మట్టి గాజులు

మట్టి గాజులుఝాన్సీ చాలా తెలివైన అమ్మాయి. తల్లి లేదు. 12వ తరగతి వరకు చదివింది. ఆమె తండ్రి ఆపై చదువులు చదివించలేదు. అందుకే ఇంట్లో, బయట పని చేస్తూ కాలం గడిపింది. కుమార్‌తో పెళ్లి జరగడంతో తన జీవితం ఒక అందమైన మలుపు తిరిగిందని భావించింది. కానీ కాలం కలిసి రాలేదు. ఇప్పుడు ఆమె జీవితం చాలా కష్టంగా మారింది. చెప్పలేని విధంగా సాగుతుంది.
ఝాన్సీ తన పెళ్లి రోజే, తన జీవితం కుటుంబం కోసం అనుకుంది. భర్తను, అత్తగారిని, ఇంటిని బాగా చూసుకునేది.
పెళ్లయిన రెండేళ్లకే ఝాన్సీ భర్త కుమార్‌ చనిపోయాడు. భర్త లేకపోవడంతో ఝాన్సీ ఒంటరిగా కూర్చుని భోరున విలపించింది. ఏడ్చి ఏడ్చి ఆమె కన్నీళ్లు ఇంకిపోయాయి. అతను ఆమె కలలన్నింటినీ చీకట్లో వదిలేశాడు. భర్త పోయాక ఝాన్సీ తన అత్తగారి దగ్గరే ఉంటోంది. కూతురి జీవితం ఇలా అయిపోయిందన్న బాధతో ఝాన్సీ తండ్రి తాగితాగి చనిపోయాడు. ఈ బాధలనుంచి ఝాన్సీ త్వరగా బయటకు రాలేకపోయింది.
ఝాన్సీ అందమైన అమ్మాయి. ఆమె చూపులోనూ, ప్రవర్తనలోనూ అమాయకత్వం. భర్త లేకపోయినా అత్తగారిని, ఇంటిని జాగ్రత్తగా చూసుకునేది. ఇంత చిన్న వయసులో భర్త లేకుండా జీవించడం అంత సులుభం కాదు. దీంతో ఝాన్సీ గురించి అత్త జమున బాధపడేది.
ఝాన్సీని మరో పెళ్లి చేసుకోమని చాలా మంది చెప్పేవారు. కానీ అవేవీ ఝాన్సీ పట్టించుకునేది కాదు.
ఇంటి పక్కన ఉండే కమల తలుపు దగ్గరకి వచ్చి కూర్చుంది. ఝాన్సీ బట్టలు ఆరేస్తోంది.
‘ఝాన్సీ తిన్నావా?’ అడిగింది.
‘తిన్నాను అక్క’
‘మీ అత్తగారు ఏం చేస్తున్నారు?’
‘మందులు తెచ్చుకోవాలని బయటకు వెళ్ళింది. ఈ మధ్య ఆమె ఆరోగ్యం బాగాలేదు’
‘బాధపడకు ఝాన్సీ. ఈ కష్టాలు ఎక్కువ కాలం ఉండవు. సరే పిల్లలు వచ్చే టైం అయింది. తర్వాత వస్తాను’ అని కమల వెళ్లిపోయింది.
ఒకరోజు జమున అనారోగ్యానికి గురై తిరిగిరాని లోకాలకు వెళ్లింది. తర్వాత ఝాన్సీ జీవితం ఒంటరిగా మిగిలిపోయింది. ఇప్పుడు ఆమెను పలకరించడానికి పిలుపు కూడా లేదు.
‘నీ జీవితంలో నిన్ను ఒంటరిగా చూడాలని లేదు. మంచి వ్యక్తిని పెళ్లి చేసుకో. అదే నా చివరి కోరిక’ అని జమున ఝాన్సీకి చాలాసార్లు చెప్పింది. కానీ తల్లిలాంటి అత్తను ఒంటరిగా వదిలేయడానికి ఆమె ఎప్పుడూ అంగీకరించలేదు.
ఎవరూ లేని ఆడది అంటే లోకానికి చులకన. కొందరికి జాలి. ఆ జాలి వెనుక మంచి ఉందో, చెడు ఉందో తెలియదు. అందుకే ఝాన్సీ ఎవరినీ నమ్మేది కాదు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ రోజులు గడిపేది.
