గౌరీ లంకేష్‌ హత్య కేసులో నిందితుడికి బెయిల్‌

Accused in Gauri Lankesh murder case granted bail– విచారణలో జాప్యమే కారణమని తెలిపిన కర్నాటక హైకోర్టు
బెంగళూరు : జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌, రచయిత ఎంఎం కల్‌బుర్గీ హత్య కేసులను త్వరితగతిన విచారించేందుకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఓ నిందితుడికి కర్నాటక హైకోర్టు తాజాగా బెయిల్‌ మంజూరు చేసింది. పాత్రికేయురాలు గౌరీ లంకేష్‌ హత్య కేసులో 11వ నిందితుడైన మోహన్‌ నాయక్‌కు హైకోర్టు శుక్రవారం బెయిల్‌ ఇచ్చింది. గౌరీ లంకేష్‌ తన నివాసంలో ఉండగా 2017 సెప్టెంబర్‌ ఐదున కొందరు దుండగులు కాల్చి చంపారు. ఈ కేసులో 18 మంది నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసినప్పటికీ విచారణలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. నాయక్‌కు బెయిల్‌ మంజూరు కావడానికి ఇది ఓ కారణం. నిందితుడు 2018 జూలై 18 నుండి కస్టడీలోనే ఉన్నాడు.
‘ఈ కేసులోని 527 మంది ఛార్జిషీటు సాక్షులలో కేవలం 90 మందిని మాత్రమే విచారించారు. విచారణను వేగవంతం చేయాలని ట్రయల్‌ కోర్టును మేము 2019 ఫిబ్రవరి 11న ఆదేశించాం. 2021 అక్టోబర్‌లో అభియోగాలు మోపినప్పటికీ ఇంకా 400 మందికి పైగా సాక్షులను విచారించాల్సి ఉంది. గడచిన రెండు సంవత్సరాల కాలంలో కేవలం 90 మందిని మాత్రమే విచారించారు. దీనిని బట్టి చూస్తే విచారణ ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. పిటిషనర్‌ ఐదు సంవత్సరాలకు పైగా కస్టడీలో ఉన్నాడని గుర్తు చేసింది. కాగా తన ప్రమేయానికి సంబంధించి 23 మంది సాక్షులను విచారించాల్సి ఉండగా కేవలం ఒక్కరిని మాత్రమే విచారించారని నాయక్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. నాయక్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం లక్ష రూపాయల వ్యక్తిగత బాండ్‌, అంతే మొత్తానికి రెండు పూచీకత్తులు సమర్పించాలన్న షరతుతో బెయిల్‌ మంజూరు చేసింది.

Spread the love