రెండు కోతులు ఒక పిల్లి కథ

మొరుగుతూ కరువ వచ్చే
కుక్కకు బొక్క
ఎలా వేయాలో రాజ్యానికి తెలుసు

తోకూపుతూ వెంట తిరిగేలా
ఎలా దువ్వి మచ్చిక చేసుకోవాలో
నాయకుడికి తెలుసు

నూకలు పెడితే మేకలు కాస్తది
ఆవు తోలు కప్పుకున్న పెద్దపులికి
నొసటన బొట్టు పెట్టి
కాళ్లు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకుంటది

బెదిరింపు ఎక్కడిదాకా అంటే
ఎనుగుల దాకా అన్నట్టు
దీని పుట్టుబడే గంత
పెడితే పెళ్లి కోరుతది
లేకుంటే చావు చేస్తది

వినయ విధేయతలు ప్రదర్శించే నక్కలు
రంగులు మార్చే ఊసరవెల్లులు
వీటి ముందు బలాదూర్‌

బుక్కెడు బువ్వ వేస్తే తింటది
కాళ్లు చాపి సాయమానులో పంటది

గొంతు చించుకు అరవడం లేదు
మీది మీదికి వచ్చి కోర పండ్లతో
పిక్కల్ని చీల్చి కరవడం లేదు
యజమాని కాళ్లను నాలిక తడితో కడిగి
తోక ఊపుడు మాత్రం మరువ లేదు

శునకం రూపంలో ఉన్న మనిషికీ
మనుషుల రూపంలో శతకానికి
ఇప్పుడు పెద్దగా తేడా లేదు

చేతులలో వేప కొమ్మలు
ముఖాన బండారి పూసుకొని
రూపాయి బిళ్ళంత ఎర్రని బొట్టు పెట్టుకుని
సిగాలను ఎగదోస్తూ
అమాయకపు మేకపిల్లలను
అమాంతం గావు పడుతుంది

న్యాయం చెప్పమంటే
బర్రె దుడ్డె నాదేననే
పెద్ద మనిషి తీర్పు
రెండు కోతులు ఒక పిల్లి
రొట్టె పంచడంలో అదే నీతి
ఇప్పుడు మారకుంటే
ఇక ఎప్పుడూ మారదు రీతి
– జూకంటి జగన్నాథం

Spread the love