కమల ఒకరోజు ఝాన్సీ దగ్గరకు వచ్చి, ‘ఒంటరిగా జీవించడం అంత సులభం కాదు. నా జీవితాన్నే చూడు. నాపై ఏదో ఒక విధంగా పుకార్లు సృష్టిస్తారు. బంధువులు పెద్దగా పట్టించుకోరు. ఫంక్షన్లో ముందు నడవనివ్వరు. ఎవరికైనా ఎదురు కనిపిస్తే తిట్టిపోస్తారు. నచ్చిన రంగు నుదిటిపై ఉండదు. లోకానికి భయపడి బ్రతకాలి. ఇలా చాలా ఉంటాయి. వచ్చే వ్యక్తి నా పిల్లలను సరిగ్గా చూస్తాడో లేదో అనే భయంతో నేను పెళ్లి చేసుకోలేదు. నీకు అలా కాదు. ఇంటికి ఓ పెద్ద దిక్కు ఉంటే ఆ ధైర్యం వేరే ఉంటుంది. నా మాట విని నువ్వు ఇంకో పెళ్లి చేసుకో. అనుభవంతో చెబుతున్నాను’ అంది.
‘వచ్చే వ్యక్తి నన్ను మంచిగా చూసుకుంటాడని నమ్మకం ఏంటి అక్క?’
‘నిజమే. కానీ విశ్వాసంతో ముందుకు సాగాలి. ఆ సమయం వస్తే కచ్చితంగా నీకు మంచి జరుగుతోంది. పోనీ నువ్వు చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించు. కాలమే నీకు మంచి చేస్తుందేమో. చదువుకుంటే చాలా జయించవచ్చు. అందుకే నానా కష్టాలు పడి నా పిల్లలను చదివిస్తున్నాను’ అంది.
కమల మాటలు ఝాన్సీని ఆలోచింపజేశాయి. ముందు తన కాళ్లపై తాను నిలబడాలనుకుంది. అందుకే డిగ్రీ పూర్తి చేయాలనుకుంది.
ఊర్లో జాతర మొదలైంది. అందరూ సంబరాల్లో ఉన్నారు. చిన్న పిల్లలు కొత్త బొమ్మలు, మహిళలు మట్టిగాజులు, చీరలు కొంటున్నారు. చీరలు, మట్టిగాజులు కొనడానికి ఝాన్సీ వద్ద డబ్బులు లేవు. కానీ వాటిని పట్టుకొని చూస్తుంది. ఇంతలో రామ్‌ అక్కడికి వచ్చి ఝాన్సీని చూశాడు. ఆమె అతనికి చాలా నచ్చింది. ఆమె అమాయకమైన కళ్ళు అతన్ని ఆకర్షించాయి. ఝాన్సీ ఎక్కడికి వెళ్లినా ఆమెను అనుసరించడం ప్రారంభించాడు. రామ్‌ తన ఫ్రెండ్‌తో కలిసి ఆ ఊరుకి వచ్చాడు. మంచి వ్యక్తి. ఇంజనీర్‌ చేశాడు. మంచి ఉద్యోగం చేస్తున్నాడు.
రంగు రంగు మట్టి గాజులు ఝాన్సీకి ఎంతగానో నచ్చాయి. తీసుకోవాలనుకుంది. కానీ ఒక వితంతువు వాటిని ఎలా ధరించగలదు అని మనసులో అనుకుని అక్కడే వదిలేసింది. అవి వేసుకున్నా ఊర్లో అందరూ మాటలతో పొడుస్తారు. అవమానిస్తారు. ఈ ఆలోచనలు ఆమెకు బాధ కలిగించాయి. కమల ఇంట్లోకి ఏవో సామాన్లు కొన్నది. తన పిల్లలకు బొమ్మలు కొనిచ్చింది.
జాతరలో తాగే కుండలో నీళ్లు అయిపోవడంతో పక్కనే ఉన్న ఝాన్సీకి వాటర్‌ బాటిల్‌ ఇచ్చాడు రామ్‌.
‘థాంక్యూ సార్‌’ అని చెప్పింది.
‘మీరు బాధలో ఉన్నారు కదా?’ అడిగాడు.
ఝాన్సీ తన బాధ గురించి మాట్లాడటానికి ఇష్టపడదు. అతనికి మరోసారి ధన్యవాదాలు తెలిపింది. ఇంతలో ఝాన్సీ అని కమల గట్టిగా పిలవడంతో అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఆమె పేరు ఝాన్సీ అని రామ్‌ తెలుసుకున్నాడు.
జాతర జరిగినన్ని రోజులు రామ్‌ ఆమెను దూరంనుండి చూసి ఆనందించేవాడు. కొన్ని రోజులకు జాతర ముగిసింది. తర్వాత ఝాన్సీ కోసం రామ్‌ ప్రయత్నాలు చేశాడు. కానీ ఆమె ఎదురుపడలేదు. రామ్‌ తన ఊరు వెళ్లిపోయాడు.
క్ష్మిక్ష్మిక్ష్మి
రామ్‌ని ఝాన్సీ మళ్లీ కలిసి ఉండకపోతే ఆమె జీవితంలో ఇంత కీర్తి, పరిపూర్ణ జీవితాన్ని పొంది ఉండేది కాదు. ఆమెకు తెలియకుండానే, ఆమె జీవితాన్ని మార్చిన విలువైన క్షణాలను రామ్‌ బహుమతిగా ఇచ్చాడు.
