కవిత్వం నన్నెప్పుడూ వూరించే మోహోద్విగ పరిసరం

Poetry A fascinating environment that always amazes me‘ఆకు కదలనిచోట’ అతడొక పద్యం. ‘ ఎగరాల్సిన సమయం’లో ఎగిరే చైతన్య పతాకం. ‘నీళ్లలోని చేప’తోనే కాదు… ‘భూమి పెదాలపై’ కూడా కవిత్వాన్ని పలికించే యువ కవి. ‘నిర్వేద స్థలం’లో ‘దు:ఖపు ఒరపు’ పట్టుకున్న ‘తరగతి గది స్వప్నం’. మొత్తానికి ‘అతనొక అస్తిత్వ వాచకం’. ఉత్తరాంధ్ర కవి, కేంద్రసాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత బాల సుధాకర్‌ మౌళి పరిచయం ఈ వారం జోష్‌.
Poetry A fascinating environment that always amazes meబాల సుధాకర్‌ మౌళి అడుగులు సాహిత్యం వైపు పడడానికి దారితీసిన పరిస్థితులు?
మా నాన్న రంగస్థల నటుడు, చిత్రకారుడు, హార్మోనిస్టు, పద్యనాటక రచయిత. ‘మహారథికర్ణ’ అని ఒక పద్య నాటకం, రెండు సామాజిక నాటకాలు, రెండు శతకాలు, ఒకటి రెండు కథలు, కొన్ని జనం పాటలు రాశారు. మా నాన్న చిన్నప్పుడే చనిపోయిన తాత జానపద పాటల ప్రేమికుడు. పాడేవాడు కూడాను. ‘భామా కలాపం’ నాటకంలో ఒక పాత్ర కూడా వేశాడట. మా ఇంట్లో బీరువా నిండా శతక సాహిత్యం, కన్యాశుల్కం వంటి నాటకాలు, మాలపల్లి, చిత్రకళకు సంబంధించిన పుస్తకాలు, మార్క్సిస్టు లిటరేచరూ వుండేవి.
భూషణం మాస్టారి కథలు, ఇతర సాహిత్యం ఇంటికి తీసుకొచ్చేవారు నాన్న. వంగపండు ‘భూమి భాగోతం’ జనాల మధ్య చూసిన అనుభవాన్ని చెప్పేవారు. చిన్నప్పుడు ఎక్కువగా బొమ్మలు వేసేవాడిని. ఎప్పుడైతే శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’, రావూరి భరద్వాజ ‘వెలుతురు చినుకులు’ చదివానో అప్పటి నుంచి కవిత్వం నా బాహ్య అంత్ణప్రపంచాలను ఆక్రమించింది.
మా అమ్మైతే మా వూర్లో రాత్రిపూట- బోనోల పాటలకు, బుర్రకథలకు హాజరయ్యీది. మా అమ్మకు జానపద కళలంటే ఎక్కడలేని ఆనందం. ఇప్పటికీ గద్దర్‌, వంగపండు, గోరటి పాటలకు కళ్లప్పగించి చూస్తుంది.
మీ కుటుంబ నేపథ్యం?
ఎక్కడ బతుకు బాగుంటే అక్కడికి కదిలిపోయే వృత్తి సంచారులం. మా నాన్న గోడల మీద మసిబొగ్గుతో బొమ్మల వేస్తూవేస్తూ బొమ్మల మాస్టారు అయ్యారు. నాటకాలు వేసిన సాహిత్యానుభవంతో తెలుగు వైపు మళ్లారు. తెలుగు ఉపాధ్యాయుడుగా బతికారు. అమ్మ ముందుతరం వాళ్లూ వూర్లు పట్టుకుని తిరిగి పోరాం వచ్చి ఆగారు. అమ్మ చదువుకోలేదు. కాని- నాకు జీవితాన్ని ఎలా నెట్టుకురావాలో, జీవితాన్ని ఎలా ఈదాలో నేర్పింది. నా కవిత్వంలో సున్నితత్వమేదైనా వుందటే కారణం మా అమ్మే.
