
మండలంలోని ఎస్సీ, ఎస్టీ, ఇతర కులాల మహిళా రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యాంత్రీకరణ యంత్రాలు ఇవ్వడం జరుగుతుందని శుక్రవారం స్థానిక వ్యవసాయ శాఖ అధికారి అనిల్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆళ్ళపల్లి మండలానికి మొత్తం 11 వ్యవసాయ యాంత్రికరణ పరికరాలు మంజూరు అయ్యాయన చెప్పారు. వాటిలో బ్యాటరీ పంపులు-4, పవర్ పంపులు-3, డిస్క్ హ్యారో, కల్టివేటర్-2, రోటోవేటర్-1 విత్తనాలు, ఎరువులు నాటే యంత్రం-1 ఉన్నాయన్నారు. దీనికి గాను ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులకు 50 శాతం రాయితీ ఉంటుందని, ఇతర కులాల మహిళా రైతులకు 40 శాతం రాయితీ కలదని చెప్పారు. ఆసక్తి గల రైతులు మట్టి పరీక్ష పత్రం తప్పనిసరి కావాలని అదేవిధంగా ఆసక్తి గల రైతుల పట్టా పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, ట్రాక్టర్ యజమాని వివరాలు, ఆర్సీ జిరాక్స్ జత పరిచిన దరఖాస్తును ఆళ్ళపల్లిలోని రైతు వేదికలో ఇవ్వాలని సూచించారు.