గాజా మారణహోమానికి

to the Gaza genocide– వ్యతిరేక ఆందోళనపై ఉక్కుపాదం
– అమెరికా విశ్వవిద్యాలయాల నిరసనలపైన బైడెన్‌ సర్కార్‌ అణచివేత
అమెరికా : పాలస్తీనా అనుకూల నిరసనలను అరికట్టడానికి పోలీసు హింసకు అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపిన ఆమోద ప్రభావం అమెరికా విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతూ ఉంది. కొలంబియా విశ్వవిద్యాలయం, సిటీ కాలేజ్‌ ఆఫ్‌ న్యూయార్క్‌, పోర్ట్‌లాండ్‌ విశ్వవిద్యాలయం, విస్కాన్సిన్‌ విశ్వవిద్యాలయం, టేనస్సీ విశ్వవిద్యాలయం, ఇతర క్యాంపస్‌లలో గురువారం 300 మంది విద్యార్థులను అరెస్టు చేశారు. ఈ భారీ పోలీసు దాడులు ఆ మధ్యాహ్నం బైడెన్‌ చేసిన మూడు నిమిషాల ప్రసంగాన్ని అనుసరించాయి. ఆ ప్రసంగంలో అతను శాంతియుత నిరసనలను ”హింసాత్మకం”, ”యూదు వ్యతిరేకం” అని ప్రకటించాడు. ”ఆర్డర్‌ తప్పనిసరిగా గెలవాలి” అని చెప్పాడు.
బైడెన్‌ మాట్లాడటానికి కొన్ని గంటల ముందు, లాస్‌ ఏంజిల్స్‌ పోలీసులు యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా క్యాంపస్‌లో ప్రవేశించి 137 మందిని అరెస్టు చేశారు. బుధవారం రాత్రి నిద్రిస్తున్న నిరసనకారులపై జియోనిస్ట్‌ ఫాసిస్టులు చేసిన దాడులను ఆపటానికి పోలీసులు ఏమీ చేయలేదు. శుక్రవారం న్యూయార్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ది న్యూ స్కూల్‌, న్యూయార్క్‌ విశ్వవిద్యాలయం వద్ద నిరసన శిబిరాలను కూల్చివేసింది. ది న్యూ స్కూల్‌లో 43 మందిని, న్యూయార్క్‌ విశ్వవిద్యాలయంలో 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కొలంబియాలోని హామిల్టన్‌ హాల్‌ను శాంతియుతంగా ఆక్రమించిన విద్యార్థులపై దాడి చేస్తున్న సమయంలో పోలీసుల్లో ఒకరు తన ఆయుధాన్ని ”అనుకోకుండా ప్రయోగించారని” న్యూయార్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ అంగీకరించింది. తుపాకీ డిశ్చార్జ్‌పై మూడు రోజుల మౌనానికి పోలీసు ప్రతినిధి ఎటువంటి కారణం చెప్పలేదు.
అయితే నిరసనకారులను ”హమాస్‌ టెర్రరిస్టులు”, ”బయటి ఆందోళనకారులు” అని దుమ్మెత్తిపోయడానికి డెమోక్రాట్లు, రిపబ్లికన్‌లు చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా శుక్రవారం ఉదయం అరెస్టు చేసిన నిరసనకారులు విద్యార్థులని అంగీకరించిన తర్వాత న్యూయార్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ కాజ్‌ డాట్రీ ఇలా అన్నాడు : ఈ ఉద్యమం వెనుక ఎవరో ఉన్నారు… దీనికి ఎవరో నిధులు సమకూరుస్తున్నారు. మా విద్యార్థులను ఎవరో తీవ్రవాదం వైపు మరలిస్తున్నారు. మా డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ టెర్రరిజం, ఇంటెలిజెన్స్‌ విభాగం అది ఎవరో కనుగొంటారు. అలా చేసినప్పుడు మేము వారిని కొన్ని ప్రశ్నలు అడుగుతాము.