మీ కవిత్వానికి ప్రేరణ?
తొలి ప్రేరణగా నిలిచింది శ్రీశ్రీ. ‘మహాప్రస్థానం’ లో గుర్రపుడెక్కల చప్పుడులాంటి కవిత్వం ఎంత ఆకర్షించిందో, ‘భిక్షూవర్షీయసి’ వంటి భావుకత దట్టంగా నింపబడిన కవిత్వమూ అంతే ఆకర్షించింది. ‘వెలుతురు చినుకులు’ పేరుతో చిన్నచిన్న అంశాలలో ఆశ్చర్యం గొలిపే కవిత్వం రాసిన రావూరి భరద్వాజా అంతే ఆకర్షించారు. నన్ను అమితంగా కవిత్వం మాయలో పడేసిన శివారెడ్డిగారి పేరుతో హైస్కూల్‌ రోజుల్లోనే పరిచయం వుంది.
ఇలా కవిత్వం చదువుతూ రాస్తూ వున్న క్రమంలో శివారెడ్డిగారి కవిత్వ నిర్మాణశైలి నన్ను తేరుకోలేని మోహంలోకి తీసుకుని వెళ్ళిపోయింది. వస్తుపరంగా కవిత్వం ఎంత సీరియస్‌ విషయమో వరవరరావుగారు, శివారెడ్డిగారు తెలియపరిచారు.
వెనుకపడ్డ ఉత్తరాంధ్ర నుంచి మీరే తొలి కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీతగా నిలవడం మీకెలా అనిపించింది?
పెద్ద ఉత్సాహంలాంటింది నాలో ఏర్పడలేదు. బతుకు కన్నీళ్లను దిగమింగుతున్న ప్రజల కన్నా, తిరుగుబాటు చేసే ప్రజల కన్నా ఏ పురస్కారం ఏమాత్రమూ ఎక్కువ కాదనే అవగాహన వుంది. ఆ పురస్కారం ద్వారా వచ్చిన సొమ్ము ప్రజలదనే జ్ఞానం వుంది. ఆ బహుమతి మొత్తాన్ని కళింగాంధ్ర తిత్లి తుఫాను బాధితులకు ‘ఉరకవే’ ద్వారా ప్రత్యక్షంగా వెళ్లి అందించడం జరిగింది. పురస్కారం తర్వాత- కొన్ని కాలేజీలకు, పాఠశాలలకూ వెళ్లి విద్యార్థుల్లో చైతన్యబీజాలను నాటగలిగే అవకాశం రావడం గొప్ప ఆనందం కల్గించింది.
జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పాఠాలు చెప్పే క్రమంలో కవిత్వాన్ని జోడిస్తారా?
జీవశాస్త్రాన్ని బోధించడం అనే పని నాలో శాస్త్రీయత పట్ల ఒక గురి ఏర్పడడానికి ఎంతోకొంత దోహదపడింది. కవిత్వానికి కథకి ఒక శిల్పం వున్నట్లు- తరగతిగదిలో బోధించే పాఠ్యాంశానికి ఒక శిల్పం వుంటుంది. ప్రతిసారి పాఠ్యాంశ శిల్పాన్ని కొత్తగా మలచడం నాకు ఇష్టం. కవిత్వ ప్రభావం లేకుండా నా తరగతిగది లేదు. కవిత్వమూ చదివి వినిపిస్తాను. కాబట్టే 2017వ సంవత్సరంలో నా తరగతి గది విద్యార్థులు రాసిన కవితలతో ‘స్వప్నసాధకులు’ అనే సంకలనం తీసుకురాగలిగాను.