ఆమె జ్ఞాపకాలలో మునిగిపోయింది.
ఝాన్సీ తన కొత్త జీవితాన్ని మళ్లీ ప్రారంభించేందుకు మూడేళ్లు పట్టింది. డిగ్రీ పూర్తయ్యాక బ్యాంకు ఉద్యోగంలో చేరింది.
ఊరు నుంచి వచ్చేసింది. బ్యాంకుకు వెళ్లి రావడం అలవాటు చేసుకుంది.
ఒకరోజు హఠాత్తుగా బ్యాంకుకి వచ్చిన రామ్‌ని చూసింది ఝాన్సీ. కానీ అతనితో మాట్లాడలేదు. చూసి చాలా కాలం అయింది కదా.
‘మీరు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారా?’ ఆమెను చూడగానే ఆశ్చర్యంగా అడిగాడు రామ్‌.
‘క్షమించండి, ఇంతకు ముందు మనం ఎక్కడ కలుసుకున్నామో నాకు గుర్తులేదు. మీకు ఏ సహాయం కావాలి?’ అని అడిగింది.
రామ్‌ గతాన్ని తొవ్వలేదు, ‘నేను బ్యాంకులో ఒక ఖాతా తెరవాలి’ అన్నాడు.
‘ప్రస్తుతం కొత్త ఖాతాలను ఇవ్వడం లేదు. మీరు వారం తర్వాత రండి’
‘ఇప్పుడు చాలా అవసరం ఉంది. దయచేసి సహాయం చేయండి’
‘ప్రస్తుతానికి ఈ పని చేయలేను’
‘నా పేరు రామ్‌. నేను ఇక్కడ రైల్వే శాఖలో పని చేస్తున్నాను. మీరు అనుకుంటే నాకు కొత్త ఖాతా ఇవ్వడం పెద్ద పని కాదు’
‘అయ్యో, సోమవారం మీ ప్రూఫ్‌ ఐడిని తీసుకునిరండి. పని అయిపోతుంది. ఇప్పుడు వెళ్లండి’ అంది.
సోమవారం ఖాతా తెరిచారు. అందుకు రామ్‌ థ్యాంక్స్‌ చెప్పాడు. తన వద్ద ఉన్న డబ్బును డిపాజిట్‌ చేశాడు.
సాయంత్రం ఆటో కోసం చూస్తోంది ఝాన్సీ. ఆమెను చూసిన రామ్‌ దగ్గరకు వెళ్లి, ‘హారు అండి. థాంక్స్‌’ అన్నాడు.
‘ఇంతకుముందే చెప్పారుగా’
‘నిజంగా నన్ను గుర్తుపట్టలేదా?’ అన్నాడు.
‘లేదు’
‘లేకపోయినా పర్లేదు. ఇప్పుడు మిమ్ముల్ని చూస్తే గర్వంగా ఉంది’
అతని మాటలు ఆమెకు మంచిగా అనిపించాయి. ‘కాఫీ తాగుదామా. నాకు సాయం చేశారు కదా’ అన్నాడు.
‘సాయం కాదు. అది నా పని. అయినా మీరు ఎవరో తెలియదు. కాఫీ ఎలా తాగగలను?’
‘ఇదిగో నా ఐడి. నా వివరాలన్నీ చూసే కదా మీరు ఖాతాను తెరిచారు. నమ్మకం లేకపోతే ఇవ్వరు కదా. నాతో కాఫీ తాగడానికి ఇది చాలదా’ అన్నాడు.
ఝాన్సీకి కోపం వచ్చింది. అతని ముఖం చూసింది. అతని ముఖంలో చిన్న పిల్లాడి లాంటి చిరునవ్వు చూసింది.
‘మీరు కోపంలో ఉంటే బాగోరు ఝాన్సీ’ అన్నాడు.
‘నా పేరు మీకు తెలుసా?’
‘తెలుసు’ అన్నాడు. ఒక కప్పు కాఫీనే కదా పదండి తాగుదాం అని చెప్పి నడక ప్రారంభించింది. అతను ఆమెతో నడిచాడు. రెస్టారెంట్‌కి వెళ్లారు.
‘అన్ని వేళలా ఆవేశంగానే ఉంటారా? లేక ఇలా మారిపోయారా? అందమైన ముఖాలు కోపంలో అందంగా కనిపించవు’ అన్నాడు.
ఆమె కోపంగా కాఫీ ముగించింది.
అతను కాఫీ కప్పును టేబుల్‌పై పెట్టి, ‘సరే, మీరు నాపై కోపంగా ఉన్నారని అనుకుంటా. నవ్వుతూ ఉండండి. బాగుంటారు. టెన్షన్స్‌తో కూడిన ఈ ఫాస్ట్‌ మూవింగ్‌ లైఫ్‌లో మనం హ్యాపీగా ఉండటం కూడా ముఖ్యం. నాకు స్నేహితులను సంపాదించుకోవడం ఇష్టం. మీరు నా స్నేహితురాలిగా ఉంటరా?’ అన్నాడు.
