అణగారిన వర్గాలకు విద్యను దూరం చేసే నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి: ఏఐఎస్ఎఫ్

– ఎన్ఈపి రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 12న ఛలో పార్లమెంట్ మార్చ్ పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ- డిండి  :-   అణగారిన వర్గాలకు విద్యను దూరం చేసే నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని,  జనవరి12న 16 లౌకిక విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగే చలో పార్లమెంట్ మార్చ్ పోస్టర్ ను డిండి మండల కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ డివిజన్ అధ్యక్షుడు సూరిగి వినయ్ కుమార్ మాట్లాడుతూ..  విద్య కాషాయీకరణ, విద్య ప్రైవేటీకరణ కోసమే నూతన విద్యా విధానం వ్యతిరేకంగా జాతీయ విద్యా విధానం 2020 తీసుకొచ్చారని అన్నారు. ప్రజలందరూ దీనిని తిరస్కరించాలని, ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి పేద, మధ్య తరగతి వర్గాలకు విద్యను దూరం చేసే కుట్ర అమలు చేస్తున్నారని, దానిలో భాగమే కేంద్రంలో నూతన జాతీయ విద్యావిధానం – 2020  తీసుకొచ్చారని విమర్శించారు. విద్యా కార్పొరేటికరణ, కాషాయికరణ చేయాలని కేంద్రం కుట్ర పన్నుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలో జాతీయ విద్యా విధానం వల్ల దాదాపు 90% విద్యార్థులు నాణ్యమైన విద్య పొందే హక్కును కోల్పోతారని, విద్యా వ్యాపారీకరణ వలన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు సామాజిక న్యాయం దూరం చేసే విధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకటే పరీక్షలు నిర్వహించే సంస్థ, ఒకటే రెగ్యులేషన్ సంస్థ, ఒకటే అక్రిడిటేషన్ సంస్థ, ఒకటే ప్రమాణాలు నిర్ణయించే సంస్థలను స్థాపించడం వల్ల రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు  జోసెఫ్ భాను, మేఘన, మాధవి జావేద్, చరణ్, చందన, సైదులు, సృజన్, శ్రీలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Spread the love