవత్సరం ఏప్రిల్ 16న సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మహబూబ్నగర్ లో జరిగే కరువులో రైతాంగాన్ని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి ఎండలు లెక్క చేయక 14, 15 తేదీలలో గ్రామాలు తిరిగి ప్రజల ను సమీకరించేందుకు కృషి చేశారని చెప్పారు.
ఏప్రిల్ 15న హఠాత్తుగా గుండెపోటుతో మరణించారని ఆయన చివరి కంట సీపీఐ(ఎం) అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. సీపీఐ(ఎం) కార్యకర్తలను తయారీకి గట్టి పట్టుదలతో ప్రయత్నించి వనపర్తి పట్టణంలో పార్టీని పునర్ నిర్మాణం చేసేందుకు ఎంతో కృషి చేశారని అన్నారు. నేడు ఆశీర్వాదం కు నివాళి అర్పించడం అంటే అంటరానితనానికి వ్యతిరేకంగా కుల వివక్ష అంతం కోసం పెద్ద ఎత్తున ఉద్యమించడం, సెక్యులర్ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, మతోన్మాద బిజెపిని ఒంటరి చేసి బలహీనపరచడం, మనూ ధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు జి రాబర్ట్,గంధం గట్టయ్య, సి.పుల్లయ్య, ఎం. మన్యం, డి.దేవరాజు, డి.బాలరాజు,మద్దిలేటి, ఉమా, ఏ.రమేష్, కళ్యాణ్,జి బాలస్వామి, బి. కురుమయ్య,రేమోద్దుల మన్యం, డి.ఆంజనేయులు, బాల పీరు, డి.గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.



