గోదారి పరుగున్న అందమైన అమ్మాయి

గోదారి పరుగున్న అందమైన అమ్మాయితన మనసును తొలిసారి తాకిన అందమైన అమ్మాయిని గురించి హీరో పాడే పాట ఇది. ఆమెను చూడగానే గుండెల్లో సందడి కలుగుతుంది. తనతో మాట్లాడాలని, మనసులోని మాట చెప్పాలని ఆరాటం కలుగుతుంది. చెబుదామని దగ్గరికెళ్తే దడదడ పెరుగుతోంది. అందమైన ఆ అమ్మాయి తన కళ్లకు ఎలా కనిపిస్తుందని అడిగితే అక్షరం ముక్క రానివాడు కూడా పదాలన్ని అల్లేసి పాటలు పాడేస్తాడు. అలాంటి పాటే ఇది. ‘గ్యాంగ్‌ ఆఫ్‌ గోదావరి'(2023) సినిమా కోసం శ్రీహర్ష ఈమని రాసిన పాట ఇది.
శ్రీహర్ష ఈమని ఈమధ్యే తళుక్కున మెరిసిన సినీకవి. అద్భుతంగా రాస్తున్నాడు. ఈ తరానికి ఎలా కావాలో అలాంటి పదాల సోయగం చిందిస్తున్నాడు. గ్యాంగ్‌ ఆఫ్‌ గోదావరి సినిమాలో ఆయన రాసిన ఈ పాట సినిమా విడుదల కాకముందే ఉర్రూతలూపేసింది. ప్రతి ఒక్కరికి కాలర్‌ టోన్‌ లా ఒదిగిపోయింది. ప్రతి ఒక్క గుండెకి హాయిగా తాకేసింది.
పాట విషయానికొస్తే.. హీరో అమ్మాయిని మొదటిసారి చూసినపుడే ఏదో పులకింత కలిగేసింది. ఆ అమ్మాయంటే తెలియని ప్రేమ ఏదో గుండెకు తగిలేసింది. ఆమెను చూడగానే అతనికి ఏమనిపించిందో మనసుతో పాడేశాడు. ఆమె అద్దాల ఓణిలా మెరిసిపోతుందట. ఓణి అంతటా అద్దాలుంటే చూసేవారికి అద్దాల తళుకుదనం, చమక్‌ చమక్‌ గా ఆమె రూపం కనిపిస్తుంది. మైమరపించేస్తుంది. ఆకాశవాణిలా అంటే.. రేడియోలా – తీయగా వినిపిస్తుందామె మాట. గోదారి గట్టుపై ఆమెను చూశాడు. ఆమెను గోదారిలానే చూస్తున్నాడు. గోదారి పరుగులా ఉంది ఆమె నడక. ఒంపుగా, ఒయ్యారంగా గోదారి పాయలా సాగినట్లుగా ఆమె కనబడుతుందతనికి. మణిలా వెలుగులు వెదజల్లే ఆమె అందాన్ని చూస్తూనే ఉండిపోయాడు. చూస్తూనే ఉండాలనుకుంటున్నాడు.
హీరో చదువుకున్నవాడు కాదు. గాలికి పెరిగిన అల్లరి మనసున్నవాడు. పరుగులు తీసే దుడుకైన వయసున్నవాడు. అందుకే.. ఆమెను పెద్దింటి అమ్మాయిలా, ఓ బంగారుగనిలా చూస్తున్నాడు. తన రెండు కన్నులతో తనివితీరేవరకు ఆమెను చూస్తూ ఉండిపోతానంటున్నాడు. రెండు కళ్ళతో ఎంతసేపు చూస్తే తనివి తీరుతుందో అంతసేపు చూస్తూనే ఉంటానంటున్నాడు.
ఆమెది కళకళలాడే అందం. కళ ఉన్న ఆ కంటికి ఎంత కాటుక పెట్టినా వీధుల్లో ఉన్నవాళ్ళంతా దిష్టిపెట్టకమానరు. అసలు ఆమె కంటికి కాటుకే అవసరం లేదు. దిష్టి తగలకుండా కాటుక పెట్టుకుంటారు కాని ఆమెను చూస్తే దిష్టిపెట్టకుండా ఉండరు. అలాంటి అందెం ఆమెదని అంటున్నాడు. సన్నాయి శబ్దంలాగా, సందెవేళ మోగే తీయని పాటలాగా సందడిని తీసుకొచ్చేసింది ఆమె తనలా… అంటున్నాడు. ఆమే సందడై నడిచివచ్చిందని ఇక్కడ అర్థం. ఇంతందం సుట్టంలాగా తనని చూసిపోతే హీరో తట్టుకోగలడా? ప్రతిక్షణం ఆ అందాన్నే చూడాలనుకుంటున్నాడు. తనను వీడి ఉండలేనంటున్నాడు. అందుకే చీరలాగా తనను చుట్టేసుకోమంటున్నాడు. ఓ చంటివాడిలా నువ్వు చెప్పిందల్లా వింటానంటున్నాడు.
ఆమెకు ఏ ఉత్తరాలు రాయలేడు హీరో.. కారణం అక్షరజ్ఞానం లేకపోవడం. నీకు అర్థమయ్యేలా నా లక్షణాలన్ని పూసగుచ్చి ఉత్తరాలు రాయకపోవచ్చు కాని నా మనసు చెప్పే మాటలు నీదాకా వినబడతాయి. అర్థం చేసుకోమంటున్నాడు. నువ్వు నాకు ఏమౌతావు? అని నువ్వు అడిగినా ఏమౌతానో నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. అది ప్రశ్నార్థకమే. ఇలాగే నీ పక్కనుండిపోతే చాలు అనుకుంటున్నా నంటున్నాడు.
అతనికి ఆ అమ్మాయితో కొంత చనువు ఏర్పడుతుంది. అది స్నేహంగా మారుతుంది. తనతోపాటు తీసుకెళ్ళి ఊరు ఊరంతా తిప్పి చూపిస్తాడు. గోదారి పరవళ్ళు, అందాల గురించి తెలియజేస్తాడు. సొట్టుపడ్డ గిన్నెమీద సుత్తిపెట్టి కొడితే ఎలా ఉంటుందో ఆమెను చూసినప్పుడల్లా, ఆమె పక్కన ఉన్నప్పుడల్లా తన గుండె అలా కొట్టుకుంటుందట. గంటకోసారి గంటలు కొట్టే గడియారమై నిన్నే తలచుకుంటూ గుండె కొట్టుకుంటూనే ఉంటుందని తన ప్రేమను తెలియపరుస్తున్నాడు.

