రెండు ఉద్యోగాలు సాధించిన యువకుడు

A young man with two jobs– ఏఈఈ గా ఎంపికైన చిట్యాల యువకుడు 

– తండ్రి మృతి.. అన్నీ అమ్మా, అన్నే..
– కుటుంబాన్ని బాగా చూసుకుంటా: కళ్యాణ్ 
నవతెలంగాణ – పెద్దవంగర
ప్రభుత్వ ఉద్యోగం చాలా మంది కల. దాని కోసం గంటల తరబడి కష్టపడి చదువుతారు. కానీ కొందరు మాత్రమే ఉద్యోగ సాధనలో సక్సెస్ అవుతారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఉంది. ఒక్కో పోస్టుకు వేలల్లో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఒక్క ఉద్యోగం సాధించడమే కష్టమనుకుంటున్న ఈ రోజుల్లో ఓ యువకుడు రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు. మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన ఈదురు కళ్యాణ్ నీటి పారుదల ఏఈఈ గా ఉద్యోగం సాధించారు. ఇటీవల విడుదలైన గ్రూప్ 4 ఫలితాల్లో సత్తా చాటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైయ్యరు. ఈదురు బిక్షపతి – ఉమారాణి దంపతులకు జగదీష్, కావ్య, కళ్యాణ్ సంతానం. బిక్షపతి కండక్టర్ పని చేస్తూ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. 2018 లో ఆయన గుండె పోటుతో మృతి చెందారు. తండ్రి మరణానంతరం అన్నీ అమ్మా అన్నే చదివించారు. కళ్యాణ్ తొర్రూరు లోని శారదా స్కూల్ లో పదవ తరగతి పూర్తి చేసి, ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ చేశాడు. కాకినాడలో అగ్రికల్చర్ బీటెక్ పూర్తి చేసి, కోచింగ్ తీసుకోకుండానే స్వంతంగా పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యడు. ఇటీవల విడుదలైన ఏఈఈ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 41 ర్యాంకు సాధించి, ఏఈఈ గా ఎంపికయ్యాడు. కళ్యాణ్ తొలి ప్రయత్నం లోనే కొలువు సాధించడం పట్ల గ్రామస్తులు అభినందించారు.
కుటుంబాన్ని బాగా చూసుకుంటా: కళ్యాణ్ 
ఎలాగైనా ప్రభుత్వ కొలువు సాధించాలని పట్టుదలతో చదివాను. తండ్రి మరణానంతరం అన్నీ అమ్మా అన్నే చదివించారు. వారి ప్రోత్సాహంతో కోచింగ్ తీసుకోకుండానే గ్రూప్ 4, ఏఈఈ కొలువులు సాధించాను. ఏఈఈ గా ఉద్యోగం సాధించడం ఆనందంగా ఉంది. కుటుంబాన్ని బాగా చూసుకుంటా, ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తా.
Spread the love