మనలో ఓ కొత్త ఉత్సాహాన్ని కలిగించిన మనిషి ఎదురైతే జీవితం తీయని వరమనిపిస్తుంది. ఎప్పుడూ ఆ మనిషితోనే ఉండాలనిపిస్తుంది. తన మనసులో పదిలంగా నిలిచిపోయిన ఆ రూపమే కళ్ళముందు కనబడాలని కోరుకోవాలనిపిస్తుంది. అలా స్నేహంగా చిగురించిన ఆ బంధాన్ని గురించి చెబుతూ సురేశ్ బనిశెట్టి ఒక పాటను రాశాడు. 2024 లో అర్జున్ వై.కే. దర్శకత్వంలో వచ్చిన ‘ప్రసన్నవదనం’ సినిమాలోని ఆ పాటనిపుడు పరిశీలిద్దాం.
సురేశ్ బనిశెట్టి ఉరకలెత్తుతున్న సెలయేళ్ళ లాంటి పాటలతో దూసుకువస్తున్న గీతరచయిత. ఎన్నెన్నో పాటల్ని రాశులుగా పోసిన కవి. వినూత్నభావాలతో అలవోకగా రాయగల కవి. ‘ప్రసన్నవదనం’ సినిమాలో ఆయన రాసిన ఈ పాట ఆయన ప్రతిభాపాటవాలకు మెచ్చుతునకగా చెప్పుకోవచ్చు.
రెండు మనసులు స్నేహమనే బాటలో హాయిగా నడుస్తున్నాయి. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం..ఒకరి మీద ఒకరికి చెప్పలేనంత అభిమానం..ఆ స్నేహాన్ని గూర్చి, వారిద్దరి మధ్యన ఉన్న ఇష్టాన్ని గూర్చి వివరిస్తూ రాసిన పాట ఇది. వారిద్దరి మధ్యలోకి దూరాన్ని చేరనివ్వద్దని అనుకుంటారు. మౌనాన్ని కూడా రానివ్వకూడదనుకుంటారు. ఎప్పుడు వారు తమ తమ అభిప్రాయాలను, ఆనందాలను, ఆవేదనలను ఒకరికొకరు పంచుకోవాలనుకుంటూనే ఉంటారు. వారి స్నేహాన్ని ఎంతో అందంగా చెప్పాడు సురేశ్ బనిశెట్టి.
దూరాన్ని పో పో పో అంటూ దూరంగా నెట్టివేస్తున్నారు. దూరాన్ని దూరంగా పంపించడం చాలా కొత్తగా ఉంది..దానికి కారణం..ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతటి అన్యోన్యత వాళ్ళ మధ్య ఉండడమే.. మౌనాన్ని కూడా పో పో అంటూ మనసుల మధ్యకు రావద్దంటూ నెట్టేస్తున్నారు. దానికి కారణం..ఎడతెరిపిలేని తీయని కబుర్లతో వాళ్ళు కలిసి ఉండాలని తపించడమే..ఈ దూరాన్ని, మౌనాన్ని భారంగా వాళ్ళు భావిస్తున్నారంటే దానికి కారణం ఒకరంటే ఒకరికి చెప్పలేనంతటి ఇష్టం ఉండడమే.. ఆ స్నేహమే, ఆ ఇష్టమే వారిని దూరాన్ని, మౌనాన్ని నెట్టేసేలా చేసిందని స్పష్టంగా చెప్పవచ్చు.
ఊహలకు కూడా అందనంతటి వేగంతో వారి హదయాలు మేఘాల్లో ఊగుతున్నాయి. అంతటి సందడితో సంతోషాల మధ్యన వాళ్ళు ఉక్కిరి బిక్కిరైపోతున్నారు. వాళ్ళు బంధించబడలేదు. వాళ్ళు, వాళ్ళ మనసులూ స్వేచ్ఛా విహంగాలై విహరిస్తున్నాయి. వాళ్ళకు పంజరాలంటేమిటో తెలియదు. వాళ్ళ స్నేహం గురించి అందరికి తెలుసు. వాళ్ళ వ్యక్తిత్వాలు కూడా అందరికీ తెలుసు. స్వేచ్ఛకు చిరునామాలా వాళ్ళు కలిసి తిరుగుతుంటారు. కష్టసుఖాలు పంచుకుంటారు. ఇదంతా ఓ మాయలా అనిపిస్తుంది వాళ్ళకి. తీయని హాయిగా తోస్తుంది వాళ్ళిద్దరికీ.
