ఇది మన వీధే!

ఇది మన వీధే!మా వీధి చిన్నదే. 20 అడుగుల రోడ్డు, కబ్జాలకి పోగా 18 అడుగుల వెడల్పు కూడా వుందో లేదో. ఇళ్ళు కట్టుకున్నవాళ్ళకి పార్కింగ్‌ స్ధలం అట్టి పెట్టటం వధా అనిపించింది. అందుకే అంత చిన్న సందయినా కార్లు, బైకులు ట్రక్కులు వగైరా వాహనాలన్నీ రోడ్డుకటూ ఇటూ ఇంచక్కా వేరే వాహనచోదకుల సహనాన్ని పరీక్షిస్తూంటాయి. ఏం చేస్తాం!? అన్నీ భరించాలి. అది మా వీధి. అక్కడ మా ఇల్లు వుంది మరి.
రాత్రి 8 గంటలవుతోంది. వీధి లైట్లు వెలగటం లేదు. ఎవరిళ్ళల్లో వాళ్ళు.. ఎవరి పనులు వారివి కదా. పొద్దున్న వాకింగ్‌ చెయ్యలేదు. కొంచెం సేపు నడుద్దాం అని బయట కారిడార్‌ లోకి వచ్చాను. ఎదురు కుమార్‌ వాళ్ళింటి ముందు ఇద్దరబ్బాయిలు నుంచున్నారు. అందులో ఒకతను అతి చిన్న కాగితమో, గుడ్డో తెలియదుగానీ పట్టుకుని బైకులో ఎక్కడా సెంటీమీటరు కూడా వదలకుండా శుభ్రం చేస్తున్నాడు. అంత శ్రధ్ధగా శుభ్రం చేస్తున్న అబ్బాయిని చూస్తే ఎవరైనా మెచ్చుకుంటారుగానీ, నా చచ్చు బుర్రకెందుకో అనుమానం వచ్చింది. ఈవేళ్టప్పుడు ఇంత శ్రధ్ధగా శుభ్రం చేస్తున్నాడేమిటా అని కొంచెం పరీక్షగానే చూశాను. ఇంతలో ఇద్దరు యువకులు వేరే బైకు మీద వచ్చారు. వాళ్ళూ వీళ్ళూ ఏం మాట్లాడుకున్నారో అంత దగ్గరగా వున్నా నాకు వినిపించలేదు. వాళ్ళు వద్దని తల అడ్డంగా తిప్పుతూ వెళ్ళిపోయారు.
కుమార్‌ ఇంకా ఇంటికి రాలేదనుకుంటా, బయట కారు లేదు. అతను వస్తే కారు పెట్టుకోవటానికి స్ధలం లేదు. కుమార్‌ వాళ్ళమ్మా, నేను ఆ వీధికి పెద్ద రాక్షసులం. మా ఇళ్ళ ముందు వేరేవారు వాహనాలు పార్కు చెయ్యకుండా జాగ్రత్త పడతాము. ఎందుకంటే ఎవరైనా పెడితే మా వాహనాలకి స్ధలం వుండదు. అది పెద్ద ఇబ్బందికరమైన విషయం. అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది.
మొన్న కుమార్‌ ఫోన్‌ చేసి చెప్పాడు. ఆంటీ, మొన్న రాత్రి నేను వచ్చేసరికి ఇక్కడ నలుగురు కుర్రాళ్ళు కూర్చుని తాగుతున్నారు. డ్రగ్స్‌ కూడా తీసుకుంటున్నారా అని అనుమానంగా వుంది. కొంచెం చూస్తూ వుండండి అని. మేస్త్ర పెద్దవాళ్ళమవటంతో పెందరాళే తలుపులు వేసుకుని ఏ టీవీనో చూస్తూ కూర్చుంటాం. రాత్రి 8 గంటల తర్వాత పెద్ద పట్టించుకోం. అందుకనే ఆ కుర్రాళ్ళు కూడా ఎవరూ గమనించరని ఇక్కడ దుకాణం పెట్టేసినట్లున్నారు.