‘నాకు స్నేహితులెవ్వరూ వద్దు. నిజానికి, ఈరోజు ఒక కప్పు కాఫీ తాగడానికి ఎలా అనుమతించానో నాకే తెలియదు. ఇప్పటికి ఇది చాలు’
‘లేదు లేదు. మీరు అలా అనొద్దు. ఎందుకంటే మీరు నవ్వితే బాగుంటారు. మిమ్ముల్ని నవ్వించడానికి నాలాంటి స్నేహితుడు కావాలి. చూడండి మీకు మెల్లగా నవ్వు వస్తుంది.. వస్తుంది.. వచ్చేసింది’ రామ్‌ అలా అనడంతో ఆమె తెలియకుండానే చిన్నగా నవ్వింది.
‘నవ్వితే ఎంత అందంగా ఉంటారో చూడు’ అన్నాడు. ఆమె ముఖం మరోసారి బిగుసుకుపోయి చిరునవ్వు మాయమైంది. కానీ అతను కొంటెగా నవ్వి ఆమె కళ్ళలోకి చూశాడు.
‘ఇక నేను వెళ్తాను’
‘నేను డ్రాప్‌ చేస్తాను’
‘లేదు, థాంక్స్‌. నేను వెళ్తాను’ అంది.
శనివారం మధ్యాహ్నం వరకు వర్క్‌ చేసిన ఝాన్సీకి, ఒక్కసారిగా పిలవని పక్షిలాగా రామ్‌ గురించి ఆలోచన మనసులో మెదిలింది.
ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండే తనని నవ్వించాడు రామ్‌. మనసు ఎంత విచిత్రమైనది. కళ్ల ముందు ఎవరైనా కనిపిస్తే పట్టించుకునే ప్రయత్నం చేయదు. కనిపించకుండా పోయాక ఆత్రుతగా ఎదురుచూస్తోంది. మనసు ఏం కోరుకుంటుందో ఎవరికీ తెలియదు.
ఝాన్సీ బ్యాంకు పని ముగించుకుని బయటకు వచ్చింది. కానీ రామ్‌ కనిపించలేదు. రోజూ చాలామంది బ్యాంకుకు వచ్చి వెళ్తుంటారు. ఈరోజు నేనెందుకు అంత ఆత్రుతగా ఉన్నాను? నాకు ఏమైంది? అనుకుంది.
రామ్‌ ఆమె వెనుక నుండి వచ్చి ‘నన్ను వెతుకుతున్నారా?’ అన్నాడు.
‘నాకు ఏం పని లేదని అనుకుంటున్నారా?’ అంది.
‘సరే మీ బిజీ షెడ్యూల్‌లో నా కోసం ఐదు నిమిషాలు కేటియిస్తారా?’ అన్నాడు.
‘ఏంటి కాఫీనా?’ అని అడిగింది.
అతను తల ఊపుతూ నవ్వాడు. కాఫీ టైం ఇచ్చి మెల్లగా అక్కడ్నుంచి తప్పించుకుంది.
సోమవారం. ఆమె యథావిధిగా ఆఫీసు పనుల్లో బిజీగా ఉంది.
‘ఆఫీస్‌ టైం అయిపోయినా, ఇంకా పని చేయడం నిజంగా గ్రేట్‌’ ఝాన్సీని చూస్తూ అన్నాడు రామ్‌.
ఝాన్సీ తల పైకెత్తింది. చేతి గడియారం వైపు చూసింది. అయిదున్నర దాటింది. ఆఫీసులో సగభాగం ఖాళీగా ఉంది.
‘ఐదు నిమిషాలు వేచి ఉండండి. వస్తున్నాను’ అంది రామ్‌తో. స్కూల్‌ నుంచి ఇంటికి వెళ్తున్న పిల్లాడిలా బయటకు వెళ్లాడు రామ్‌.
రామ్‌ ఎందుకు వచ్చాడు. నేను ఎందుకు వేచి ఉండమని చెప్పాను. తనలో తానే గునుక్కుంది.
‘కాఫీ తాగుదాం’ అన్నాడు. ఇద్దరూ రెస్టారెంట్‌కి నడిచారు.
‘ఝాన్సీ మీ గురించి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా?’ కాఫీ సిప్‌ చేస్తూ అడిగాడు.
ఝాన్సీ ఏం చెప్పలేదు. ఆమె ఎవర్నీ అంత తేలిగ్గా నమ్మదు. కానీ అతను తన గురించి, తన తల్లిదండ్రులు, ఉద్యోగం, నచ్చిన ప్రతి దాని గురించి వివరించాడు. ఎన్నో కబుర్లు చెప్పాడు. అతని అల్లరి మాటలకు, ఆమె కొన్నిసార్లు నవ్వింది.
