మొదట చూసినపుడు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని కల్మేశ్వర్ కూడా దేశంలోని మిగిలిన గ్రామీణ ప్రాంతంలాగా కనిపిస్తుంది. గ్రామానికి చుట్టూ అనేక పారిశ్రామిక కేంద్రాలు ఉన్నాయి. అయితే ఒక అంశం మాత్రం ఈ గ్రామాన్ని ప్రత్యేకంగా చూపుతుంది. ఈ ప్రాంతంలోని 18 గ్రామాలలో ప్రతి ఇంటి తలుపుపై కుటుంబంలోని కుమార్తెల పేరు ఉంటుంది. 2023లో జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్‌తో పాటు మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ప్రారంభించిన నేమ్స్ ఆన్ డోర్స్ అనే ప్రత్యేక చొరవకు ఇది నిదర్శనం. గ్రామీణ బాలికలకు పేరు, స్వరాన్ని ఇస్తున్న ఆ కార్యక్రమం గురించి మరిన్ని వివరాలు…
కల్మేశ్వర్ నగరం 108 గ్రామాలతో చుట్టుముట్టబడి ఉంది. ఆ గ్రామీణ ప్రజలకు శాశ్వత ఆదాయ వనరులు లేవు. ఎక్కువ మంది కార్మికులుగా ఉన్నారు. పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతారు. అయితే గైర్హాజరు, డ్రాపౌట్లు ఎక్కువ. ‘వెనుకబడిన ఈ ప్రాంతంలో యువతులకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో చూస్తే ఆశ్చర్యపోతారు’ అని మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ చీఫ్ ధనశ్రీ బ్రహ్మే ఓ వెబ్‌సైట్‌తో పంచుకున్నారు. మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ 1999లో పేద గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో స్థాపించబడింది. ఇది యువతకు జీవన నైపుణ్యాలు, విద్యా, తోటివారికి మద్దతును అందించడం వంటివి చేస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 35 లక్షల మందికి మద్దతు ఇచ్చింది. ఈ సంస్థ నేపాల్, బంగ్లాదేశ్‌తో పాటు భారతదేశంలోని 23 రాష్ట్రాల్లోని 80 కంటే ఎక్కువ జిల్లాల్లో పనిచేస్తోంది.
బాలికలకు గుర్తింపు
బ్రహ్మే 30 ఏండ్లుగా అభివృద్ధి రంగంలో పనిచేస్తున్నారు. ఆమె ఐక్యరాజ్యసమితి జనాభా నిధిలో భాగంగా ఉన్నారు. లింగ సమస్యలపై విస్తృతంగా పనిచేస్తున్నారు. ఐక్యరాజ్యసమితిలో చేరిన తర్వాత ఆమె లింగ వివక్షకు వ్యతిరేకంగా అట్టడుగు స్థాయి నుండి పని కొనసాగించాలని భావించారు. భారతదేశంలోని అనేక గ్రామీణ ప్రాంతాలలో లింగ అసమానతలు ఇప్పటికీ ప్రబలంగా ఉన్నాయి. కల్మేశ్వర్ వంటి ప్రదేశాలలో ఇప్పటికీ బాలికలకు బాల్య వివాహాలు జరుగుతు న్నాయి. ‘భౌగోళికంగా అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరు అవకాశాలు, అవసరాలు ఉంటాయి. కానీ అమ్మాయిలు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం ముఖ్యం’ అని ఆమె చెబుతున్నారు.
అలల ప్రభావం
అమ్మాయిల్లో పోరాడే ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు ఒక మార్గంగా ఇంటి తలుపులపై వారి పేర్లు ఉండాలనే ఆలోచన ఆమెలో పుట్టింది. ఈ ప్రాంతంలోని 12 నుండి 16 ఏండ్ల వయసు గల కౌమార బాలికలను ఈ కార్యక్రమం కోసం పరిగణించారు. ఈ కార్యక్రమం కలంబి, బోర్గావ్, అడసా, వరోడా వంటి 18 గ్రామాలలో చురుకుగా ఉంది. ‘ఇది ఒక అలల ప్రభావం. ఇంట్లో అమ్మాయిలకు గుర్తింపును ఇవ్వడం వల్ల వారు జీవితంలో మరింత ఆత్మవిశ్వాసంతో ఉంటారు. తాము ఉన్న స్థలాన్ని తమ హక్కుగా ఆక్రమించగలరు’ అని బ్రహ్మే వివరించారు. ఈ కార్యక్రమ ప్రభావం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మాండ్వి, గోండ్ఖైరి గ్రామాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులైన అసవారీ పాటిల్, సంబోధి వాల్కేలకు తమ ఇంటి తలుపులపై తమ పేర్లు చూడటం ఆశ, గర్వానికి చిహ్నంగా భావిస్తున్నారు. ‘అమ్మాయిలుగా మనకు ఇంట్లో బాధ్యతలు ఉంటాయి. కానీ మనకు కలలు కూడా ఉంటాయి’ అని వాల్కే అన్నది.
