అందరి కండ్లూ రఫాపైనే పట్టు వీడని ఇజ్రాయిల్‌

అందరి కండ్లూ రఫాపైనే పట్టు వీడని ఇజ్రాయిల్‌– మరో ఏడు మాసాలు యుద్ధం సాగుతుందని వెల్లడి
– భద్రతా మండలిలో అల్జీరియా ముసాయిదా తీర్మానం
– ఇజ్రాయిల్‌ తీరును ఖండిస్తున్న ప్రముఖులు
– రఫాలోకి చొచ్చుకుపోతున్న ట్యాంకులు
గాజా : రఫాపై విచక్షణారహితంగా ఇజ్రాయిల్‌ కొనసాగిస్తున్న దాడులు యావత్‌ ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి. కానీ ఇజ్రాయిల్‌ మాత్రం తన నిరంకుశత్వాన్ని విడనాడడం లేదు. తాజాగా ఆదివారం రాత్రి రఫాలోని శిబిరంపై జరిగిన దాడిలో అమాయకులైన పౌరులు మరణించడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతున్న నేపథ్యంలో తక్షణమే ఈ హత్యలను ఆపాలంటూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అల్జీరియా ముసాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించింది. మరోవైపు ‘ఆల్‌ ది ఐస్‌ ఆన్‌ రఫా’ హ్యాష్‌ ట్యాగ్‌ సోషల్‌ మీడియాలో బాగా ట్రెండ్‌ అవుతోంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులందరూ రఫా దాడులపై గళమెత్తారు. అక్కడ జరుగుతున్నది యుద్ధం కాదని, మారణహోమమని నినదించారు. మన దేశంలో కూడా పలువురు ప్రముఖులు ఈ నినాదానికి మద్దతు తెలిపారు. ఇజ్రాయిల్‌ దురహంకారానికి మూల కారణమైన అమెరికా దీనిపై స్పందిస్తూ రఫాపై దాడి ఖండించింది. కానీ ఇంతమాత్రాన ఇజ్రాయిల్‌ పట్ల తాము అనుసరిస్తున్న విధానంలో ఎలాంటి మార్పు లేదని, ఇజ్రాయిల్‌ రెడ్‌ లైన్‌ దాటలేదని వైట్‌హౌస్‌ ప్రకటించింది. మరో ఏడు మాసాల పాటు అంటే ఈ సంవత్సరాంతం వరకు గాజాలో యుద్దం కొనసాగుతుందని ప్రధాని నెతన్యాహు జాతీయ భద్రతా సలహాదారు జాచి హనెగ్బి చెప్పారు. గాజా, ఈజిప్ట్‌ల మధ్య ప్రాంతమైన ఫిలడెల్ఫియా కారిడార్‌ 75శాతం మిలటరీ అదుపులోకి వచ్చిందని చెప్పారు.
మంగళవారం జరిగిన భద్రతా మండలి సమావేశంలో అల్జీరియా రాయబారి అమోర్‌ బెండ్జ్‌మా ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయాలని, రఫాపై అన్ని రకాల దాడులను నిలిపివేయాలని తీర్మానం కోరుతోంది. పైగా గాజాలో నెలకొన్న దుర్భరమైన పరిస్థితుల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే అక్కడ మానవతా సాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరింది. పౌరులపై, మౌలిక వసతులపై విచక్షణారహితంగా జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించింది. అల్జీరియా అభ్యర్ధన మేరకు భద్రతా మండలి అత్యవసరంగా మంగళవారం సమావేశమైంది.
రఫాలోకి ఇజ్రాయిల్‌ ట్యాంకులు
రఫాతో సహా మొత్తంగా గాజాపై దాడులను ఆపేందుకు అంతర్జాతీయ సమాజం తర్జన భర్జనలు పడుతుంటే మరోపక్క ఇజ్రాయిల్‌ బుధవారం ఉదయం కూడా రఫావ్యాప్తంగా దాడులు జరిపింది. రఫాలోకి ఇజ్రాయిల్‌ ట్యాంకులు చొచ్చుకు పోతున్నాయని ప్రత్యక్ష సాక్షులు, పాలస్తీనా భద్రతా వర్గాలు తెలిపాయి. బయటకు ఎవరైనా వస్తే ఇజ్రాయిల్‌ డ్రోన్‌లతో కాల్చేస్తున్నందున ప్రస్తుతం ప్రజలు ఇళ్ళలోపలే వుంటున్నారని అక్కడి నివసిస్తున్న అబ్దుల్‌ ఖతీబ్‌ తెలిపారు. బదర్‌ శిబిరాన్ని, రఫాకు పశ్చిమంగా గల జురోబ్‌ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నారని పాలస్తీనా వర్గాలు తెలిపాయి. మంగళవారం 13 మంది బాలికలు, మహిళలతో సహా 21మంది పాలస్తీనియన్లు మరణించారు. రఫాలోని అల్‌మవాసి ఏరియాలోని నిర్వాసితుల శిబిరంపై ఈ దాడులు జరిగాయని పాలస్తీనా భద్రతా వర్గాలు తెలిపాయి. ఆర్మీ ఆదేశాల మేరకే నిర్వాసితులు అక్కడకు వచ్చి తలదాచుకున్నారు. ఇప్పుడు అక్కడ కూడా ఆర్మీ దాడులు జరిపింది. రఫా వ్యాప్తంగా కమ్యూనికేషన్‌, ఇంటర్‌నెట్‌ సేవలు పూర్తిగా స్తంభించాయి. ప్రస్తుతం ఫిలడెల్ఫి కారిడార్‌పై మిలటరీ పట్టు సాధించింది. ఆ కారిడార్‌ పశ్చిమంగా లోపలకు ట్యాంకులు దూసుకువెళుతున్నాయని ఆ వర్గాలు తెలిపాయి. గతంలో ఉత్తర, సెంట్రల్‌ గాజా ప్రాంతాలపై దాడి చేసినపుడు రఫా నగరాన్ని సురక్షితమైన జోన్‌గా ఇజ్రాయిల్‌ మిలటరీ ప్రకటించింది. దాంతో గాజాలో దాదాపు సగానికి సగం మంది నిర్వాసితులు అక్కడకే చేరుకున్నారు. ఇప్పుడు అక్కడే దాడులు మొదలవడంతో ప్రాణనష్టం విపరీతంగా వుంటోంది. దాడులు మొదలైన తర్వాత దాదాపు 10లక్షల మంది రఫాను వీడినట్లు తెలుస్తోంది.
రోజుకు 500 ట్రక్కులకు పైగా ఆహారం అవసరమవుతుండగా, గత మూడు వారాల్లో కేవలం 170 ట్రక్కుల సాయం మాత్రమే అందిందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. సమీప భవిష్యత్తులో రఫా క్రాసింగ్‌ను తెరిచే అవకాశాలు కనిపించడం లేదని పాలస్తీనా ఆరోగ్య మంత్రి చెప్పారు. నిత్యావసరాలు, మందులు సరఫరాలకు ఈ క్రాసింగ్‌ కీలకం.

Spread the love