పాట:-
అద్దాల ఓణిలా ఆకాశవాణిలా/ గోదారి గట్టుపై మెరిసావు మణిలా/ పెద్దింటి దానిలా బంగారుగనిలా/ సూత్తానే నిన్నిలా నా రెండు కన్నులా/ కల ఉన్న కళ్ళకే కాటుకే ఎలా?/ మా వీధి వీధంతా దిష్టికొట్టేలా/ సన్నాయి మోతలా సందేళపాటలా/ సందల్లే తెచ్చావే నీలా/ సుట్టంలా సూసిపోకలా/ సుట్టేసుకోవే సీరలా/ సక్కాని సంటివాడిలా/ సేత్తానే నువు సెప్పిందలా/ ఏ ఉత్తరాలు రాయలేను నీకు తెలిసేలా/ నా లచ్చనాలనన్ని పూసగుచ్చేలా/ ఏమౌతానంటే ఏది సెప్పలేను వరుసలా/ నీ పక్కనుండిపోతే సాలులే ఇలా/ సొట్టుగిన్నెమీద సుత్తిపెట్టి కొట్టినట్టుగా/ సుమారు కొట్టుకుందే గుండె గట్టిగా/ గంటకొక్కసారి గంటకొట్టే గడియారమై/ నిన్నే తలిసేలా!/ సుట్టంలా సూసిపోకలా/ సుట్టేసుకోవే సీరలా/సక్కాని సంటివాడిలా/ సేత్తానే నువు సెప్పిందలా!
– డా||తిరునగరి శరత్‌చంద్ర,
[email protected]

Spread the love