హిజ్‌బుల్లాతో ఇజ్రాయిల్‌ యుద్ధానికి సిద్ధమా…?

– నెల్లూరు నరసింహారావు
ఇజ్రాయిల్‌-లెబనాన్‌ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని తెలుస్తోంది. అంతకుముందు ఇజ్రాయిల్‌ పైన హిజ్‌బుల్లా దాడిచేస్తుందని అందరూ భావించారు. తమ ఉత్తర సరిహద్దులో యుద్ధానికి ఇజ్రాయిల్‌ సిద్దపడటంలేదని కూడా అందరూ భావించారు. అయితే ఇజ్రాయిల్‌ దక్షిణ లెబనాన్‌ లో యుద్ధానికి సిద్ధపడుతున్నట్టు అర్థమౌతోంది. లిటాని నది తీరానికి లెబనీస్‌ షియా హిజ్‌బుల్లా యోధులు ఉపసంహరించుకోకపోతే వారిపై దాడిచేయటానికి ఇజ్రా యిల్‌ వెనుకాడబోదని ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రి యోయావ్‌ గాల్లన్ట్‌ ప్రకటించాడు. దక్షిణ లెబనాన్‌ పైన దండయాత్ర చేసే ప్రణాళిక ఇజ్రాయిల్‌ దగ్గర ఉందని లండన్‌ టైమ్స్‌ రాసింది. హిజ్‌బుల్లాను ఇజ్రాయిల్‌ సరిహద్దు నుంచి 20కిలోమీటర్ల దూరంలోవున్న లిటాని నది ఒడ్డుకు హిజ్‌బుల్లాను వెనక్కి నెట్టాలనే లక్ష్యంగా ఇజ్రాయిల్‌ దాడి ఉంటుంది. ఒకవైపు హిజ్‌బుల్లా దాడిచేయగలదు కానీ పూర్తి స్థాయి యుద్ధం చేయజాలదని ఇజ్రాయిల్‌ ప్రచారం చేస్తోంది. ఈ అంచనాకు మద్దతుగా హిజ్‌బుల్లా నాయకుడు సయ్యద్‌ హస్సన్‌ నస్రల్లా ఈ మధ్యకాలంలో చేసిన ఉపన్యాసాన్ని ఉటంకిస్తున్నారు. ఆ ఉపన్యాసంలో పాలస్తీనా సమస్యపట్ల తనకు అంతగా పట్టదన్నట్టు ఆయన చెప్పాడని, ఐక్యరాజ్య సమితిలో ఇరాన్‌ ప్రతినిధులు కూడా తమ దేశంపైన దాడి జరిగితే తప్ప ఇరాన్‌ ఇజ్రాయిల్‌ తో ప్రత్యక్షంగా తలపడబోదని చెప్పినట్టు ఇజ్రాయిల్‌ ప్రచారం చేస్తోంది. మరోవైపు హిజ్‌బుల్లాను ఇజ్రాయిల్‌ పట్టించు కోవటంలేదని చెప్పజాలమని పేర్కొంటున్నారు. హిజ్‌బుల్లా సామర్థ్యం తెలిసే ఇజ్రాయిల్‌ లెబనాన్‌ సరిహద్దుకు సమీపంలోగల ఆవాసాలన్నింటినీ ఖాళీ చేయటం జరిగింది. ఈలోపు ఇజ్రాయిల్‌ ప్రధాన మద్దతుదారైన అమెరికా ఘర్షణను యుద్ధంగా పరిణమించకుండా చూడాలని ఇరాన్‌ పైన వత్తిడి తెస్తోంది. ఇరాన్‌కు ఆర్థికంగాను, రాజకీయం గాను ప్రాధాన్యతగల దేశమైన చైనా కూడా పరిస్థితిని చేయిదాటనీయవద్దని ఇరాన్‌ ను కోరుతోంది.