కుమార్‌ చెప్పింది వీళ్ళ గురించే అయి వుంటుంది. అక్కడ వున్న ఇద్దరూ వయసులో చిన్నవారే. పట్టుమని పాతికేళ్ళు కూడా వుండవేమో. ”బాబూ, మీ ఇల్లెక్కడీ బైకులిక్కడ పెడుతున్నారు? వాళ్ళు పెట్టుకోమన్నారా? వాళ్ళ కారు వస్తుందిప్పుడు, మీ బైకులు అడ్డవుతాయి” అని కామాలూ, ఫుల్‌ స్టాప్‌ లు లేకుండా అడిగేశాను. నాకు కొంచెం మొహమాటం తక్కువ అంటారు మా వాళ్ళంతా.
అందులో ఒకతను పక్కిల్లు చూపించాడు తల వూపుతూ. పక్కింట్లో బేచిలర్స్‌ వుంటారు. రెండో అతను ఇంకా శ్రధ్ధగా బైకు తుడుస్తూనే వున్నాడు. నా అనుమానం ఎక్కువైంది. ఎవరైనా పొద్దున్న తుడుచుకుంటారు బళ్ళని. ఇతనేమిటి అంత చిన్న కాగితమో, గుడ్డో పట్టుకుని అంత శ్రధ్ధగా రాత్రిపూట తుడుస్తున్నాడని.పైగా అది వాళ్ళిల్లు కూడా కాదు. మళ్ళీ రోడ్డుమీది దుమ్ము పడుతుంది కదా. ఆ తుడవటం లేనిపోని అనుమానాలు కలిగిస్తోంది. అదే అనుమానంతో మళ్ళీ అడిగాను వాళ్ళకి చెప్పారా బండి అక్కడ పెట్టుకుంటామని అని. అప్పుడు అతని చెయ్యి వీధి చివరిదాకా చూపించింది, నోరు మాత్రం ఫ్రెండ్‌ కోసం వైట్‌ చేస్తున్నాం అన్నది. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా చెప్పాడిప్పటిదాకా. నా అనుమానమే నిజమనుకున్నాను. ఇంక లేని సహనం తెచ్చుకుని మొదలు పెట్టాను.
”ఫ్రెండ్‌ అయితే ఇక్కడ వైట్‌ చెయ్యటం దేనికి మీ ఇంటికి రాడా?” అన్నాను. బైక్‌ తుడవటం ఒక్క క్షణం కూడా ఆపలేదు అతను. నేనే మళ్ళీ .. ”అంత చిన్న కాగితమో, గుడ్డో అదేమిటో కూడా తెలియటం లేదు. దానితో అంత శ్రధ్ధగా సెంటీ మీటరు కూడా వదలకుండా తుడుస్తున్నాడు కొత్త బండీ తుడిచినట్లు” అన్నాను. ”అవును కొత్త బండీనే” అన్నాడు.
ఇంతలో మావారు బయటకొచ్చారు. ”చూడండీ, బండీని రాత్రిపూట ఎంత శ్రధ్ధగా తుడుస్తున్నాడో సెంటీ మీటరు కూడా వదలకుండా. వీడియో తియ్యాలండీ మన వాళ్ళకి చూపించాలి, బండి తుడుచుకోమంటే బధ్ధకిస్తారు.” నా మాటలన్నీ వాళ్ళకి వినబడుతూనే వున్నాయి, మా సందు చిన్నదని ముందే చెప్పాను కదా. కావాలనే ఇంకా సాగించాను..