వారి పరిచయంలో కొన్ని సార్లు కలుసుకున్నారు. అతని వల్ల రోజులో కొన్ని నిమిషాల పాటు ఆమె మనసారా నవ్వుకునేది. ఆ సమయంలో ఆమెకు కాస్త రిలాక్స్‌గా అనిపించేది. అతను కల్మషం లేనివాడని ఆమె భావించింది.
ఓ రోజు ఫోన్‌ చేసి ‘కాఫీ’ తాగుదామా అని ఆమెనే అడిగింది. రామ్‌ వచ్చాడు. అతను ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తాడు. అతని ముఖంలో ఎప్పుడూ దిగులు కనపడదు.
‘నేను ఇప్పుడు మీ స్నేహితుడిగా ఉండవచ్చా?’ అన్నాడు. ఆమె నవ్వింది.
‘ఇలాగే నవ్వుతూ ఉండు’ అన్నాడు రామ్‌.
‘మీ చేతికి గాజులు బాగుంటాయి’ అన్నాడు. ఆమె ముఖంలోంచి చిరునవ్వు మాయమైంది.
టాపిక్‌ డైవర్ట్‌ చేస్తూ ‘ఇంకేంటి విషయాలు’ అడిగింది.
‘ఎక్కడ ఉంటున్నారు?’
‘ఇక్కడే స్టేషన్‌పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లో’ అంది.
‘సరే ఆఫీసు పనిమీద ముంబై వెళ్తున్నాను. ఒక నెల వరకు రాను’ అన్నాడు.
‘నిజంగానా?’ నిరుత్సాహంగా అంది. అతని ఉల్లాసం, అల్లరి, చిరునవ్వు తాను మిస్‌ అవుతానని అనుకుంది.
‘ఏమైంది?’ ఆమె ముఖంలోకి చూస్తూ అడిగాడు.
‘మనం స్నేహితులం’ అని చెప్పింది. అతని ముఖం వెలిగిపోయింది. నవ్వాడు.
రామ్‌ ముంబై వెళ్లిపోయాడు. వేగంగా వెళ్లే జీవితంలో ఆమె మళ్లీ ఒంటరిదైంది. కానీ ఈ జీవితం ఆమెకు అలవాటే.
ఝాన్సీకి రామ్‌ ఫోన్‌ చేశాడు. ఆమె లిఫ్ట్‌ చేయలేదు. అతను మళ్లీ తన వద్దకు రాడని ఊహించుకుంది. ఒకరోజు రామ్‌ హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు.
‘రామ్‌, ఎప్పుడు వచ్చావు?’ చిరునవ్వుతో అడిగింది ఝాన్సీ.
‘ఇప్పుడే రైలు దిగాను. నేను రానని అనుకున్నావా?’ అన్నాడు.
ఝాన్సీ సమాధానం చెప్పలేదు. ఆమె ఒంటిరి జీవితంతో ఇబ్బంది పడింది. అందుకే గాలిలో దీపం పెట్టలనుకోలేదు. రామ్‌ మళ్లీ వస్తాడని ఆమె అసలు ఊహించలేదు.
‘ఏమైంది డల్‌గా ఉన్నావు’ అన్నాడు. ఝాన్సీ మాట్లాడలేదు.
‘రేపు బయటకు వెళ్దాం అనుకుంటున్నాను. నువ్వు నాతో రావొచ్చుగా’ అని అడిగాడు.
ఝాన్సీకి అతని మీద నమ్మకం కలిగింది. అందుకే అతన్ని చూస్తూ ‘నువ్వు నా స్నేహితుడివి కదా. వస్తాను’ అంది. అతను నవ్వాడు.
ఆమెను రూం దగ్గర డ్రాప్‌ చేశాడు.
‘కాఫీ?’ ఆమె అడిగింది. అతను సరే అన్నాడు. ఇంట్లోకి పిలిచింది.
‘ఎందుకు ఒంటరిగా ఉన్నావు? ఎందుకు పెళ్లి చేసుకోలేదు?’
‘ఇప్పుడు దాని గురించి ఆలోచన లేదు రామ్‌’ చేతికి కాఫీ ఇస్తూ అంది.
‘అదేమిటి? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను’
‘దాని గురించి ఇప్పుడు మాట్లాడదలచుకోలేదు రామ్‌. ఒంటరిగా ఉండి, సమాజానికి సేవ చేస్తూ ఉండిపోతే తప్పా?’ అంది.
‘సేవ చేసేవాళ్ళు పెళ్లి చేసుకోలేదా?’
‘నాకు తెలియదు. దాని గురించి ఎక్కువగా అడగవద్దు. నీ గురించి చెప్పు. పెళ్లి, ప్రేమ?’