ప్రపంచీకరణతో వస్తుశిల్పాలు మారుతున్నాయి. వాటిని తెలుగు రచయితలు ఎప్పటికప్పుడు అందుకుంటున్నారా ?
సాహిత్యంలో వస్తుశిల్పాల మార్పుకు ప్రపంచీకరణ ఒక్కటే కారణం కాదు. ప్రపంచీకరణ మాటున ఒక విధ్వంసం వుంది. ఈ కొత్త దశాబ్దంలోనూ ప్రపంచీకరణ వలన కుదేలౌతున్న అనేక అంశాలను మన సృజనకారులు గొప్ప వస్తుశిల్ప సమన్వయంతో రాశారు. రాస్తున్నారు.
తొలి కథ రాసిన గురజాడ మీద ఆంగ్ల సాహిత్య ప్రభావం వుండడం ముందడుగే తప్ప వెనకడుగు కాదు. అక్కడ ప్రపంచీకరణ లేదు. శ్రీశ్రీ విస్తృతంగా ప్రపంచ కవిత్వాన్ని చదివి అనువదించగలిగారంటే ప్రపంచీకరణ కాదు. శ్రీశ్రీ మీద ప్రపంచ పరిణామాల ప్రభావం వుండటం ఒకానొక కారణం.
ప్రపంచ పరిణామాల ప్రభావం తప్పకుండా ఇప్పటి రచయిత మీదా పడుతుంది. సాహిత్యం దాని ఫలితమే.
‘దు:ఖపు వొరుపు’లో కోవిడ్‌ కాలపు మానవ జీవితాల్ని చిత్రించారు- ఆ రోజులు మీపై అంతంగా ప్రభావం చూపాయా?
సంపుటి పేరే ‘దు:ఖపు వొరుపు’. నిజంగా దు:ఖపు వొరుపు కాలమది. మన మీద లాక్‌డౌన్‌ కలిగించిన సలపరింత అంతా ఇంతా కాదు. మహాదిగులు- నిలవలేనితనం. దాన్నంతటినీ కవిత్వం చేయాలనే ప్రతికారచర్య నాలో- ఆ దు:ఖంలోంచి ఒక కాంతిరేఖ వెంట నడవడమూ నా అవసరం. ఆ సంపుటికి జతగా రెండు కథలూ, ఒక డైరీని కూడా వుంచాను.
చంపావతి ప్రచురణలు స్థాపించడం వెనుక ఉద్దేశ్యం? ప్రచురణ వివరాలు?
నేను పుట్టింది- చంపావతి నదికి సమీపంలో. చదువుకున్నది- చంపావతి నది ఒడ్డున. ఇప్పుడు వుంటున్నది- చంపావతి నదికి అభిముఖంగా. నదితో నాది విడవని ప్రయాణం. నదంటే మోహం నాకు. నదులు ప్రయాణించే దారెంట ప్రయాణించాలని వుంటుంది. ఆ మోహంతోనే నా పుస్తకాలను ‘చంపావతి ప్రచురణలు’ పేరుతో తేవాలని అనుకున్నాను. ఒక్క ‘ఆకు కదలని చోట’ తప్పించి మిగిలిన నా కవిత్వ పుస్తకాలన్నీ చంపావతి ప్రచురణలుగా తీసుకొచ్చినవే. కళింగాంధ్ర సాహిత్య సంచిక (త్రైమాస పత్రిక), ఢిల్లీ రైతు ఉద్యమం సమయంలో ప్రత్యేక బులిటెన్‌ తీసుకువచ్చాను.
Preface is first criticism on book అంటారు. మీ పుస్తకాలకు ముందుమాటలు లేకుండా వుండటానికి ఏమైనా ప్రత్యేక కారణం వుందా?
