ఉక్రెయిన్‌ యుద్ధంలో ఐదు లక్షల మంది సైనికులు మృతి

In the war in Ukraine Five lakh soldiers died– రష్యా రక్షణ మంత్రి
మాస్కో: ఫిబ్రవరి 2022 నుంచి ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో మరణించిన ఉక్రెయిన్‌ సైనికుల సంఖ్య దాదాపు ఐదు లక్షలకు చేరుకున్నదని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు మంగళవారం పేర్కొన్నారు. రష్యా దళాలు ముందుగా చొరవతీసుకుని వారి ప్రత్యర్థులను వెనక్కి నెట్టివేస్తున్నాయని, కీవ్‌ దళాలు తమ రక్షణాత్మక స్థానాలలో నిలదొక్కుకోకుండా నిరోధిస్తున్నాయని షోయిగు మంత్రివర్గ సమావేశంలో చెప్పారు. కీవ్‌ కోసం అమెరికా 60 బిలియన్ల కంటే ఎక్కువ సైనిక సహాయాన్ని కేటాయించడం గురించి కూడా రక్షణ మంత్రి ప్రస్తావించారు. ఈ చర్య ఉక్రేనియన్‌ దళాల ”ఓటమిని నిరోధించడానికి” మాత్రమే ఉద్దేశించబడిందని అతను పేర్కొన్నారు.అయితే డబ్బు యుద్ధరంగంలో పరిస్థితిని గణనీయంగా ప్రభావితం చేయదని, ఎందుకంటే నిధులలో చాలావరకు అమెరికా యుద్ధ పరిశ్రమలకు చేరతాయనే విషయం అందరికీ తెలిసిందేనని ఆయన అన్నారు. ”తమ ప్రయోజనాల కోసం రష్యాతో జరిగే పోరాటంలో ఉక్రేనియన్లు చనిపోతున్నారని అమెరికన్‌ అధికారులకు తెలుసు” అని షోయిగు అన్నారు. రష్యాతో అమెరికా నేరుగా పోరాడటం కంటే ఉక్రెయిన్‌కు డబ్బు చెల్లించి యుద్ధం చేయించటం ఉత్తమమని అమెరికాకు బాగా తెలుసని కూడా ఆయన అన్నారు.రక్షణ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచటంలోను, పోరాట పరిస్థితికి అనుగుణంగా సైనిక వ్యూహాలను రూపొందించటంలోను రష్యా ఆరితేరటాన్ని షోయిగు ప్రశంసించారు. ఉక్రెయిన్‌కు పాశ్చాత్య ఆయుధాలను సరఫరా చేయడానికి ఉపయోగించే లాజిస్టిక్స్‌ హబ్‌లపైన, ఆయుధ డిపోలపైన రక్షణ మంత్రిత్వ శాఖ సుదూర దాడులను కొనసాగిస్తుందని ఆయన చెప్పారు.ఉక్రెయిన్‌ సైన్యంలో నిర్బంధంగా పౌరులను చేర్చటానికి ఉద్దేశింపబడిన చట్టంపైన ఈ నెల ప్రారంభంలో ఉక్రేనియన్‌ ప్రెసిడెంట్‌ వ్లాదిమిర్‌ జెలెన్స్కీ సంతకం చేశారు. సైన్యంలో చేరకుండా తప్పించుకునే వారిని ఈ చట్టం కఠినంగా శిక్షిస్తుంది. ఫిబ్రవరిలో అతను తొలగించిన ఉక్రెయిన్‌ మాజీ సైనిక ప్రధానాధికారి వాలెరీ జలుజ్నీచే ప్రతిపాదించబడిన 500,000 సమీకరణ లక్ష్యాన్ని తాను అధికమని భావిస్తున్నట్లు జెలెన్స్కీ చెప్పారు.పెద్ద ఎత్తున అమెరికా సహాయం చెయ్యాలని ఉక్రెయిన్‌ అభ్యర్థించి చాలా నెలలు గడిచింది.

Spread the love