‘ఒక అమ్మాయిని ప్రేమించాను. వన్‌ సైడ్‌ లవ్‌. కానీ ఆమె వేరే దేశంలో స్థిరపడాలనుకుంది. అక్కడే ఓ వ్యక్తిని పెళ్లాడింది’
‘అన్ని మనం అనుకున్నట్లు జరగవు రామ్‌. జరిగినది మన మంచికే అని మూవ్‌ అవ్వాలి. నిన్ను కోరుకునేవాళ్లు నీకు దొరుకుతారు’
‘అవును, అందుకే మూవ్‌ అయిపోయా’ అని నవ్వాడు.
‘నువ్వు ఎప్పుడూ ఇంతేనా? దేన్నీ సీరియస్‌గా తీసుకోవా. నీలాగా ఉండడం కష్టం. నా వల్ల కాదు. నాకు బాధ ఉంటే, అది నా ముఖంలో కనిపిస్తుంది’
‘నాకు తెలుసు. నీకు చాలా బాధాకరమైన గతం ఉంది. కానీ నువ్వు చెప్పవు. నువ్వు చెప్పిన రోజే వింటానులే’ అని నవ్వాడు.
‘నువ్వు ముంబై వెళ్లినప్పుడు నేను ఫోన్‌ ఎత్తలేదు కదా. ఏమైనా అనుకున్నావా?’
‘బిజీగా ఉన్నావు అనుకున్నాను. నువ్వు నా స్నేహితురాలివి, నిన్ను అర్దం చేసుకోవాలి కదా’ అన్నాడు.
నేను అడిగేవరకు కూడా అది అడగకుండా నా మనసును నొప్పించలేదు. రామ్‌ చాలా మంచి వ్యక్తి అనుకుంది. నేను వెళ్లి వస్తాను అన్నాడు రామ్‌.
‘సరే రేపు కలుద్దాం’ అంది.
‘కాల్‌ చేస్తా. గుడ్‌ నైట్‌’ అని రామ్‌ వెళ్లిపోయాడు. వెళుతున్న రామ్‌ వైపు చూస్తూ ఉండిపోయింది ఝాన్సీ.
ఉదయం కాల్‌ చేశాడు. ‘నువ్వు వచ్చేటప్పుడు స్వెటర్‌ తెచ్చుకో. వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. ఇది చలికాలం’ అన్నాడు.
‘నాకు చలి అలవాటే’ అంది.
సూర్యోదయం తర్వాత నగరంలో చాలా ప్రదేశాలు తిరిగారు. ఆమె పుట్టినప్పటి నుండి ఇన్ని ప్రదేశాలు చూడలేదు. ప్రపంచం ఎంత పెద్దది అనుకుంది. చాలా సంతోషంగా ఉంది. రామ్‌ చేసే అల్లరి, కొంటె మాటలకు ఆమె చాలా సార్లు నవ్వుకుంది. ఒకరికి ఆనందం ఇవ్వడంలోనే అతను ఆనందపడుతాడు. నా ముఖంలో బాధ, సంతోషం అతను అర్థం చేసుకోగలడని అనుకుంది.
నెమ్మదిగా చీకటి పడింది. ‘నీకు ఆలస్యమవుతుంది కదా?’ అన్నాడు.
‘పర్వాలేదు. అయినా ఇంట్లో నాకోసం ఎవరు ఎదురుచూస్తున్నారు’ అంది.
ఇద్దరూ అందమైన ప్రదేశంలో కూర్చున్నారు. పాల వెన్నెలతో ఆకాశం అందంగా ఉంది.
‘ఈ ఆకాశాన్ని చూస్తే నీకేం అనిపిస్తుంది?’
‘ఏం ఉంది, అంతా శూన్యం’ అంది.
‘జీవితంలో సంతోషానికి చిన్న చిన్న విషయాలు చాలా అవసరం. ఆకాశంలో చుక్కలున్నాయి, చంద్రుడు ఉన్నాడు. నువ్వు కనుగొని సాధించగలిగే వాటి గురించి కలలు కను. అవి దక్కినప్పుడు, వాటి గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడు నువ్వు మంచి అనుభూతి చెందుతావు. ఇప్పుడు చెప్పు ఆకాశం ఎలా ఉందో?’ అన్నాడు.
ఝాన్సీ కాసేపు ఆలోచించి, ‘నీలి ఆకాశం మెరిసే చుక్కలతో అందంగా ఉంది. వాటిని మించి అందమైన చంద్రుడు. ఆకాశంలో గీసిన వృత్తంలా గుండ్రంగా ఉన్నాడు’ చెప్పింది.
‘ఎంత బాగా చెప్పావో’ అన్నాడు. ఆమె అందంగా నవ్వింది.