శుక్రవారం కూడా, చాపెల్‌ హిల్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినా వద్ద గాజాలో ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణహోమాన్ని ఆపాలని డిమాండ్‌ చేయడానికి ట్రాఫిక్‌ను నిలిపివేసిన ప్రదర్శనను పోలీసులు అనేక వందల మందితో విచ్ఛిన్నం చేశారు. పోలీసులు కనీసం 30 మందిని అరెస్టు చేశారు. విస్కాన్సిన్‌-మాడిసన్‌ విశ్వవిద్యాలయం విద్యార్థులు తదుపరి వారం ఫైనల్స్‌ ప్రారంభానికి ముందు నిరసన శిబిరాన్ని ముగించాలని డిమాండ్‌ చేసింది. విద్యార్థుల డిమాండ్లకు మద్దతుగా సోమవారం అధ్యాపకులు వాకౌట్‌ చేస్తారని యుడబ్ల్యూ-మాడిసన్‌ వద్ద నిరసన కారులు ప్రకటించారు. చికాగో విశ్వవిద్యాలయం అధ్యక్షుడు పాల్‌ అలివిసాటోస్‌ ఏప్రిల్‌ 29న విద్యార్థులు ఏర్పాటు చేసిన శిబిరాన్ని తీసివేయాలని బెదిరించాడు.
క్యాంపస్‌ కాలేజ్‌ గ్రీన్‌లో ఏప్రిల్‌ 25 నుంచి కొనసాగుతున్న నిరసన శిబిరం త్వరలో మూసివేస్తారని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ పాలనా యంత్రాంగం శుక్రవారం హెచ్చరిక జారీ చేసింది. వాక్‌ స్వాతంత్య్రం, రాజకీయ వ్యక్తీకరణ హక్కుల ఉల్లంఘనలను న్యాయపరంగా సవాలు చేయటానికి పాలస్తీనియన్లకు మద్దతుగా నిరసన తెలిపిన తర్వాత ఇండియానా యూనివర్సిటీ క్యాంపస్‌ నుంచి నిషేధించబడిన ముగ్గురి తరపున అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్‌ బ్లూమింగ్టన్‌ ఇండియానాలో శుక్రవారం కోర్టును ఆశ్రయించింది. ప్రొఫెసర్‌ బెంజమిన్‌ రాబిన్సన్‌, గ్రాడ్‌ విద్యార్థి మడేలిన్‌ మెల్‌డ్రమ్‌, బ్లూమింగ్టన్‌ నివాసి జాస్పర్‌ విర్ట్‌ షాఫ్టర్‌ అనే ముగ్గురు వ్యక్తులు నిరసనల కోసం నిర్దేశించబడిన 20 ఎకరాల క్యాంపస్‌ స్థలమైన డన్‌ మేడో వద్ద ప్రదర్శనలు చేస్తున్నారు, వారిని అరెస్టు చేసి తర్వాత నిషేధించారు.
గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్‌ చేస్తున్న సామూహిక హత్యాకాండను వ్యతిరేకిస్తున్న నిరసన కారులపైన జరుగుతున్న పోలీస్‌ దాడులకు బైడెన్‌ పాలన, అమెరికాలోని రెండు పాలక పార్టీలతో పాటు అమెరికా సామ్రాజ్యవాద నాయకత్వంలోని నాటో కూటమి దేశాల మద్దతు ఉంది. అయినప్పటికీ, విద్యార్థులు, కార్మికులు సాహసోపేతంగా తమతమ నిరసన కొనసాగిస్తున్నారు. కొలంబియా, యూనివర్శిటీ ఆఫ్‌ క్యాలిఫోర్నియా, లాస్‌ఏంజలిస్‌, ఇతర అమెరికా విశ్వవిద్యాలయ విద్యార్థులు తీసుకున్న వైఖరి స్ఫూర్తితో విద్యార్థుల నిరసన శిబిరాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం ప్రారంభించాయి. లండన్‌, ప్యారిస్‌, రోమ్‌, సిడ్నీ, టోక్యో, బీరూట్‌లలో విద్యార్థుల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

Spread the love