కొడుకు

కొడుకుఅడ్డాలనాడు బిడ్డలుకాని గడ్డాలనాడు కాదు అని ఎవరు అన్నారో కాని ఆ మాటను నిజం చేస్తున్నారు కొందరు వారసులు. జన్మనిచ్చిన అలాంటి తల్లిదండ్రులను అవసానదశలో దిక్కులేని వారిని చేసే పుత్రులను ఏమనాలి?
రఘురాంకి పున్నామ నరకం నుండి తప్పించేవాడు కొడుకన్న నమ్మకం. దాంతో కొడుకు కావాలన్న కోరిక రోజురోజుకి ఎక్కువైపోతుంది. ఇద్దరు అమ్మాయిలు పుట్టిన తర్వాత కూడా కొడుకు కావాలనే భర్త కోరిక రఘురాం భార్య జయకి నచ్చదు. దేవుడు చక్కని ఇద్దరు ఆడపిల్లల్ని ఇచ్చాడు చాలు అంటుంది. ”నీకు కొడుకుని కనడం చాతకాకపోతే చెప్పు. నేను రెండో పెళ్ళి చేసుకుంటాను” అని ఖరాఖండిగా చెప్తాడు. దాంతో జయ బాధపడ్తుంది. మళ్ళీ ఆడపిల్ల పుడ్తే తన పరిస్థితిని తలచుకొని ఏడుస్తుంది. భర్త మాట ప్రకారం దేవుని గుళ్ళో చలికాలం తడిగుడ్డలతో చుట్టూ ప్రదక్షిణలు చేసి, మూడురోజులు కటిక నేలపైనే పడుకుంటుంది. పొరపాటున ఆడపిల్లను ప్రసవిస్తే పుట్టింట్లోనే ఉండాలన్న భర్త మాటలు జయ చెవుల్లో గింగిరాలు తిరుగుతూనే ఉన్నాయి. జయ మూడవసారి నెల తప్పుతుంది. జయని రఘు మొదటిసారి గర్భవతిగా ఉన్నప్పుడు చూసినట్లుగా చూడడు. రోజూ హెచ్చరికల నడుమ నవమాసాలు పూర్తయి జయకు పండంటి కొడుకు పుడ్తాడు.
రఘురాం ఆనందానికి అవధులుండవు. మిగిలిన తన ఇద్దరు ఆడపిల్లలకంటే కొడుకునే ఎక్కువగా చూస్తాడు. ఆ కొడుక్కి రాజు అని పేరు పెడ్తారు. జయ కూడా దేవుడు తన మొర ఆలకించి తన జీవితాన్ని కాపాడినందుకు మనసులో వేవేల దండాలు పెడ్తుంది. రఘురాం తన ఇద్దరు ఆడపిల్లల్ని గవర్నమెంట్‌ స్కూల్లో వేసి, కొడుకుని మాత్రం మంచి ప్రైవేటు స్కూల్లో జాయిన్‌ చేస్తాడు. రోజులు గడుస్తున్నాయి. పెద్ద కూతురుకి 9 తరగతిలోనే ఉన్న ఊరులో సంబంధం వస్తే పెళ్ళి చేస్తాడు. రెండు సం||ల తర్వాత పక్క ఊరు సంబంధం వస్తే చిన్న కూతురికి చేతనయినంత ఇచ్చి పెళ్ళి చేస్తాడు. కొడుకుని మాత్రం డిగ్రీ వరకు చదివిస్తాడు. చేతి ఖర్చులకు కొడుక్కి ఎంత అడిగినా ఇచ్చేవాడు. తల్లి జయ కూడా కొడుక్కి డబ్బిచ్చేది. రఘురాం కూతుర్లు పండుగలకి అల్లుళ్ళతో వచ్చినప్పుడు తల్లిదండ్రులు తమ్ముని చూసే తీరుకి, వారిని చూసే తీరుకి బాధ అన్పించినా తమ్ముడే కదా అని సరిపెట్టుకొని వెళ్ళిపోయేవారు.
రాజేష్‌ డిగ్రీ తర్వాత చదువుపై ఆసక్తి లేక ఎలక్ట్రికల్‌ వర్క్‌ నేర్చుకుంటాడు. తండ్రి రఘురాం ఓ చిన్న ఎలక్ట్రికల్‌ షాపు పెట్టిస్తాడు. రఘురాంకి ఇష్టంలేకపోయినా, జయ మాటకోసం తన అన్న కూతురిని రాజేష్‌ కిచ్చి పెళ్ళి చేస్తారు. తల్లిదండ్రులతో ఓ ఐదు సం||ల వరకు కలిసి ఉన్న రాజేష్‌ తల్లిదండ్రులపై కోపాన్ని ప్రదర్శించడం మొదలు పెడ్తాడు. కారణం తన తల్లిదండ్రులు అక్కలిద్దరికీ డబ్బులిస్తున్నారన్న అనుమానంతో.
