దేశానికి తిండి పెట్టే వ్యవసాయ రంగాన్నే తమ ఉపాధి మార్గంగా మార్చుకుని.. ఆ రంగం అభివద్ధి కోసం కషి చేస్తున్నారు ఈ యువత. కళాశాల ఆధ్వర్యంలో కూరగాయలు, వరి సాగు, కోళ్ల పెంపకం చేస్తూ వ్యవసాయంపై పట్టుసాధిస్తున్నారు. ఈ సాగు ద్వారా వచ్చిన ఆదాయంతో కొత్త మెలకువలు నేర్చుకుంటున్నారు ఈ విద్యార్థులు. వ్యవసాయంపై ఆసక్తి.. రైతన్నకు బాసటగా నిలవాలనే సదుద్దేశ్యంతో అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ కోర్సులో చేరారు రెండు తెలుగు రాష్ట్రాల యువత. కళాశాల ఇచ్చిన ప్రోత్సాహంతో చేను బాట పట్టారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రైతు పడే కష్టాలను విద్యార్థి దశ నుంచి అవగాహన చేసుకుంటున్నారు. చదువుతో పాటు వ్యవసాయ పనులు చేస్తూ తమకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఓపక్క ఉన్నత విద్యలో రాణిస్తూ మరోపక్క వ్యవసాయ పనుల్లో ముందుంటూ పలువురి మన్ననలు పొందుతున్నారు.
చదువుతో పాటు వ్యవసాయంపై మక్కువతో పలువురు విద్యార్థులు వ్యవసాయ పనుల్లో రాణిస్తూ రైతుల మన్ననలు పొందుతున్నారు. వ్యవసాయమంటే చిన్నచూపు కాదని.. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలంటూ సగౌరవంగా చెబుతూ వ్యవసాయ పనులు చేస్తున్నారు. వలస కూలీల కంటే వేగంగా వరినాట్లు వేస్తూ తమకంటూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. దుబ్బాకలో పలువురు యువత ఓపక్క విద్యనభ్యసిస్తూ మరోపక్క వ్యవసాయ పనులు చేస్తూ చదువుకయ్యే ఖర్చులను సంపాదించుకుంటున్నారు.
వ్యవసాయ పనులపై ఆసక్తి
నాటేయడంలో తామేమీ తక్కువ కాదని స్థానిక యువత తమకంటూ ప్రత్యేకతను కనబర్చుతున్నారు. ఓపక్క విద్యనభ్యసిస్తూ, మరోపక్క వ్యవసాయంలో తల్లిదండ్రులకు ఆసరాగా మారారు. స్నేహితులతో కలిసి నాటేసేందుకు విద్యార్థులు ప్రత్యేక ఆసక్తి కనబర్చుతున్నారు. నాటేయటంలో ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మడుల్లో నాటేసి ఆశ్చర్యపరుస్తున్నారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేటలో ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. అంతేగాకుండా గ్రామంలో ఇతర రైతులకు సైతం కూలీలుగా నాటేసేందుకు వెళ్తున్నారు. ఒక ఎకరానికి నాటేసేందుకు రూ.5 వేల వరకు కూలీ చెల్లిస్తున్నారు. కూలీల కొరతతో ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు అధిక కూలీ డిమాండ్ చేయడంతో రైతులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానిక యువకులు వలస కూలీలు డిమాండ్ చేసే అవకాశం ఇవ్వకుండా.. వారే వ్యవసాయ పనులు చేసేందుకు సిద్ధమయ్యారు. లచ్చపేటలో పదిమంది విద్యార్థులు ఒక జట్టుగా మారి పొలం దున్నడం నుంచి నాట్లు వేసే వరకు రైతులకు వ్యవసాయ పనుల్లో సాయపడుతున్నారు.