వారు తిరిగి ఊరుకి బయలుదేరారు. ప్రయాణంలో, ఏంటి ఈ అబ్బాయి అంత మంచివాడు, అతను కావాలంటే నేను ఒంటరిగా ఉన్నపుడు పరిస్థితిని సద్వినియోగం చేసుకోగలడు. బహుశా పురుషులందరూ ఒకేలా ఉండకపోవచ్చు, అనుకుంది ఝాన్సీ.
బైక్‌ వేగంగా వెళుతుంది. ఝాన్సీకి చాలా చలి వేసింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. పళ్ళు చప్పుడు చేస్తున్నాయి.
‘అందుకే స్వెటర్‌ తెచ్చుకోమని చెప్పాను. పోనీ నా స్వెటర్‌ తీసుకో’ అన్నాడు.
‘పర్వాలేదు’ అని చెప్పింది. చలి కారణంగా ఆమె అతన్ని వెనుక నుండి కౌగిలించుకోవాలనుకుంది, కానీ ధైర్యం చేయలేదు. చివరగా తన స్వెటర్‌ ఆమెకు ఇచ్చాడు. ఆమెకు అప్పుడు కొంచెం వెచ్చగా అనిపించింది.
‘చూశావా ఝాన్సీ, చంద్రుడు మనతో ప్రయాణిస్తున్నాడు’ అని నవ్వాడు.
అతని మాటలు ఎంత తమాషాగా ఉంటాయో, అంతే అర్థవంతంగా కూడా ఉంటాయి. అతను అన్నది కూడా నిజమే కదా. మనల్ని ప్రేమించే వారు ఎక్కడున్నా మనతోనే ఉన్నట్లు అనిపిస్తోంది.
ఎందుకో ఈ ప్రయాణం శాశ్వతంగా ఉండాలని ఆమె మనస్ఫూర్తిగా కోరుకుంది. మోటార్‌ బైక్‌ ఆమె ఫ్లాట్‌ ముందు ఆగినప్పుడు, ఈ రాత్రి ఇంకాస్త ఉంటే బాగుండు అనుకుంది. రాత్రి తర్వాత కొత్త తెల్లవారుజాము కోసం ఎదురుచూసింది.
ఝాన్సీ తన గతం గురించి రామ్‌కి చెప్పి సానుభూతి చూపాలని ఎప్పుడూ కోరుకోలేదు. అతని మంచితనం ఆమెకు నచ్చింది. కానీ తన కోసం అతనిపై ఎలాంటి ఆప్యాయతను రుద్దాలనుకోలేదు. కాలానుగుణంగా ముందుకు సాగాలని నిర్ణయించుకుంది.
ఝాన్సీకి రామ్‌ పరిచయమై తెలియకుండానే ఏడాది గడిచింది. నచ్చిన వారితో ఉంటే సమయం తెలియదు అంటారు. అది ఇదేనేమో అనుకుంది.
ఎప్పుడూ కలిసినా రామ్‌ కళ్లలో అదే వెలుగు, మొహంలో అదే చిరునవ్వు. ఆమె అతనితో ఉంటే, సంతోషంగా ఉంటుంది. ధైర్యంగా ఫీల్‌ అవుతుంది. సమస్యల గురించి మాట్లాడుతుంది. జోకులు వేసుకుంటారు. నవ్వుకుంటారు. ఝాన్సీ తన జీవితాన్ని ఇలాగే కోరుకుంది. కానీ తన మనసులోని కోరికను ఎప్పుడూ బయట పెట్టలేదు.
ఓరోజు, నీకు ఇష్టమైతే నీ గతం గురించి అడగను, నిన్ను పెళ్లి చేసుకుంటానని ఝాన్సీతో రామ్‌ చెప్పాడు. నా జీవితంలోకి నీలాంటి మంచి వ్యక్తి రావాలని కోరుకుంటున్నాను అన్నాడు. దానికి ఝాన్సీ ఏమీ మాట్లాడలేదు. తెలియని సందిగ్ధంలో పడింది.
నన్ను పెళ్లి చేసుకుంటే, అతన్ని సమాజం ఏదైనా అంటే, వాళ్ల ఇంట్లో వాళ్ళకు నచ్చకపోతే, నా గతం తెలిసి రామ్‌ నన్ను కనీసం ఒక స్నేహితురాలిగా కూడా అంగీకరించకపోతే, ఇలా చాలా ఆలోచించింది. అనుభవంతోనే అన్ని అర్థం అవుతాయి. కమల అక్క అందుకేనేమో పెళ్లి చేసుకోలేదు అని అనుకుంది.
ఈ విషయంలో ఝాన్సీని ఇబ్బంది పెట్టడం రామ్‌కి ఇష్టం లేదు. ఆమె నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మళ్లీ ఈ విషయం గురించి అడగలేదు.
ఓరోజు ‘నువ్వు మంచి వ్యక్తిని పెళ్లి చేసుకో ఝాన్సీ. ఒంటరిగా జీవించవద్దు. ప్రేమించే వారితో కలిసి జీవిస్తే ఎన్నో క్షణాలు చాలా అందంగా ఉంటాయి’ అన్నాడు.