రఘురాం తనకు ఉన్న పొలంలో పంటలు పండించి కుటుంబాన్ని నడిపేవాడు. కొడుకుతోనే తమ జీవితం అనుకున్న ఆ తల్లిదండ్రులకు రోజురోజుకు ముందు జీవితం ఎలా ఉంటుందోనన్న భయం పట్టుకుంటుంది. జయ వయసు మీదపడినా ఏమాత్రం కూర్చోకుండా కోడలికంటే ఎక్కువ పనులే చేస్తుంది. తన మనవడిని, మనవరాలిని తానే చూసుకుంటుంది. అయినా కోడలిలో ఏదో వెలితి. భర్తకు ఎప్పుడు ఏదో ఒకటి చెప్పడం దానికి తగ్గట్టుగా తన తండ్రి ఆస్తిని అక్కలకు కూడా ఎక్కడ ఇస్తాడోనన్న రాజేష్‌ భయం. చీటికిమాటికి కారణం లేకుండానే తల్లిదండ్రులతో గొడవలు పెట్టుకుంటాడు రాజేష్‌. ఎప్పుడో ఒకసారి వచ్చిపోయే బిడ్డలకి ఈ విషయాలు చెప్పి ఎందుకు వాళ్లని కూడా బాధపెట్టాలని జయం ఏం చెప్పదు. కానీ తల్లిదండ్రుల్లో మునుపటి ఆనందాన్ని కోల్పోయిన ఛాయల్ని గమనించిన పెద్దకూతురు ఉన్న ఊరు దగ్గర్లోనే ఉంటుంది కనుక ఆమెకు తెలుస్తుంది.
ఓ రోజున తమ్ముడి ప్రవర్తనకు తల్లిదండ్రుల తరుపున బాగా అడుగుతుంది… ”అమ్మానాన్న మా ఇద్దరు ఆడపిల్లల కంటే కూడా నిన్ను ప్రాణంగా చూసుకొని వారి ఆశల్ని నీ రూపంలో చూసుకుంటుంటే… చివరికి నీకంటూ ఓ జీవితం అయ్యాక, నీవిచ్చే ప్రతిఫలం ఇదా! నిన్ను అంతగా మాకన్నా ఎక్కువగా చూసినా, మా తమ్ముడ్నే కదా! అమ్మానాన్నలు చూసేది అని మేం సరిపెట్టుకున్నాం. కానీ ఇక నుంచి అమ్మానాన్నల్ని ఒక్కమాటన్నా ఊరుకునేది లేదు. నీలోనే అమ్మానాన్నలు వారి ఆశల్ని చూసుకుంటుంటే నువ్వేమో వారికి జీవితం పైనే ఆశ లేకుండా చేస్తున్నావు. నువ్వు పెద్దయ్యాక వారికి మనశ్శాంతే లేదు” అని అంటుంది. దాంతో రెచ్చిపోయిన రాజు అక్కని అనరాని మాటలంటాడు. తన గడప తొక్కదంటాడు. ఇదంతా దగ్గరుండి చూస్తున్న కోడలు ఏం మాట్లాడదు.
ఆ తరువాతిరోజు రాజేష్‌ తన భార్యాపిల్లలతో కలిసి తల్లిదండ్రులకు దూరంగా బతకాలని నిర్ణయం తీసుకుంటాడు. కొడుకు నిర్ణయం విని తల్లిదండ్రులకు గుండె పగిలినంతపనవుతుంది. కొడుకుని బతిమలాడుకుంటారు. అయినా వారిదే పైచేయి. ఇంట్లోంచి వెళ్ళిపోయి వేరే వీధిలో అద్దెకు ఉంటారు. కష్టపడ్డ సొమ్మంతా కూతుర్లను పట్టించుకోకుండా కొడుకు…. కొడుకని అంతా పెట్టేసి, ఇప్పుడు చేతిలో పైసా లేని స్థితిలో కొడుకు వేరే వెళ్ళిపోవడం ఆ తల్లిదండ్రులకు పరీక్షే. కొడుకు లేని ఆ ఇంట్లో రఘురాం, జయ బిక్కుబిక్కుమని ఉంటారు. ఊర్లోనే ఉన్న పెద్ద కూతురు తల్లిదండ్రుల బాగోగుల్ని చూసుకుంటుంది. విషయం తెలిసిన చిన్న కూతురు కూడా తల్లిదండ్రుల దగ్గరికి వస్తుంది. తమ్మున్ని ఎడాపెడా వాయించాలనుకుంటుంది. కానీ తమ్ముడు వారి మాటలు వినే పరిస్థితుల్లో లేడని ఊరుకుంటుంది.
