వింత లోకంలో మైమరపించిన పాట

A mesmerizing song in a strange worldహృదయాన్నే దోచేసే అందమొకటి కళ్ళముందు కనబడితే హాయివానల్లో తడిసినట్టనిపిస్తుంది. జీవితానికి ఓ అందమైన వరం దొరికినట్టనిపిస్తుంది. ఆ అందాన్నే పొందాలనిపిస్తుంది. అదే బతుకుకు ధన్యమనిపిస్తుంది. అలాంటి అపురూపమైన అందాన్ని చూసినపుడు కలిగే ఆనందం ఎలా ఉంటుందో ఈ పాట తెలియజేస్తుంది. 2024 లో వి.ఐ. ఆనంద్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాలో తిరుపతి జావన-శేఖర్‌ చంద్ర రాసిన పాటనిపుడు పరిశీలిద్దాం.
ఊహలకందని అందమొకటి కన్నులకు విందు చేస్తూ, మనసును పులకింతలతో పునీతం చేస్తుంటే ఎవరూ ఏమి చేయలేని స్థితిలో ఉంటారు. ఆ అందాన్ని చూస్తూ మైమరచిపోతుంటారు. తిరుపతి జావన-శేఖర్‌ చంద్ర అలతి అలతి పదాల్లో ఆ అందాన్ని వర్ణిస్తూ అందమైన పాట రాశారు. ఈ పాట ఎంతమంది హృదయాలను కొల్లగొట్టిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను. సందీప్‌ కిషన్‌, వర్ష బొల్లమ్మ నటన ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు. హీరో తొలిసారిగా హీరోయిన్‌ను చూసినపుడు ఎలా అనుభూతి చెందుతాడో ఈ పాట చెబుతుంది.
కొత్తగా కంటికి కనబడిన అందమది. చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవడం లేదు. అలా అని మనసుతో చూస్తే కూడా.. మనసు ఆ అందాన్ని చూసి స్వర్గలోకాల అంచుల్లో విహరిస్తూ ఉంది. ఇక ఆ అందాన్ని చూసినప్పుడు మాటలు రావు. పాటలూ రావు. ఆ అనుభూతిని చెప్పడానికి ఏ కావ్యాలూ సరితూగవు. చూస్తూ నిశ్చేష్టులమవ్వడమే మన పని. కొంతసేపటికి తేరుకొని, యధాస్థితికి వచ్చి, ఆ అనుభూతిని ఉన్నది ఉన్నట్లుగా చెబితే ఎలా ఉంటుందో ఈ పాట చెబుతుంది.
ఇన్ని రోజుల వరకు ఇలాంటి వింత మైకంతో కూడిన లోకాన్ని నేను చూడలేదు. మనసెప్పుడూ ఇంత గొప్ప ఆనందాన్ని పొంది ఎరుగదు. మొదటిసారిగా నిన్ను చూశాకే ఇలాంటి ఆశ్చర్యానికి, అనుభూతికి లోనయ్యాను. నా మనసు నిన్ను చూసి తొలిసారిగా జారిపోయింది. ప్రేమలో సాగిపోయింది. అసలు ఈ మాయ ఏమిటి? ఎందుకిలా అవుతుంది? పిచ్చివాడిలా నాకు నేను కనబడతున్నాను. ఏం చేయాలో, ఏం చెప్పాలో అర్థం కావడం లేదు.. అంటే.. గొప్ప సౌందర్యాన్ని చూసినప్పుడు మనసు పొందే పరవశం ఎలా ఉంటుందో ఇక్కడ అర్థమవుతుంది. మనిషి పేరుకే ఈ లోకంలో ఉన్నాడు. అతను ఎటూ తోచని సందిగ్ధస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆనంద సౌందర్యాలను ఆస్వాదిస్తున్నాడు. సౌందర్యమే ఆనందంగా భావిస్తున్నాడు.
