ఫలించిన కృషి

ఫలించిన కృషికాళాపురం గ్రామంలో కాళయ్య ఓ చిన్న రైతు. పొలం ఎక్కువ ఏమీ లేదు. ఉన్నంతలో బాగానే పండిస్తాడు. అయితే ఆ ఏడు పంట చేతికి రాలేదు. అప్పులు పెరిగాయి. ఎప్పుడూ లేని కరువు చుట్టు ముట్టింది.
ఊర్లో కొందరు అప్పులు కట్టలేక వలస వెళ్ళారు. మరికొందరు సమస్యకు జడిసి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవన్నీ కాళయ్యని తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. పొలం వెళ్ళి చేను చూశాడు. పంట చేతికి వచ్చే సమయంలో వర్షం పడి అంతా నీటిపాలైంది. అలానే చేనులోనే నడుచుకుంటూ వెళుతున్నాడు. రేపు అప్పుల వాళ్ళు వస్తే ఏం చెప్పాలి? భార్య, బిడ్డలను ఎలా పోషించుకోవాలి. పెళ్లీడు కొచ్చిన ఇద్దరు కుమార్తెల భవిష్యత్‌ ఎలా? ఈ లోకాన్ని వదలి పోతే…? ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఛీ… ఆత్మహత్య మహాపాపం. నేను దూరమైతే భార్య, పిల్లలు ఏమవుతారు? వారికి అన్యాయం చేసినట్లు అవుతుంది. ఆలోచనలతో కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా ఇంటి ముఖం పట్టాడు. నాన్న దిగులుగా ఉండటం చూసి కుమార్తెలు ఇద్దరూ దైర్యం చెప్పారు. భార్య కూడా ధైర్యం చెప్పింది.
”నువ్వు ఎటువంటి అఘాయిత్యానికీ పాల్పడవద్దు నాన్నా. నిన్ను చూసే మేం బతుకుతున్నాం” అన్నారు పిల్లలు.
వాళ్ళ మాటలకు కరిగిపోయాడు.
”ఈసారి చూద్దాం. పంట పండినా, పండకపోయినా మనం ఏమి కుంగిపోనవసరం లేదు నాన్నా. కష్టే ఫలి” అన్నారు కుమార్తెలు.
”అవునయ్య ఈ ఒక్కసారి చూద్దాం. పంట బాగా పడితే మంచిదే. లేకపోతే అందరం వలస పోదాం. ధైర్యంగా ఉందాం. ఆ దొడ్డన్న కుటుంబం మాదిరి ఆత్మహత్యలు మనకొద్దు. అలా మనం ఉండకూడదు” అంది భార్య.
వారి మాటలు ధైర్యాన్నిచ్చాయి కాళయ్యకు. ఆ ఏడు చేనులో అందరూ కష్ట పడ్డారు. కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది అనుకున్నారు. పంట బాగా పండింది ‘కష్టేఫలి’ అంది చిన్న కూతురు .
కాళయ్య, అతని భార్య సంతోషించారు. ఇద్దరి పెళ్ళి చేసేశాడు. ఆత్మహత్యలకు భయపడక కష్టానికి మంచి ఫలితం ఉంటుందని నిరూపించారు.
– కనుమ ఎల్లారెడ్డి, 93915 23027

Spread the love