తొలి సంపుటి ‘ఎగరాల్సిన సమయం’ కి శివారెడ్డిగారు, అఫ్సర్‌ గారు, గంటేడ గౌరునాయుడు మాస్టారు ముందుమాటలు రాశారు. ‘ఆకు కదలని చోట’ కి వచ్చేసరికి నడుస్తున్న రాజకీయ సామాజిక వ్యవస్థ సృష్టించిన ఘర్షణలో ఇంచుమించుగా అందరం పరోక్షంగానైనా భాగమైవున్నారనే స్పృహవలన ముందుమాట గురించి ఆలోచించలేకపోయాననిపిస్తుంది. ఆ తర్వాత పుస్తకాలకు నేనే చిన్న పరిచయాల్లాంటివి రాసుకున్నాను. అవి నడుస్తున్న చరిత్రతో పాటు నా నడకను ప్రతిధ్వనించేవి.
‘బాలసుధాకర్‌ రీడింగ్‌ సెల్ఫ్‌’లో ఎక్కువగా ఏ విధమైన పుస్తకాలుంటాయి?
కవిత్వం, కథ, నవల, నాటకం, రాజకీయ- సామాజిక- చారిత్రక పుస్తకాలు, సైద్ధాంతిక పుస్తకాలు- మార్క్సిస్టు, అంబేద్కరిస్టు రచనలూ, రాజకీయ-ఆర్థిక-సాహిత్య మాసపత్రికలు, ఆంగ్లభాషలో కొచ్చిన ఇతర భాషల కవిత్వం, సినిమా రచనకు సంబంధించిన పుస్తకాలు- కొన్ని సినిమాల స్క్రిప్టులు.
తెలుగు కాకుండా మీరు చదివే ఇతర భాషా పుస్తకాలు? రచయితలు?
ఆంగ్లంలో వచ్చిన-వస్తున్న కవిత్వం చదువుతుంటాను. చిలీ కవి నెరూడా నుంచి మధ్య ప్రాచ్య కవులు- అదోనిస్‌, రిట్సాస్‌, మహమ్మద్‌ దార్విస్‌బీ, శ్రీలంక తమిళ కవి చేరన్‌ రుద్రమూర్తి, మలయాళ కవి సచ్చిదానందన్‌, ఒరియా కవి జయంత మహాపాత్ర, కశ్మీర్‌ కవి అఘా సాహిద్‌ అలి మొదలగు కవుల కవిత్వం చదువుతుంటాను.
భావి ప్రణాళికలు ఏవైనా వున్నాయా?
ఇప్పటివరకు పిల్లల మీద నేను రాసిన కవితల్లోంచి ఎంపిక చేసిన కవితలతో ఒక సంపుటి తీసుకురావాలని ఒక గాఢమైన కోరిక. సముద్రం మీద నేను రాసిన కవితలనూ ఈ సంపుటిలోనే చేర్చాలి. ఆ పుస్తకం పేరు- ‘పిల్లలూ సముద్రం’. అది తీసుకురావడానికి మరో మూడునాలుగు సంవత్సరాలు పడుతుంది. అలాగే ‘నది-వాన’ పేరుతో ఒక సంపుటి తీసుకురావాలని వుంది.
ఇప్పటివరకు నా కవిత్వ ప్రయాణాన్ని విమర్శనాత్మకంగానూ, విశ్లేషణాత్మకంగానూ చూపిస్తూ- ఆవంత్స సోమసుందర్‌ గారి నుంచి పిల్లా తిరుపతిరావు గారి వరకు వ్యాసాలు రాశారు. వాటిలోంచి ఎంపిక చేసినవి- నన్ను స్పష్టంగా మంచిచెడులతో చెప్పిన వ్యాసాలను పుస్తకంగా తేవాలనుంది. ఇంతవరకొచ్చిన కళింగాంధ్ర కవిత్వాన్ని విమర్శనాత్మక కోణంలో సామాజిక కోణంలో విశ్లేషిస్తూ అనేక వ్యాసాలను రాయాల్సివుంది.
– సారిపల్లి నాగరాజు, 8008370326

Spread the love