తైవాన్‌లో 24 గంటల్లో 80కి పైగా భూకంపాలు

నవతెలంగాణ – హైదరాబాద్: తూర్పు ఆసియా దేశం తైవాన్ తీవ్ర భూకంపాలతో వణికిపోయింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు 24 గంటల వ్యవధిలో మొత్తం 80 భూకంపాలు సంభవించాయి. తైవాన్ తూర్పు తీరంలో అత్యధిక తీవ్రత 6.3గా నమోదయింది. ఈ ప్రభావంతో దేశ రాజధాని తైపీలో పలు భవనాలు కంపించి దెబ్బతిన్నాయని తైవాన్ వాతావరణ విభాగం తెలిపింది. దేశం తూర్పు ప్రాంతంలోని హువాలియన్‌లో ఎక్కువ భూకంపాల కేంద్రాలను గుర్తించినట్టు వెల్లడించింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. కాగా ఏప్రిల్ 3న తైవాన్‌లో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ విపత్తులో 14 మంది మరణించారు. ఆ నాటి నుంచి తైవాన్ వరుస భూప్రకంపనలు చవిచూస్తోంది. ఏప్రిల్ 3న సంభవించిన భూకంపంతో హువాలియన్‌లో కొద్దిగా వంగిన ఓ హోటల్ తాజా భూకంపం ప్రభావంతో నిర్వహించడానికి వీలులేకుండా పోయిందని అగ్నిమాపక విభాగం మంగళవారం తెల్లవారుజామున వివరించింది. భూకంపాలకు అధిక అవకాశం ఉండే రెండు ‘టెక్టోనిక్ ప్లేట్స్’ జంక్షన్‌కు సమీపంలో తైవాన్ ఉంటుంది. అందుకే ఆ దేశం ఎక్కువగా భూకంపాలకు గురవుతుంటుంది. 2016లో దక్షిణ తైవాన్‌లో సంభవించిన భూకంపం ధాటికి 100 మందికి పైగా మరణించారు. ఇక 1999లో ఏకంగా 7.3 తీవ్రతతో కూడిన భూకంపం ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. ఏకంగా 2,000 మందికి పైగా తైవాన్ వాసులు మరణించారు.

Spread the love