అంత అందం చూశాక ఇక పొందకపోతే జన్మ వృథా అనిపిస్తుంటుంది. ఇక్కడ హీరోకి కూడా అదే అనిపిస్తుంది. అతడు దృఢ సంకల్పంతో ఉన్నాడు. ఆమెనే తన జీవితానికి తోడుగా పొందాలని ఫిక్స్‌ అయిపోయాడు. ఆమెను వదిలి ఉండలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఆమెను ఊపిరిలా భావిస్తున్నాడు. ఊపిరి విడిచిన ప్రాణం ఉండదు. ఆమెను విడిచిన బతుకూ ఉండదు. ఇది అతని ప్రస్తుత స్థితి. ఇక ఆమెను చూసినప్పటి నుంచి అతని కంటికి నిద్ర కరువయ్యింది. ఇది అంతా ఆమె మాయనే. అతడు సోయిలో లేడు. మనిషిగా భూమి మీద లేడు. స్పర్శ కూడా లేని లోతైన అనుభూతుల లోయల్లోకి వెళ్ళిపోయాడు.
ఆమెను చూడగానే ఇంకా ఎలా ఎలా అనిపిస్తుందో చెబుతున్నాడు. మనసులోపల వింత వింతగా ఉందట.. నది నుంచి బయటకి వచ్చి ఒడ్డున పడ్డ చేపలా ఉందట అతని మన:స్థితి. అంటే.. అంత విలవిలలాడుతున్నాడు. కరిగి కరిగి జలజల పారుతున్నాడు.
హీరో నడిపే ఆటోలో ఆమె ఎక్కి కూర్చుంటుంది. ఆమె ఎక్కడో దూరంగా ఉంటే అతని సంగతి వేరేలా ఉండేది. కొంత హద్దుల్లో అతని మనసుండేదేమో. కాని ఇక్కడ శృతి మించిపోయింది. ఆమె అతని పక్కనే ఉంది. అతన్ని పదేపదే తాకుతూ ఉంది. అదే అతను మరీమరీ పులకించిపోవడానికి కారణమైంది. పూలకొమ్మలాగా ఆమె వంగి వంగి, తన పక్కనే కూర్చొని జరిగి జరిగి తాకుతుంటే అతని మనసు ఎటో ఎటో పోతోంది. ఆటో వెళ్ళే దారి ఎలా ఉన్నా మనసు మాత్రం దారిమళ్ళేసింది. ఇక ఆమెనే అలా చూస్తూ, తాకుతూ ఉంటే ఆ తన్మయత్వానికి తాను తాళలేకపోతున్నానని, తాగకుండానే కిక్కెక్కిపోతుందని చెబుతుంటాడు. మనసుతో పాడుతుంటాడు.
పాట:
ఇంతకాలమూ లేదే వింత లోకమూ/ యెంటే జారిపడ్డదే మనసే నీకే నీకే/ ఏందమ్మడూ ఏందమ్మడూ/ పిచ్చోన్నయ్యా సే వాట్‌ టు డు/ ఈ కుర్రాడు ఫిక్సయ్యాడు నిన్నొదిలి పోనేపోడు/ ఊపిరై నువ్విక వీడనే వీడవే/ ఊహకే నిదురిక ఉండనే ఉండదే/ మాయ మాయ మాయ మాయ మాయ మాయమ్మ/ సోయ సోయ సోయ సోయ సోయే లేదమ్మా/ మనసు లోపల ఒడ్డున చేపలా ఉందిలే పిల్ల నీ వల్ల/ పూలకొమ్మలా వంగి వంగిలా తాకుతుంటే పడేదెల్లా/ నా వల్ల కాదే బొమ్మా… నీ కళ్ళు చూస్తే అమ్మా/ కిక్కెక్కుతోందే జన్మా హమ్మ హమ్మ హమ్మ..
– డా||తిరునగరి శరత్‌చంద్ర,

[email protected]
సినీ గేయరచయిత, 6309873682

Spread the love