మీ కమిషనే తప్పు…విచారణ నుంచి తప్పుకోండి

మీ కమిషనే తప్పు...విచారణ నుంచి తప్పుకోండి– జస్టిస్‌ ఎల్‌ నర్సింహారెడ్డి కమిషన్‌కు మాజీ సీఎం కేసీఆర్‌ లేఖ
– యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ స్టేషన్ల నిర్మాణంపై వివరణ
– ఛత్తీస్‌గఢ్‌పై కూడా…
– మీకేం చెప్పినా ప్రయోజనం ఉండదని వ్యాఖ్య
– విచారణ పూర్తికాకముందే, తీర్పు ఎలా చెప్తారని ప్రశ్న
– కచ్చితంగా ఇది రాజకీయ కక్షసాధింపే…
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఛత్తీస్‌గఢ్‌ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ కేంద్రాల నిర్మాణం అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్‌ ఎల్‌ నర్సింహారెడ్డి ఏకసభ్య కమిషన్‌ పూర్తిగా చట్ట వ్యతిరేకమనీ, ఆయన స్వచ్ఛందంగా ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు రాతపూర్వకంగా కమిషన్‌కు ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. శనివారంనాడాయన కమిషన్‌కు 12 పేజీల లేఖను రాసారు. అంతకుముందు జులై 30 వరకు తనకు వివరణ ఇచ్చేందుకు గడువు కావాలని కేసీఆర్‌ కోరగా, జూన్‌ 15లోపు సమాధానం ఇవ్వాలని జస్టిస్‌ ఎల్‌ నర్సింహారెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్‌ కమిషన్‌పై తీవ్ర ఆక్షేపణలు చేశారు. ఏం నివేదిక ఇవ్వాలో ముందే నిర్ణయించుకొని, నామ్‌కే వాస్తేగా వివరణలు కోరుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ రాసిన లేఖలోని ప్రధానాంశాల్లో….”రాజకీయ కక్షతో నన్ను, అప్పటి మా ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం విచారణ కమిషన్‌ ఏర్పాటు చేసింది. కరెంటు కోసం అంగలార్చిన తెలంగాణలో అప్పటి మా ప్రభుత్వం గణనీయమార్పు చూపించి, అన్ని రంగాలకూ 24 గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చిన సంగతి అందరికీ తెలుసు. దీన్ని తక్కువచేసి చూపించడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నించడమే అత్యంత దురదష్టకరం అనుకుంటే, కమిషన్‌ చైర్మెన్‌గా నియమితులైన మీరు పత్రికా విలేకరుల సమావేశంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నాకెంతో బాధ కలిగించింది. నిజానికి మీ పిలుపు మేరకు, లోక్‌సభ ఎన్నికల తర్వాత, 2024 జూన్‌ 15లోగా నా అభిప్రాయాలను మీకు సమర్పించాలని అనుకున్నాను. కానీ ఒక ఎంక్వయిరీ కమిషన్‌ సంప్రదాయాలకు విరుద్ధంగా, విచారణ పూర్తికాక ముందే మీరు విలేకరుల సమావేశం నిర్వహించడం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి, పదేండ్లు పరిపాలించిన నా పేరును ప్రస్తావించడం, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నేను వ్యవధి అడిగితే దాన్ని కూడా ఏదో దయతలిచి ఇచ్చినట్టు మాట్లాడడం నాకెంతో బాధ కలిగించింది. విచారణ అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ఇరు పక్షాల మధ్య ఒక వివాదం తలెత్తినప్పుడు, మధ్యవర్తిగా నిలిచి, అసలు నిజాన్ని నిగ్గుతేల్చాల్సిన విధి. అన్ని విషయాలను, అన్ని కోణాల్లో సమగ్రంగా పరిశీలించి, పూర్తి నిర్ధారణకు వచ్చిన తర్వాత, డాక్యుమెంటరీ ఎవిడెన్సులతో బాధ్యులకు మాత్రమే నివేదిక ఇవ్వాల్సిన గురుతరమైన పని. కానీ మీ వ్యవహారశైలి అలా లేదని చెప్పడానికి చింతిస్తున్నాను. ఎంక్వయిరీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీరు చేసిన ఏ వ్యాఖ్యను గమనించినా, మీరు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలన్న అభిప్రాయంతోనే మాట్లాడుతున్నట్టు స్పష్టమవుతున్నది. ఇప్పటికే తప్పు జరిగిపోయినట్టు, ఇక ఆ తప్పు వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉందన్నట్టు మీ మాటలు స్పష్టంచేస్తున్నాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైరైనప్పటికీ మీ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది. విచారణ పూర్తి కాక ముందే తీర్పు ప్రకటించినట్టుగా మీ మాటలున్నాయి. మీ విచారణలో నిష్పాక్షికత ఎంతమాత్రం కనిపించడం లేదు. అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతున్నది.
పైన పేర్కొన్న అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని మీరు ఈ ఎంక్వయిరీ కమిషన్‌ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను”. అని పేర్కొన్నారు. మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని కూడా తేల్చిచెప్తూనే రాష్ట్ర ఆవిర్భావం, కరెంటు కష్టాలు, అప్పటి సర్కారు నిర్ణయాలను ప్రస్తావించారు. అన్ని రకాల చట్టాలు, నిబంధనలను పాటిస్తూనే, కేంద్ర, రాష్ట్ర అనుమతులు సాధిస్తూ ముందుకెళ్లామన్నారు. విద్యుత్‌ నియంత్రణా మండళ్లు (ఈఆర్సీ) వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదనీ, ఈ విషయం కూడా రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించారు. ”విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంట్‌ ఏ మాత్రం సరిపోదు. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ పటిష్ఠానికి నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నాం” అని తెలిపారు. విలేకరుల సమావేశంలో కమిషన్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడిందనీ, గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలని మాట్లాడుతున్నట్టు ఉందే తప్ప, విచారణలో ఎలాంటి నిష్పాక్షికత కనిపించట్లేదన్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు విద్యుత్‌ వాటా 53.89 శాతం ఉన్నా 2,700 మెగావాట్ల కొరత ఉండేది. విభజన చట్టాన్ని ఏపీ ఉల్లంఘించడం వల్ల 1,500 మెగావాట్ల లోటు ఏర్పడింది.
గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ఇవ్వకపోవడం వల్ల 900 మెగావాట్ల లోటు…మొత్తంగా 5 వేల మెగావాట్ల విద్యుత్‌ లోటుతో తెలంగాణ ఉన్నదని వివరణ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌ ఒప్పందం పూర్తి పారదర్శకంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిందనీ, యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ కేంద్రాల నిర్మాణాలు కేంద్ర ప్రభుత్వ సంస్థ బీహెచ్‌ఈఎల్‌తో ఒప్పందం ప్రకారం జరిగిందని వివరించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగలేదనీ, లేనిదాన్ని ఉన్నట్టు చూపించే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. 2014లో విద్యుత్‌ వ్యవస్థాపిత సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా పదేండ్లలో ఆ సామర్థ్యాన్ని 20 వేల మెగావాట్లకు పెంచామని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్‌ విజయాలు ఆషామాషీగా రాలేదనీ, చట్టపరంగా, నిబంధనలకు అనుగుణంగా విద్యుత్‌ కొనుగోళ్లు జరిగాయని చెప్పారు. దురుద్దేశాలను ఆపాదిస్తూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసిందని ఆరోపించారు.

Spread the love