మోమాటాలు వాళ్ళ మధ్యన లేవు.. మనసుల్లో ఏదనిపిస్తే అది మాట్లాడేస్తారు. ఇష్టం వచ్చినట్లుగా ఉంటారు. అలాంటి స్నేహం వాళ్ళది. వెలితి అనే మాట వాళ్ళ మధ్యకు కూడా రాదు. చివరి ఊపిరి వరకు నిర్మలమైన స్నేహంతో కలిసి మెలిసి ఉంటారు. ప్రాణాలు రెండు కావచ్చు. కాని వాళ్ళ ఊపిరి మాత్రం ఒక్కటే. అంత విడలేని బంధం వాళ్ళది. అంత చనువు ఉన్నా హద్దులు దాటకుండా ఉంటారు. ఒకరిపై ఒకరికి చెప్పలేనంతటి ఇష్టంతోనూ ఉంటారు. వీళ్ళ స్నేహం, ఇష్టం చూస్తే అందరికీ వింతగాను, కొత్తగాను అనిపిస్తుంది. ఎవ్వరికీ అర్థమవ్వరు. వాళ్ళ అలవాట్లు, అల్లర్లు, చిరాకులు, కబుర్లు ఎవ్వరికీ అర్థం కావు.
ఇద్దరి ఆనందం ఒకటే..ఇద్దరి ఆశ్చర్యం ఒకటే. ఒకరికి కలిగిన అనుభూతే ఇంకొకరికి కలుగుతుంది. నిజానికి ప్రపంచంలో అందరి అభిప్రాయాలు ఒక తీరుగా ఉండవు. అందరి ఆలోచనలు ఒక తీరుగా ఉండవు. అందరి అనుభూతులు, ఆనందాలు, ఆశ్చర్యాలు ఒకలాగా ఉండవు. ఎవరి ఆనందం వాళ్ళది. కాని వీరిదలా కాదు. ఇద్దరిది ఒకే ఆనందం. అదే ఆశ్చర్యాన్ని కలిగించే విషయం..ఇద్దరి నిర్ణయాలొకటే. అందులో ఎలాంటి మార్పు ఉండదు. వారు కలిసి తీసుకున్న నిర్ణయమైనా ఒకలాగే ఉంటుంది. వేరువేరుగా తీసుకున్న నిర్ణయమైనా ఒకలాగే ఉంటుంది. ఎందుకంటే వారి ఆలోచనలు, వ్యక్తిత్వాలు అంత సన్నిహితంగా కలిసిపోయాయి కాబట్టి. ఇదంతా చూసేవారికి, వీళ్ళ గురించి వినేవాళ్ళకి, వీళ్ళ స్నేహం గురించి తెలుసుకున్నవాళ్ళకి మాయలా అనిపిస్తుంది.
సరళమైన పదాలతో ఇద్దరు స్నేహితుల జీవితాన్ని, అనుభూతులను, ఇష్టాలను అద్భుతంగా చెప్పాడీపాటలో సురేశ్ బనిశెట్టి. సుహాస్, పాయల్ రాధాకష్ణ ల నటన ఈ సినిమాకే వన్నె తెచ్చి పెట్టింది.
పో పో పో పో పో పో పో దూరమా వెళ్ళిపో దూరంగా నువెళ్ళిపో/ మనసుల మధ్యకు రాకు వెళ్ళిపో/ మౌనమా వెళ్ళిపో మౌనంగాను వెళ్ళిపో/మాటల మధ్యల దూరకెళ్ళిపో/ ఊహకి అందని వేగాలే ఊయల ఊపెను మేఘాలే/ పంజరమెరుగని ప్రాణాలే/ స్వేచ్ఛకి చిరునామా వీళ్ళే/ మాయే మాయే మాయేలే/ మోమాటాల జాడ మచ్చుకైన లేదులే/ వెలితి అన్న మాట వీళ్ళ మధ్య రాదులే/ కడదాకా ఇంతేలే/ రెండు ప్రాణాలకి ఒక్కటే ఊపిరే/ చనువు ఎంత ఉన్న చిన్న గీత దాటరే/ లోకానికి అర్థమే అవ్వరే/ ఇద్దరిదొకటే ఆనందం/ఇద్దరిదొకటే ఆశ్చర్యం/ఇద్దరిదొకటే ఈ తీర్పు/ ఎన్నడు రాదు ఏ మార్పు/ మాయే మాయే మాయేలే.
– డా||తిరునగరి శరత్‌చంద్ర,
[email protected]
సినీ గేయరచయిత, 6309873682