అతని మాటలు వినగానే అత్త జమున మాటలు గుర్తొచ్చాయి. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి.
ఆ తర్వాత రామ్‌ కనిపించలేదు. అతను ఆమెకు సంతోషకరమైన జీవితానికి సంబంధించిన కొత్త అర్థం తెలియజేశాడు. పరిపూర్ణమైన, సంపూర్ణమైన జీవితం అనే బహుమతిని ఎలా పొందాలో చెప్పాడు.
నిశ్శబ్దంగా, చీకటిగా ఉన్న తన జీవితంలోకి వెలుగు నింపాడు రామ్‌. తన చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూడటం నేర్పించాడు. మనోహరమైన చిరునవ్వుతో నవ్వేలా చేశాడు. చిన్న చిన్న ఆనందాలే మంచి ఆరోగ్యకరమైన జీవితం అని బోధించాడు.
తన లైఫ్‌ ఇకపై ప్రకాశవంతమైన రంగులతో కనిపించాలంటే తన జీవితంలో రామ్‌ ఉండాలని బలంగా కోరుకుంది.
క్ష్మిక్ష్మిక్ష్మి
ఆమెకు రామ్‌ దూరంగా ఉన్నా అతని పట్ల ఆమెకు ప్రేమ పెరిగింది కానీ తగ్గలేదు. ఆమె అతన్ని కనుగొనడానికి, ప్రేమను ఒప్పుకోవడానికి ప్రయాణిస్తుంది. ఆమె బంధానికి ఈ ప్రయాణం చాలా విలువైనది.
బీచ్‌లో ఉన్న రామ్‌ని ఝాన్సీ కనుగొంది. అతను ఆకాశం వైపు చూస్తూ కూర్చున్నాడు. అలలు అతని కాళ్లను తాకుతున్నాయి.
‘ఝాన్సీ ఇక్కడ ఏమి చేస్తున్నావు?’ ఆమెను చూడగానే అన్నాడు. అతని కళ్ళు ఆశ్చర్యం, ఆనందం కలగలిసి ఉన్నాయి.
లోతైన శ్వాసతో ‘నేను నిన్ను కనుగొన్నాను. ఇకపై నీనుండి దూరం కావడం నేను భరించలేను. నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. నా జీవితాన్ని నీతో పంచుకోవాలని ఉంది’ కన్నీళ్లతో చెప్పింది.
‘ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న నా జీవితంలో నువ్వు కొత్త పుస్తకం రాశావు. అది చాలా బాగుంది. అది పూర్తిగా తెలుకున్నాకే నాకు అర్థమైంది. నువ్వు అందరి అబ్బాయిలా కాదు. నీకు స్వార్థం లేదు. నాపై అధికారం చూపించవు. నేను ప్రతిదీ గమనిస్తూనే ఉన్నాను. నీతో నేను ఉండాలనుకుంటున్నాను. మీ తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారో, సమాజం మీ గురించి ఏమనుకుంటుందో అని ఆలోచించాను. అదే నా మనసులో ఉంది రామ్‌’
‘నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకునే ముందు రోజు కమల కలిసింది. ఆమె నీ గురించి ప్రతిదీ చెప్పింది. కానీ అవేవి నాకు, నా తల్లిదండ్రులకు అడ్డు కాదు. వాళ్లకు చెప్పే నీ దగ్గరకు వచ్చాను. అందుకే పెళ్లి గురించి అడిగాను. నేనేం తప్పు చేయడం లేదు. నువ్వు మంచి అమ్మాయివి. నువ్వు నాతో ఉంటే చాలా సంతోషంగా ఉంటాను’ అన్నాడు.
ఝాన్సీ అతని చేతులను తన చేతుల్లోకి తీసుకుంది. రామ్‌ కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘నేను దూరంగా ఉన్న ప్రతి క్షణం నిన్ను కోల్పోతున్నాను. నువ్వు లేని లోటు నాకు స్పష్టంగా అర్థమైంది’ అని చెప్పింది.
వారి ప్రేమ మునుపెన్నడూ లేనంత ప్రకాశవంతంగా పుంజుకుంది. ఆ క్షణంలో ఆమె భుజన ఉన్న కష్టాలన్నీ తొలగిపోయాయి. వారు కలిసి ఉండాలనుకుంటున్నారని వారికి తెలుసు. ఝాన్సీ కన్నీళ్లు తుడిచాడు రామ్‌. తన బ్యాగ్‌లో నుంచి అందమైన మట్టి గాజులు తీసి ఆమె చేతికి తొడిగాడు. ఆమె అతన్ని కౌగిలించుకుంది. ఆ రోజు నుంచి ఝాన్సీ, రామ్‌ ఇద్దరూ కలిసే జీవించారు.
– రమేశ్‌ రాపోలు, 9030872697

Spread the love