కొడుకుపై దిగులుతో రఘురాంకి నోరు, కాలు, చేయి పడిపోతుంది. కొడుకునే కళ్ళల్లో నింపుకుని కూతుర్లని పట్టించుకోకుండా ఉన్నందుకు దేవుడు తనకు తగిన శాస్తే చేశాడని అనుకుంటాడు. ఆడపిల్లలిద్దరినీ ఎంత చిన్న చూపు చూసినా, వారికి తల్లిదండ్రులపైన ఏమాత్రం ప్రేమ తగ్గలేదని తలచుకొని బాధపడ్తాడు. ఆడపిల్లల్లో నాన్నకు ఏమన్నా అవుతుందేమో నన్న బాధని, ఆవేదనను చూస్తాడు. మళ్ళీ జన్మంటూ ఉంటే ఆడపిల్లల్నే తనకు బిడ్డలుగా కావాలని కోరుకుంటాడు. కొడుకు పుట్టాలన్న నెపంతో భార్య జయని పెట్టిన బాధల్ని గుర్తుకు తెచ్చుకొని మనసులోనే క్షమించమని కోరుకుంటాడు. కొడుకు…. కొడుకు…. అని కలవరించే ప్రతి ఒక్కరికీ తన జీవితమే గుణపాఠం కావాలనుకుంటాడు. తండ్రి ఆరోగ్యం అసలు బాగాలేదని మధ్యవర్తుల ద్వారా తెలుసుకుని కూడా తండ్రి బతికున్నంతవరకు రానని రాజేష్‌ ఖరాఖండిగా చెప్తాడు. సంవత్సరం రోజులు కొడుకులేని ఇంట్లో, కొడుకునే గుర్తుచేసుకుంటూ, చివరకు రఘురాం చనిపోతాడు. తండ్రికి అంత్యక్రియలు చేయకపోతే ఊరి జనం ఊకోరు కాబట్టి ఏదో పని అయిందనిపించుకుంటాడు.
రాజేష్‌ పదకొండురోజులవరకు ఆ ఇంట్లోనే ఉంటాడు. అక్కలిద్దరూ తల్లికోసం పెద్దమనుషులతో పంచాయితీ పెట్టిస్తారు. పెద్దమనుషులు ”ఒక కొడుకువి నిన్ను అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రుల్ని అవసానదశలో గాలికొదిలేశావు. తల్లి జయను చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తారు. తన దగ్గరికి తల్లిని తీసుకెళ్తానంటాడు. కొడుకు తనపై ప్రేమతో తీసుకెళ్ళడం లేదన్న విషయం జయకు అర్థం అవుతుంది. ఎందుకు తీసుకెళ్తానంటున్నాడో కూడా అర్థంచేసుకుంటుంది (ఎందుకంటే తల్లి ఎంతో కొంతవరకు పని బాగా చేస్తుంది. పెట్టిన తిండికి న్యాయం చేస్తుంది). కానీ తల్లి జయ ఆ పంచాయితీలో కొడుకు దగ్గరికి వెళ్ళడం తనకిష్టం లేదని బోరున ఏడుస్తూ ఆ కొడుకు కోసం పడ్డ కష్టాల్ని చెప్పుకుంటుంది. తనకు కాళ్ళు, చేతులు ఆడినన్ని రోజులు స్వంతంగానే బతుకుతానని చెప్తుంది. ఇలాంటి కొడుకుని కన్నందుకు తమకు తగిన శాస్తే జరిగిందని, చనిపోయాక పున్నామనరకం నుండి తప్పించడం ఏమోగానీ, బతికుండగానే ప్రత్యక్ష నరకాన్ని చూపించి, తండ్రి చావుకు కారకుడైన వాడి దగ్గర నేను ఉండనని ఏడుస్తూ చెప్తుంది. తల్లి బతికి ఉన్నన్నాళ్ళు ఆ ఇంట్లోనే ఉండేటట్లు, ఆ ఇంటికి వచ్చే అద్దె కూడా ఆమెకి చెందేటట్లు తీర్పు చెప్తారు. అందరూ తలా ఒక మాట అనడంతో కొడుకు, కోడలు ఆ పంచాయితీ నుండి వెళ్ళిపోతారు. జయ జరిగిన పరిస్థితులన్నింటిని తలచుకొని గుండెదిటవు చేసుకొని ఒంటరి జీవితానికి అలవాటుపడుతుంది. దగ్గర్లోనే ఉన్న పెద్దకూతురు తల్లి బాగోగుల్ని చూసుకుంటుంది. అప్పుడప్పుడు ఊరి నుండి చిన్నకూతురు వచ్చి తల్లిని చూసుకుంటుంది.
– డా|| ఓరుగంటి సరస్వతి
9704482892

Spread the love