మారణహోమం

Genocide– గాజాలో 112 మందిపై ఊచకోత
– ఇజ్రాయిల్‌ హత్యాకాండపై ప్రపంచదేశాల ఆగ్రహం
గాజా: ఆకలితో అలమటిస్తున్న పిల్లలను, మహిళలతో సహా 112 మందిని ఇజ్రాయిల్‌ అమానుషంగా పొట్టనబెట్టుకున్నది. ఈ పాశవిక చర్యను ప్రపంచ దేశాలు ఖండించాయి. పాలస్తీనీయులను ఊచకోత కోసిన ఇజ్రాయిల్‌ దాష్టీకం పట్ల ఐరాస ప్రధానకార్యదర్శి ఆంటోనియా గుటెరస్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాలస్తీనీయులకు మానవతా సాయం అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఖతార్‌, యూరోపియన్‌ యూనియన్‌, సౌదీ అరేబియా ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. ఇజ్రాయిల్‌ మారణకాండపై చైనా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సాయం కోసం ఎదురుచూస్తున్న వారిని చంపడాన్ని తీవ్రంగా పరిగణించాలని చైనా విదేశాంగ ప్రతినిథి మావో నింగ్‌ అన్నారు. ఇజ్రాయిల్‌ ఆర్మీ సాగించిన హత్యాకాండ మానవాళిపై జరిగిన మహా నేరమని టర్కీ వ్యాఖ్యానించింది. ”మానవతా సాయం కోసం క్యూలైన్లలో ఎదురుచూస్తున్న అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం, వారిని ఉద్దేశపూర్వకంగా సామూహికంగా అంతం చేయాలన్నదాంతో చేసిందేననిటర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. గాజాలో ఇజ్రాయిల్‌ మారణహోమాన్ని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఖండించారు. ”ఆహారం అడిగిన 100 మందికి పైగా పాలస్తీనియన్‌లను ఇజ్రాయిల్‌ అధ్యక్షుడు నెతన్యాహూ చంపేశారు. ఇది నరమేథం, మారణహోమం” అని ఎక్స్‌లో ఆయన ట్వీట్‌ చేశారు. ఇజ్రాయిల్‌ నుండి ఆయుధాల కొనుగోళ్లను రద్దుచేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కాల్పుల విరమణ ఆవశ్యకతను ఈ ఘటన నొక్కి చెబుతోందని స్పానిష్‌ విదేశాంగ మంత్రి జోస్‌ మాన్యుయెల్‌ ఆల్బరెస్‌ పేర్కొన్నారు. తక్షణమే కాల్పుల విరమణ కోసం పిలుపునివ్వాలని ఇటలీ డిమాండ్‌ చేసింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తేలికగా స్పందించారు. కాల్పుల విరమణ చర్చలను ఇది క్లిష్టతరం చేస్తుందని ఆయన అన్నారు. సాయం కోసం ఎదురుచూస్తున్న పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ సైన్యం జరిపిన కాల్పులు సమర్థనీయం కాదని ఫ్రాన్స్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇజ్రాయిల్‌ అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలని, పౌరులకు సాయం అందించేందుకు రక్షణ కల్పించాలని ఒక ప్రకటనలో పేర్కొంది.

Spread the love