పద్యగేయాల కూరాడు ‘వర్కోలు’

సిద్ధిపేట కవులెందరో బాల సాహిత్యంతో పాటు ఇతర ప్రక్రియలు, రూపాల్లో కృషిచేస్తున్నారు. ఆయా రంగాల్లో సమానంగా రాణిస్తున్నారు. పద్యం, గేయం, కథ, విమర్శ, బాల సాహిత్య వికాసం వంటి రంగాల్లో అనేకమంది సిద్ధిపేట సిరి పెంచినవారిని చూశాం. ఈ కోవలోనే బాలల కోసం గేయాలు, పద్యాలతో పాటు ఇతర రూపాల్లో రచనలు చేయడమే కాకుండా బాల వికాసం దిశగా పనిచేస్తున్న వారిలో సిద్ధిపేట జిల్లా గట్ల మల్యాల గ్రామంలో పుట్టిన కవి వరుకోలు లక్ష్మయ్య ఒకరు. లక్ష్మయ్య వృతిరీత్యా తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.
ఫిబ్రవరి 2, 1967 న నేటి సిద్ధిపేట జిల్లా గట్ల మల్యాలలో పుట్టారు వరుకోలు లక్ష్మయ్య. శ్రీమతి వరుకోలు రాజమ్మ- శ్రీ రాజ మల్లయ్య వీరి తల్లితండ్రులు. తెలుగు సాహిత్యంలో ఎం.ఎ, బి.ఎడ్‌ పూర్తిచేసిన వరుకోలు తెలుగు పండితులుగా పనిచేస్తున్నారు. ఈయన శ్రీమతి మాధవి కూడా బాల సాహిత్యం రాయడం విశేషం. గేయాలతో పాటు పద్యాన్ని మిక్కిలి ప్రేమించే వరుకోలు ప్రచురించిన పద్యకృతి ‘లక్ష్మణ శతకం’. ఇది ఆబాలగోపాలానికి ఉపయోగపడే పద్యకృతి. ‘బుజ్జిపాప లేచి బుడిబుడి నడకతో/ పలక బట్టి పాప బడికి వెళ్ల/ బొజ్జ నిండ ఒజ్జ జెప్పగ నేర్పె/ లక్ష్మణార్యుపలుకు లలిత మొలుకు’ అంటూ లక్ష్మణ శతకంలో లక్ష్యయ్య లక్షణంగా చెబుతాడు. ఇంకా… ‘తరువు నీడనిచ్చు తనవంతు పండ్లిచ్చు/ సృష్టిజూడ పుష్టి నిచ్చు…’, ‘నీతి మంతుడెపుడు నేమమ్ముకై పోరు/ హీనవంతుడెట్లు- యెరుగు నిజము/ బంతి ఎగిరినట్టు బండరాయెగురునా/ లక్ష్మణార్యుపలుకు లలిత మొలుకు’ అంటాడాయన. వరుకోలు తెచ్చిన మరో పద్యకృతి ‘మా ఊరు’. జన్మనిచ్చిన ఊరు కన్నతల్లి స్వర్గం కంటె గొప్పవని రామాయణ వాక్యం కదా! ఈ ‘మా ఊరు’ పద్యకృతి వరుకోలు తన పుట్టిన ఊరు గట్ల మల్యాలకు సాహితీ క్షేత్రంలో స్థానాన్ని కలిగిస్తూ చేసిన రచన. ఇవేకాక ‘కనక డప్పుు’ వచన కవిత్వం, ‘జ్ఞాన కిరణాలు’ పద్య కావ్యం. ‘భావ లహరి’ పద్య సంపుటాలు అచ్చులో వెలువడాల్సి వుంది. ‘సహస్రవాణి’, ‘సహస్రవాణి పద్యరత్న’, ‘సహస్రపద్య కంఠీరవ’గా ప్రశంసలందుకున్న కవి వరుకోలు జాతీయ ఉపాధ్యాయ సంక్షేమ సంస్థ నుండి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా, మెదక్‌ ఉత్తమ ఉపాధ్యాయునిగా, జనాభా గణనలో ఉత్తమ నమోదకునిగా వివిధ పురస్కారాలు అందుకున్నారు. కవిగా బాసర నుండి ఖమ్మం వరకు, హైదరాబాద్‌ నుండి రాజధాని ఢిల్లీ వరకు అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనేక సంస్థల సత్కారాలు, పురస్కారాలు, నగదు బహుమతులు అందుకున్నారు.