నూతన ఆలోచనలకు శ్రీకారం
అధ్యాపకుల మార్గనిర్దేశంలో నూతన ఆలోచనలకు శ్రీకారం చుడుతూ.. రైతన్నకు చేదుడుగా ఉండేందుకు సమాయత్తమయ్యారు ఈ విద్యార్థులు. కళాశాలలో చేరిన మొదటి ఏడాది నుంచే వ్యవసాయ ఆధారిత పంటలు, సాగులు, దిగుబడి, రాబడి, లాభనష్టాలు, సమాజహిత పంటలు, ఆర్గానిక్ పంటల సాగుబడితో పాటుగా ఆక్వా, పౌల్ట్రీ పరిశ్రమలపైన దష్టి పెట్టారు. సేంద్రీయ వ్యవసాయంలో భాగంగా చిరుధాన్యాలు, అరటి, మొక్కజొన్న, వరి, మినుములు, పెసలు, కంది వంటి.. పంటలను అందుబాటులో ఉన్న విస్తీర్ణంలో పడిస్తున్నారు. మండువేసవిలోనూ కూరగాయలను విభిన్నపద్ధతుల్లో పండించేందుకు అనువుగా పాలీహౌస్‌ను ఏర్పాటు చేసుకున్నారు. కోళ్ల పెంపకంలో అరుదైన కడక్‌నాద్ కోళ్లు, గిన్నె కోళ్లు, నాటుకోళ్లను పెంచుతున్నారు.
వ్యవసాయంలో నూతన పద్ధతులు, ఇతర దేశాల్లో రాణిస్తున్న విధానాలను అవగతం చేసుకుంటూ పరిశీలనాత్మకంగా సాగు చేస్తున్నారు. అలాగే మొక్కలను పీడించే తెగుళ్లు, పురుగులను ఎలా నివారించాలో ప్రయోగాల రూపంలో చేస్తూ నైపుణ్యం సాధిస్తున్నారు. కూరగాయలను, ఇతర పంటలు, గుడ్లను విక్రయిస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుండీల్లో చేపలను పెంచి అమ్ముతున్నారు. వచ్చిన డబ్బులతో కొత్త మెలకువలు నేర్చుకోవడానికి ఖర్చుచేస్తున్నారు. కళాశాలలో చదువులు, వ్యవసాయ క్షేత్రంలో పంటలు, ప్రతీ సెమిస్టర్ తర్వాత రైతులతో సమావేశ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఈ విద్యార్థులు. తద్వారా ప్రతిభ, నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుంటున్నారు. తమకు తెలియని అనేక విషయాలను రైతుల నుంచి నేరుగా తెలుసుకుంటున్నామని.. మరికొన్ని విషయాల్లో రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నామని విద్యార్థులు చెబుతున్నారు.
రసాయన ఎరువులకు ప్రత్యమ్నాయంగా సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నారు ఈ విద్యార్థులు. రైతులు కూడా సేంద్రీయ ఎరువుల వినియోగంపై దష్టి సారిస్తే ఆరోగ్యంతో పాటు ఆర్థికంగానూ మంచి లాభాలు సంపాదించవచ్చని అంటున్నారు. తమ కాలేజీలో చదువుకునే ప్రతీ విద్యార్థి ఉపాధి పొందేటట్లు తయారు చేస్తున్నామని అధ్యాపకులు చెబుతున్నారు. తరగతి గదిలో అధ్యాపకులు చెప్పిన విషయాలను వ్యవసాయ క్షేత్రంలో ప్రాక్టికల్‌గా చేస్తున్నారు వీరు. నేర్చుకున్న శాస్త్రీయ పద్ధతులను రైతులకు వివరిస్తున్నారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగం, దాని అనుబంధ రంగాల్లో స్థిరపడి రైతులకు అండగా ఉంటామని విద్యార్థులు చెబుతున్నారు. సరైన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తే మంచి లాభాలు సంపాదించవచ్చని అభిప్రాయ పడుతున్నారు.
– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417