గత ఎన్నికల మ్యానిఫెస్టోపై శ్వేతపత్రం విడుదల చేయాలి

-ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ చల్లా వంశీచంద్ రెడ్డి.
-ఆమనగల్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం. 
-మండలంలోని చెన్నంపల్లి, పోలేపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం.
నవతెలంగాణ-ఆమనగల్ : గత ఎన్నికల్లో విడుదల చేసిన మ్యానిఫెస్టోలో పొందుపరిచిన వాటిలో అమలు చేసిన పథకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలని ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ  నాయకులతో పాటు కల్వకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి సోమవారం ఆమనగల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల మ్యానిఫెస్టోపై శ్వేతపత్రం విడుదల చేయకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పి ఆదివారం ప్రకటించిన మ్యానిఫెస్టోను విడ్రా చేసుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న కుటుంబ పాలనకు గమనించిన ప్రజలు నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో తగిన తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను వంద రోజుల్లోనే అమలు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అవినీతికి ఆమడ దూరంలో ఉండే కసిరెడ్డి నారాయణరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి సోనియా గాంధీకి బహుమతిగా పంపాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకు ముందు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ తనను ఆదరించి ఆశీర్వదిస్తే కేఎల్ఐ డీ 82 కాల్వల పెండింగ్ పనులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అదేవిధంగా మండలంలోని చెన్నంపల్లి, పోలేపల్లి తదితర గ్రామాలలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో వారు పాల్గొని సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా ఆయా మండలాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో వంశీచంద్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ అనిత విజయ్, డీసీసీ ఉపాధ్యక్షులు శ్రీపాతి శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ ముదిరాజ్, ఉపాధ్యక్షులు రమణారెడ్డి, మండల అధ్యక్షులు తెలగమల్ల జగన్, బిచ్యా నాయక్, వస్పుల మానయ్య,  సీనియర్ నాయకులు కృష్ణ నాయక్, వస్పుల శ్రీశైలం, భాస్కర్ రెడ్డి, వేణుపంతులు, హన్మా నాయక్, శ్రీకాంత్ రెడ్డి, అలీం, జహంగీర్ అలి, వస్పుల శ్రీకాంత్, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love