– ఈడీ సమన్లకు స్పందించని కేజ్రీవాల్
న్యూఢిల్లీ : మద్యం కుంభకోణానికి సంబంధించిన ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పంపిన సమన్లపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించలేదు. ఆయన సోమవారం ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఏడోసారి గైర్హాజరు అయ్యారు. ఈ వ్యవహారంపై వచ్చే నెల 16వ తేదీన ఢిల్లీ కోర్టులో విచారణ జరుగుతుందని, అప్పటి వరకూ ఈడీ వేచి ఉండాల్సిందేనని అమ్‌ఆద్మీ పార్టీ వ్యాఖ్యానించింది. ‘కేజ్రీవాల్‌కు రోజూ సమన్లు పంపే బదులు కోర్టు నిర్ణయం కోసం ఈడీ వేచి చూడాల్సి ఉంటుంది’ అని పార్టీ తెలిపింది. మోడీ ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ ఇండియా కూటమి నుండి వైదొలిగే ప్రశ్నే లేదని అమ్‌ఆద్మీ స్పష్టం చేసింది. ప్రతిపక్ష కూటమి నుండి నిష్క్రమించేలా తమ పార్టీపై బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని, అందుకోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోందని ఆ పార్టీ ఇప్పటికే ఆరోపించింది. కాగా తన సమన్లను కేజ్రీవాల్ పట్టించుకోవడం లేదంటూ ఢిల్లీ కోర్టులో ఈడీ ఫిర్యాదు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన న్యాయస్థానం మార్చి 16 వరకూ వ్యక్తిగత హాజరు నుండి ఆయనకు మినహాయింపు ఇచ్చింది. ఆయన ఇటీవల కోర్టు ఎదుట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. గత నవంబర్ నుండి తనకు ఈడీ జారీ చేస్తున్న సమన్లపై ఢిల్లీ ముఖ్యమంత్రి మండిపడ్డారు. అవి చట్టవిరుద్ధమైనవని, వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అయితే విచారణ నుండి తప్పించుకునేందుకే కేజ్రీవాల్ సమన్లను బేఖాతరు చేస్తున్నారని బీజేపీ నేత హరీష్ ఖురానా విమర్శించారు.
సిసోడియాపై తప్పుడు కేసు : సీఎం
ఇదిలావుండగా మద్యం కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ముఖ్య మంత్రి కేజ్రీవాల్ సోమవారం రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మునికి శ్రద్ధాంజలి ఘటించారు. సిసోడియాపై తప్పుడు కేసు మోపారని, ఆయనకు వ్యతిరేకంగా కేంద్ర దర్యాప్తు సంస్థ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని కేజ్రీవాల్ మీడియాకు చెప్పారు. ‘మా ప్రభుత్వంలో అత్యంత సమర్ధుడైన విద్యా మంత్రిని గత సంవత్సరం ఇదే రోజు ఓ తప్పుడు కేసులో ఇరికించి కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసింది’ అని ఆయన చెప్పారు. సిసోడియా బీజేపీలో చేరి ఉంటే ఆయనపై పెట్టిన కేసులు ఎత్తేసి ఉండేవారని, కానీ ఆయన ఆ పని చేయలేదని అన్నారు. పలువురు ఆప్ నేతలు కూడా కేజ్రీవాల్‌తో పాటు రాజ్‌ఘాట్‌ను సందర్శించారు.