– మొదటి విడతలో మిగిలిన ఖాళీలు 22,753
– రెండో విడత కౌన్సెలింగ్లో అందుబాటులో 29,777 సీట్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరంలో 2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం శుక్రవారం నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రెండో విడతలో ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించి అదనంగా 7,024 సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎప్సెట్ ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎప్సెట్ ఇంజినీరింగ్ మొదటి విడత కౌన్సెలింగ్లో 78,694 సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. 75,200 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించామని తెలిపారు. వారిలో 55,941 మంది ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారని పేర్కొన్నారు. మొదటి విడతలో 22,753 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. రెండో విడత కౌన్సెలింగ్లో మొత్తం 29,777 సీట్లు అభ్యర్థులకు అందుబాటులో ఉన్నాయని వివరించారు. శనివారం ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. శని, ఆదివారాల్లో వెబ్ఆప్షన్లను నమోదు చేసేందుకు అవకాశముందని తెలిపారు. ఈనెల 31న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. ఇతర వివరాలకు https: //tgeapcet. nic.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.