క్రమంగా అంగీకారం
మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ బృందం ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినప్పుడు ప్రతిఘటనను ముందే ఊహించింది. ‘మనం ఇలా ఎందుకు చేయాలి?’ అనేది బ్రహ్మే బృందం ఎదుర్కొన్న అత్యంత సాధారణ ప్రశ్న. ఎందుకంటే ఇళ్ళు పురుషుడి ఆస్తిగా పరిగణించబడతాయి. ‘సాధారణంగా భర్త తర్వాత ఇంటికి భార్యలకు హక్కు ఉంటుంది. అయితే మేము ఒక అడుగు ముందుకేసి కుమార్తెలపై దృష్టి సారించాము’ అని బ్రహ్మే చెప్పారు. స్థానిక ప్రభుత్వాలు, పాఠశాలలు, గ్రామ పెద్దలతో ఈ బృందం సంప్రదించింది. ‘సమాజంలో వారు గౌరవించబడుతున్నందున ప్రజలు వారి మాట వింటారు. వారితో పనిచేయడం వల్ల ప్రతిఘటనను ఎదుర్కోగలిగాం” అని ఆమె వివరించారు. మొదట జిల్లాలోని 24 పాఠశాలల్లో 9 మాత్రమే ప్రారంభంలో కార్యక్రమంలో భాగం కావడానికి అంగీకరించాయి. ఈ కార్యక్రమానికి బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, పంచాయతీల నుండి గుర్తింపు లభించింది. ‘నా తల్లిదండ్రులు మొదట్లో నిరాకరించారు. కానీ మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్, నా పాఠశాల నుండి వచ్చిన వ్యక్తులు బాలికల సామర్థ్యాలు, బాధ్యతల గురించి వారితో మాట్లాడారు. అమ్మాయిలకు కూడా వారికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి’ అని వాల్కే పంచుకుంది.
అన్ని స్థాయిల్లో మార్పు అవసరం
నేమ్స్ ఆన్ డోర్స్ చొరవ క్రమంగా ఎక్కువ మందిని మాట్లాడేలా చేస్తుంది. ఈ ప్రాంతంలోని బాలికల పట్ల మనస్తత్వాలలో మార్పును ప్రారంభిస్తోంది. ‘ఎవరైనా నా ఇంటి తలుపుపై నా పేరు చూసినప్పుడు, వారు కూడా దీన్ని అనుసరించాలా వద్దా అని ఆలోచిస్తారు’ అని పాటిల్ అంటుంది. అయితే నిజమైన ప్రభావం చూపడానికి సాంస్కృతిక, సంస్థాగత స్థాయిలో కూడా మార్పును పెంపొందించాల్సిన అవసరం ఉంది. ‘బాలికలు కేవలం పాఠశాలకు వెళ్లడం, అక్షరాస్యులుగా మారడం ద్వారా మాత్రమే ఆత్మవిశ్వాసం పెరగదు’ అని బ్రహ్మే అంటున్నారు. ఈ కార్యక్రమ విస్తరణ ఆమె బృందం ఊహించిన దానికంటే పెద్దది. పిల్లల గొంతులను సూచించే బాల్ పంచాయతీతో బృందం పనిచేసింది. వారి తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు, గ్రామ పెద్దలు, పాఠశాల, గ్రామ సర్పంచ్ మాట వింటారని కూడా వారు విశ్వసించారు. నేడు కల్మేశ్వర్ చుట్టూ ఉన్న 18 గ్రామాలలో ఇటువంటి 2,100 నేమ్‌ప్లేట్లు ఉన్నాయి. ఫలితంగా బాలికలు తమ కుటుంబం, సమాజంలో తాము ఒక ముఖ్యమైన భాగమని నమ్మకంగా భావించారు.
రోల్ మోడల్స్‌గా…
మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఈ చొరవను కల్మేశ్వర్‌లోని ఇతర గ్రామాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘ప్రతి ప్రాంతం ఒక కార్యక్రమానికి భిన్నంగా స్పందిస్తుంది. కల్మేశ్వర్‌లో తల్లిదండ్రులు, పాఠశాలలు, వృద్ధులు ఈ చొరవ గురించి వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వారు తమ కుమార్తెలు బాగా చదువుకోవాలని కోరుకుంటారు. ఈ కార్యక్రమం ఇక్కడ బాగా పనిచేస్తుంది. అయితే రాష్ట్రంలోని, దేశంలోని ఇతర ప్రాంతాలకు మనం వేరే విధానాన్ని ప్లాన్ చేసుకోవాలి. లింగ పక్షపాతం వంటి సమస్యలను పరిష్కరించడానికి, కమ్యూనిటీలు, సంస్థలతో కలిసి పనిచేయాలి. వేలాది మంది ప్రముఖులు, క్రీడాకారులు మాకు తోడుగా ఉన్నారు. కానీ స్థానిక రోల్ మోడల్స్ అవసరం’ అని ఆమె బ్రహ్మే అంటున్నారు. ఆసావరి పాటిల్, సంబోధి వాల్కే, వారి స్నేహితులు ఆ ప్రాంతంలోని ఇతర అమ్మాయిలు ఇప్పుడు ఆ రోల్ మోడల్స్‌గా మారారు.