కుమార్‌ వాళ్ళని అడిగారుటండీ బండి అక్కడ పెట్టుకుంటామని. అయినా ఖాళీ స్ధలం కనబడితే చాలు బళ్ళు పార్కు చేసి వెళ్ళిపోతారు. హారన్‌ కొట్టినా రారు. ఎవరి బళ్ళేవో, ఎవరు పార్కు చేసి వెళ్ళారో కూడా తెలియటం లేదు. మనకీ కాపలా ఒక పెద్ద పనయిపోయింది. మనం అసలు ఫోటోలు తీసి పెట్టుకోవాలండీ.. ఎవరు కొత్తవాళ్ళో ఎవరు పాతవాళ్ళో తెలుసుకోవటానికి. బండి నెంబర్లు, మనుషులు కూడా వచ్చేటట్లు తియ్యండి ఈమారు. మనమేదో తలుపులు వేసుకుని కూర్చుంటున్నాం చూడటం లేదనుకుని ఇష్టా రాజ్యంగా చేస్తున్నారు. అంతా అబ్జర్వ్‌ చేస్తూనే వున్నామని తెలియదనుకుంటా పాపం.” అలా సాగుతున్న నా మాటల ధాటికి తట్టుకోలేక బండి తుడుస్తున్న అతను తుడవటం ఆపాడు. బండి స్టార్ట్‌ చేశాడు. మొదటివాడు ఎక్కబోయి ఆగి, సందిగ్ధంగా నాలుగడుగులు వేసి, వెనకా ముందూ చూసి సందు చివరకి రా అన్నట్లు అతనికి సైగ చేసి నడవసాగాడు. వస్తారన్న వాళ్ళ ఫ్రెండ్స్‌ కోసమేమో.
వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మా సందులో వుండేవాళ్ళు కాదు. తాగటానికో, డ్రగ్స్‌ కోసమో అక్కడ ఫ్రెండ్స్‌ వంకతో కొంచెంసేపు కాలక్షేపం చెయ్యటానికి ఆ స్ధలం వీలుగా వుందనుకున్నారు. మేం పట్టించుకోవటం లేదు అనుకున్నారు. చూడక పోతే ఏమోగానీ, చూస్తే ఆగే తత్వం కాదు మాది.
అయినా అంత చిన్న వయసులో చెడు అలవాట్లకి బానిసలైతే వాళ్ళ భవిష్యత్‌ ఏమిటి? వాళ్ళ తల్లి దండ్రులు, కుటుంబసభ్యులు ఏమవుతారు? వాళ్ళు పట్టించుకోరా? అయినా చదువులనీ, ఉద్యోగాలనీ పిల్లలు తల్లిదండ్రులకి దూరంగా వుండటంతో వాళ్ళెలా ప్రవర్తిస్తున్నారో చూసే అవకాశం పెద్దలకి తగ్గుతోంది. పిల్లలకి దొరికిన స్వేచ్ఛ కట్టలు తెంచుకుంటోంది. ముఖ్యంగా దిగువ మధ్య తరగతి కుటుంబాలవారు ఈ వ్యసనాలకి ఎక్కువ అలవాటు పడుతున్నారు. దేశం ఎటుపోతోంది?
మావారు పిలవటంతో ఊహా లోకంనుంచి వాస్తవ ప్రపంచానికి వచ్చాను. వాళ్ళని బెదిరించటంవల్ల దేశాన్నంతా నేను బాగు చెయ్యలేక పోవచ్చు. కానీ, నా దృష్టికొచ్చిన దానిని సరిచెయ్యటానికి, మా వీధిలో తప్పు జరగకుండా వుండటానికీ నేను ప్రయత్నించాననే తృప్తి నాకు మిగిలింది. మరి అది మా వీధి కదా. నాకూ బాధ్యత వుంది. ఒక పౌరుడిగా (పౌరురాలు అనిగానీ, పౌరుణి అనిగానీ అనాలా.. పోనీలే గ్రామర్‌ తర్వాత చూసుకుందాం.. ముందు వీళ్ళ సంగతి) అది నా కర్తవ్యం కూడా. అసలు ప్రతి పౌరుడూ వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేస్తే వేరే స్వర్గం ఎందుకు? నేను బెదిరించానని వాళ్లు వాళ్ళపని మానుతారా!? వాళ్ళ దుకాణం వేరే ఎక్కడన్నా పెట్టుకుంటారేమో. అది అక్కడ వాళ్ళు చూసుకోవాలి. నేను కనీసం మా వీధిలో చెడ్డ పనులు జరగకుండా ఆపాను. చాలు కదా. బిందువు బిందువు కలిస్తే సముద్రం కాదా.
– పి.యస్‌.యమ్‌. లక్ష్మి
9866001629

Spread the love