ఏడాదికోసారి..

Once a year..ప్రతిఏటా మార్చి నెలలో ఆమె గుర్తుకొస్తుంది
ఆమె నెత్తిమీద అక్షర అభిషేకం జరుగుతుంది
సభలు సమావేశాలు ఊపందుకుంటాయి
దేవత.. తల్లి..ఇల్లాలు.. ప్రేమ స్వరూపిణి అంటూ
పదాలన్నీ కూర్చి పేర్చిన మాటల గులాబీ మాల
ఆమె మెడలో అందంగా అలంకరించబడుతుంది
ఆమెను వర్ణించేందుకు కలాలన్నీ కొట్లాడుకుంటాయి
కళ్ళతోను కాంక్షతోను చూపుల బాణాలు సంధించబడతాయి
ప్రశంసల పూల జల్లులతో కీర్తి కిరీటాలు సిద్ధమవుతాయి
ఏడాదంతా ఇకపై ఆమె కనిపించదు
ప్రతిరోజు విరిసిన కొత్త పూల పరిమళం
రాత్రిపూట మెరిసే నక్షత్రాల వెలుగులు
ఆమెపై ప్రసరింపబడవు..
కానీ..వినిపించేదొక్కటే
ఎండ వానల ప్రమేయం లేని
పని యంత్రపు చప్పుడు
కవులారా గాయకులారా
పదబంధాలను సిద్ధం చేయండి
రాగాలన్నీ ఈరోజే కూర్చండి
కీర్తనలన్నీ ఇప్పుడే పాడండి
రేపటి రోజున అంతా నిశ్శబ్దమే
అంతటా ఆవరించిన శూన్యమే
తాగి వచ్చి గొడ్డులా బాదినా
ఉదయాన్నే ఒంటిమీద గాయాలను
చీర చుట్టులో దాచుకొని పనికి పరిగెట్టాలి
ఆమె పరుగును ఆపకు
తాను తినకున్నా బిడ్డలకు బాక్సులు కట్టి
బువ్వ పెట్టి బూట్లు తొడిగి బడికి సాగనంపినప్పుడు
ఆలస్యం నీ వల్లే అని విసుక్కోకు
కుతుకుతా ఉడికే అన్నంతో పాటు ఆవిరయ్యే ఆశలను
గంజి వార్చి మూతపెట్టినప్పుడు
అన్నం మాడ్చేసావని అక్కసు వెళ్ళగక్కకు
పళ్ళెంలో అన్నం పెడుతూ
అడ్డొచ్చిన పచ్చిమిర్చి కరివేపాకు
తీసి మరీ వడ్డించే ఆ ప్రేమను
పక్కనపెట్టి కంచాన్ని విసిరి కొట్టకు
కిక్కురు మనకుండా ఉన్నతనను
ఆత్మాభిమానం నీకెందుకని ఆవేశంతో అరవకు
ఎలా అణగదొక్కాలా అని
పదేపదే పథకాలు రచించకు
ఆమెలేని నీ జీవితం నీ ఊహలలో
ఒకే ఒక్కసారి నింపుకో..
నీ ఆలోచన మారుతుందేమో
నీ చుట్టూ అల్లుకున్న జీవితంలో
అపశృతులను భరించే ఆమెను చూడు
నీవు చూపే ప్రతాపం నీ పెత్తనం
ఎప్పటికీ తనమీదేనని ఆమెకు తెలుసు
ఆ సహనం అలుసుగా ఆవేశపడకు
నీకు ప్రతి రాత్రి చీకటి
ఆమెకు నీతో బ్రతుకంతా చీకటే!
ఆమెపై నీ దృష్టి సాగనంత వరకు
ఆమె కోసం నిన్ను నీవు మార్చుకోనంతవరకు
ఆమెను ఆమెగా చూడనంతవరకు
ఆమెను పొగిడే ప్రతి అక్షరం
నిన్నే ప్రశ్నిస్తుంది
సమాధానాలు చెప్పగలవా
సిద్ధం చేసుకో ఇక మొదలెట్టు..
– డా. సమ్మెట విజయ

Spread the love