బాలల కోసం వందలాది గేయాలు, పద్యాలు రాసిన వరుకోలు వాటిని రెండు పుస్తకాలుగా తెచ్చాడు. మొదటి బాల గేయ సంపుటి ‘మబ్బుల పల్లకి’ 2011లో వచ్చింది. రెండవది ‘నీతి పుష్పాలు’. దీనిని 2018లో ప్రచురించాడు. నేటి బాలలు రేపటి పౌరులు అన్నమాటను నమ్మిన లక్ష్మయ్య వాళ్ల వికాసం కోసంగా తన బాల సాహిత్యాన్ని మలచాడు. అందులో బాలల ఆటలున్నాయి, పాటలున్నాయి, మాటలున్నాయి… వాళ్ల మనసులోని ఊహల ఊటలకు అక్షరకృతులున్నాయి. ఆ కోవలోనే ‘బాలలంత కలిసిరి/ ఊరి బయటకెల్లిరి/ చిర్రగోనె ఆటను/ చిత్రంగా ఆడిరి’ అని ఆటలను చెబుతాడు. ‘ఎక్కడికి పోయావు ఏనుగమ్మ/ చెఱుకుతోట కెళ్లాను చెంద్రన్నా’ అని పాటలను వినిపిస్తాడు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు కావడం వల్ల వరుకోలు పిల్లలను దగ్గరగా చూసి రాస్తున్నాడు. అవన్నీ ఆయన రచనల్లో మనం చూడవచ్చు. ‘బుజ్జి పాప లేచింది/ బుడిబుడి నడకలు నడిచింది/ కాళ్ళకు గజ్జెలు కట్టింది/ బుగ్గన చుక్క పెట్టింది’ వంటి గీతాలు ఆ పరిశీలనలోవే. మరో సంపుటి ‘నీతి పుష్పాలు’ బాల గేయ కవిగా వరుకోలు పరిణతికి, వస్తు వైవిధ్యతకు చక్కని ఉదాహరణగా ఉంటుంది. ఇందులోని గేయాల నడక, లయాత్మకత గేయాలకు అందాన్ని తెచ్చాయి. ‘తెలుగుభాష నేర్చుకో/ మమకారం పెంచుకో/.. ఎల్ల భాషలలోన/ తెలుగుభాష అందము’ వంటి గేయాలు లయకు చక్కని తార్కాణాలుగా నిలిస్తే, ‘చిన్నిచిన్ని మొక్కలం/ చిగురించే రెమ్మలం/ పుష్పించే పువ్వులం/ పరిమళించె మల్లెలం/ .. ఆటలతో పాటలతో/ గెలిచి తీరె యోధులం/ పలక బలపము లేకనే/ బడికి వెళ్లి చదువెదం’, ‘ప్రేమలన్నింటిలోన/ తల్లి ప్రేమ గొప్పది’, ‘ఎందుకు ఎందుకు కులబేధాలు/ అందరమొకటని చాటాలి/ ఐకమత్యముగ నుండాలి/ ఆదర్శముగ బతకాలి’ వంటి గేయాలు బాలలకు లక్ష్మయ్య చెప్పాలనుకున్న విషయాలను తెలిపితే, ‘జొన్నలు వాడితె మిన్నగ బలము/ సజ్జలు వాడిన సాలగ మేలు’, … పార్యవరణం కాపాడాలి/ ప్రాణ ముప్పులు తొలగించాలి/..కలుషిత గాలిని తరిమేయాలి/ విరివిగ మొక్కలు నాటేయాలి’ వంటివి ఆయన ఆసక్తిని… బాలల్లో నాటాల్సిన పర్యావరన భక్తిని గురించి తెలియజేస్తాయి. పిల్లల కోసం గేయాలు, పద్యాలే కాక బాల వికాసకారునిగా లక్ష్మయ్య అరడజనుకు పైగా పుస్తకాలు తెచ్చాడు. ఈయన శిష్యులు పద్యరచనలో వివిధ బహుమతులు అందుకొని నిలవడం గురువుగా లక్ష్మయ్య సాధించిన విజయం… అంతేకాదు తన బడిపిల్లల పుస్తకాల ముద్రణకు చేయూతగా నిలవడం విశేషం.
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548

Spread the love