చంద్రుడిపై బిలాలు !

– రెండు వీడియోలు విడుదల చేసిన ఇస్రో
– ల్యాండర్‌ కక్ష్య వేగాన్ని తగ్గించిన శాస్త్రవేత్తలు
– 23న చంద్రునిపై దిగే అవకాశాలు?
బెంగళూరు : అంతరిక్ష నౌక చంద్రయాన్‌-3లో ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుండి విడివడిన ల్యాండర్‌ మాడ్యూల్‌కు శుక్రవారం డీ బూస్టింగ్‌ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. డీ బూస్టింగ్‌ అంటే చంద్రుని చుట్టూ తిరిగే కక్ష్య వేగాన్ని తగ్గించడమే. ప్రస్తుతం ల్యాండర్‌ మాడ్యూల్‌ కక్ష్యని చంద్రుని ఉపరితలానికి మరింత దగ్గరగా 113కిమీ-157కిమీ. కి తగ్గించినట్లు ఇస్రో ఎక్స్‌ (పూర్వపు ట్విటర్‌) వేదికగా ప్రకటించింది. తిరిగి 20వ తేదీన తెల్లవారు జామున 2గంటలకు రెండో డీ బూస్టింగ్‌ ఆపరేషన్‌ను నిర్వహించనున్నట్లు ఇస్రో తెలిపింది. 23వ తేదీన సాయంత్రం 5.47గంటల సమయంలో చంద్రుని ఉపరితలంపై ల్యాండర్‌ దిగే అవకాశం వుందని భావిస్తున్నట్లు ఇస్రో పేర్కొంది. గురువారం ప్రొపల్సన్‌ మాడ్యూల్‌, ల్యాండర్‌ మాడ్యూల్‌ రెండు విజయవంతంగా విడిపోయి తమ తమ నిర్దేశిత ప్రయాణాలు ఆరంభించాయి. ఇస్రో ప్రయోగించిన ల్యాండర్‌, రోవర్‌ల జీవిత కాలం 14రోజులు కాగా ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ మాత్రం మూడు నుండి ఆరు మాసాల పాటు పనిచేస్తుంది. చంద్రయాన్‌-3 పంపించిన చంద్రునిపై రెండు వీడియోలను ఇస్రో శుక్రవారం విడుదల చేసింది. ల్యాండర్‌ పొజిషన్‌ డిటెక్షన్‌ కెమెరా (ఎల్‌పిడిసి)తో ఈ నెల 15న మొదటి వీడియోను తీసింది.17వ తేదీన ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుండి ల్యాండర్‌ విడిపోయిన వెంటనే ల్యాండర్‌ ఇమేజర్‌ కెమెరా-1 చంద్రుడి వీడియో ఒకటి తీసి పంపింది. ఇందులో చంద్రుడి ఉపరితలాన్ని, బిలాలను స్పష్టంగా చూపిస్తున్న పలు విజువల్స్‌ వున్నాయి. ఆ ఫోటోల్లో కనిపించే బిలాలను ఫాబ్రీ, గార్డనో బ్రూనో, హర్కెబీ జె పేర్లతో ఇస్రో పేర్కొంది. చంద్రయాన్‌-3ని ప్రయోగించిన తర్వాత ఇస్రో ఇప్పటివరకు మూడు వీడియోలను విడుదల చేసింది.
లూనా-25వ మొదటి ఫోటో రష్యా పంపిన ఆటోమేటిక్‌ ఇంటర్‌ప్లానెటరీ స్టేషన్‌ లూనా-25 చంద్రుని ఆవల వైపున గల ధృవ బిలాన్ని ఫోటోలు తీసి భూమికి పంపించిందని రష్యా అంతరిక్ష సంస్థ గురువారం వెల్లడించింది.

Spread the love