అంతిమంగా ఇజ్రాయిల్‌ హమస్‌ పైన చేస్తున్న యుద్ధం ముగియకముందే హిజ్‌బుల్లా పైన దాడి చేస్తే జరిగే పర్యవసానాల గురించి ఇజ్రాయిల్‌ ఆందోళనకు గురౌవు తోంది. బహుశా ఇది ఇరాన్‌ ప్రతిస్పందనలను తెలుసు కునేందుకు ఉద్దేశింపబడిన పథకం అయివుంటుంది. ఒకవేళ అటువంటి ప్రణాళికే గనుక ఉండివుంటే, ఆ ప్రణాళికను ఇజ్రాయిల్‌ అమలు చేయటానికి సిద్దపడితే పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. హిజ్‌బుల్లా కంటే చాలా చిన్నదైన హమాస్‌ను పూర్తిగా ఓడించటం కుదరని ఇజ్రాయిల్‌ హిజ్‌బుల్లా, హమాస్‌ లపైన ఏకకాలంలో యుద్ధం చేయటం క్లిష్టంగా మారుతుంద నటంలో సందేహం లేదు. లెబనాన్‌ పైన ఇజ్రాయిల్‌ దాడి చేయనున్నదనే వార్తలు వెలువడుతుండగా, దీనికి సమాంతరంగా ఎర్ర సముద్రంలో నౌకా రవాణాను స్తంభింపజేసిన యెమినీ హౌతీస్‌ పైన అమెరికా యుద్ధానికి సిద్దమౌతోంది. అమెరికా యెమెన్‌ పైన యుద్ధానికి సిద్దపడుతోందని డిసెంబర్‌18న అమెరికా మాజీ ఇంటెల్లిజెన్స్‌ అధికారి స్కాట్‌ రిట్టర్‌ అన్నాడు. అదే రోజున ఎర్ర సముద్రంలో యెమెనీ హౌతీలు చేస్తున్న దాడులను తిప్పికొట్టి నౌకా రవాణాను సురక్షితం చేయనున్నట్టు అమెరికా రక్షణ కార్యదర్శి లాయడ్‌ ఆస్తిన్‌ ప్రకటనను పెంటగాన్‌ వెబ్‌ సైట్‌ ప్రచురించింది.
మరోవైపు అదే అమెరికా రక్షణ కార్యదర్శి ఆస్తిన్‌ ఇజ్రాయిల్‌ ను దర్శించి ప్రధాని బెంజమిన్‌ నెతాయ్యాహు యుద్ధ వ్యూహాన్ని మార్చుకోవాలని వత్తిడి చేశాడు. అలా జరగకపోతే ఇజ్రాయిల్‌ ”వ్యూహాత్మక ఓటమి”పాలవుతుందని ఆయన హెచ్చరించాడు. పాలస్తీనాలో జరుగుతున్న ఘటనలతో తాము విసిగిపోయామని అంతకుముందు కూడా అమెరికా ఇజ్రాయిల్‌ కి స్పష్టం చేసింది. గాజాలో ఇజ్రాయిల్‌ చేస్తున్ననరమేధం ఇజ్రాయిల్‌, అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ ల ప్రతిష్టను దెబ్బతీస్తోంది. పాలస్తీనాపైన ఇజ్రాయిల్‌ చేస్తున్న దాడుల్లో వేలాది మంది పసి పిల్లలు, పౌరులు చనిపోవటం అమెరికా, ఐరోపా ద్వంద ప్రమాణాలకు, నైతిక దివాళాకోరుతనానికి ప్రతికగా ఉంది. దానితో ఉక్రెయిన్‌ లో రష్యా చేస్తున్నయుద్ధాన్ని విమర్శించే అవకాశాన్ని పశ్చిమ దేశాలు పోగొట్టుకుంటు న్నాయి. గాజాలో ఇజ్రాయిల్‌ దాడులను త్వరగా ముగించి యుద్ధాన్ని పాలస్తీనాకు ఆవల విస్తరించకుండా చూడాలని అమెరికా కోరుతున్నట్టు నిష్ణాతులు భావిస్తున్నారు.

Spread the love