లేబర్‌ కోడ్స్‌ రద్దే ప్రధాన ధ్యేయం

లేబర్‌ కోడ్స్‌ రద్దే ప్రధాన ధ్యేయం– శాండ్విక్‌ పరిశ్రమ వద్ద సభలో సీపీఐ(ఎం) అభ్యర్థి మల్లికార్జున్‌
– రూ.రెండు లక్షల విరాళం అందజేసిన కార్మికులు
నవ తెలంగాణ – పటాన్‌ చెరు
కార్మికవర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని పటాన్‌చెరు సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి జె.మల్లికార్జున్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పారిశ్రామిక ప్రాంతంలోని శాండ్విక్‌ పరిశ్రమ వద్ద జరిగిన సభలో మల్లికార్జున్‌ కార్మికులనుద్దేశించి మాట్లాడారు. లేబర్‌ కోడ్లను రద్దు చేయాలనే ప్రధాన సంకల్పంతో సీఐటీయూ పోరాటం చేస్తోందన్నారు. కాంట్రాక్టు వ్యవస్థను రూపుమాపే విధంగా ఏ ఒక్కరూ చొరవ చూపటం లేదని, అదే ఈ పారిశ్రామిక ప్రాంతం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థిని చట్టసభకు పంపిస్తే కార్మికవర్గం ప్రధాన సమస్యలపై చట్టసభలో గొంతెత్తుతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శాండ్విక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ తరపున సీపీఐ(ఎం) అభ్యర్థి జె.మల్లికార్జున్‌కు రూ.2 లక్షలు విరాళం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం, రాజయ్య, పాండురంగారెడ్డి, నాగేశ్వరరావు, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love