ఆఫ్రికాలో ఎదురు దెబ్బలు

Backlash in Africa– పునపరిశీలనలో పడిన అమెరికా విధానం పొలిటికో
న్యూయార్క్‌: తమ దేశంలో 1,000 కంటే ఎక్కువగావున్న అమెరికా సైనికులను ఉపసంహరించుకోవాలని నైజర్‌ ఆదేశించటంతో అమెరికా ఒక కీలకమైన డ్రోన్‌ స్థావరాన్ని కోల్పోయినట్టయింది. దీనితో అమెరికా ప్రభుత్వం తన ఆఫ్రికా విధానంపై ”పునరాలోచనలో పడింది” అని ప్రభుత్వంలోని వనరులను ఉటంకిస్తూ పొలిటికో వార్తా సంస్థ రాసింది. నైజర్‌ నుంచి ”క్రమబద్ధమైన, బాధ్యతాయుతమైన ఉపసంహరణ” జరుగుతుందని గత వారం అమెరికా ధవీకరించింది.
పశ్చిమ ఆఫ్రికాలోని నైజర్‌ ప్రభుత్వం గతంలో ఇదే పద్ధతిలో ఫ్రెంచ్‌ దళాలను బహిష్కరించి రష్యాతో భద్రతా సహకారాన్ని ఎంచుకుంది. పాశ్చాత్య శక్తుల నుంచి దూరంగా జరిగే విస్తత ప్రాంతీయ ప్రక్రియలో భాగంగా పొరుగున ఉన్న చాడ్‌ కూడా అమెరికన్లను తమ దేశాన్ని వీడాలని కోరింది. ఆఫ్రికన్‌ దేశాలతో వ్యవహరించేటప్పుడు అమెరికా భావజాలపరమైన లక్ష్యాలను అనుసరించడం వల్ల విపరీత పరిణామాలు చోటు చేసుకున్నాయని పొలిటికోతో మాట్లాడుతూ అనామక అమెరికా అధికారులు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య సంస్కరణల అమలు, ఇతర రాజకీయ డిమాండ్లపై షరతులతో కూడిన సహాయం చేయడానికి వాషింగ్టన్‌ ప్రయత్నించినప్పుడు కొంతమంది ఆఫ్రికన్‌ నాయకులు తిరస్కరించారు.
ఎందుకంటే అమెరికా ”ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఉన్న మిత్రదేశాలతో వ్యవహరించేటప్పుడు ఇటువంటి షరతులను పెట్టటంలేదు” అని వారు వాదిస్తున్నట్టు పొలిటికో సోమవారం రిపోర్ట్‌ చేసింది. ”ఆఫ్రికన్‌ దేశాలకు ఎలా పరిపాలించాలనే విషయంపైన పశ్చిమ దేశాల బోధనలకు చెప్పటానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. వారు చివరకు ‘చాలు బాబోయి’ అని చెబుతున్నారు.”ఆఫ్రికన్‌ దేశాల సహజ వనరులను తమకు అందుబాటులో ఉండేలా చూసుకోవటానికి, చైనా, రష్యాలను ఆఫ్రికాకు దూరంగా ఉంచడానికి ”ప్రజాస్వామ్యంలో సవాళ్లు” వంటి భావజాలపరమైన విషయాలను విస్మరించాలని తెర వెనుక అమెరికా అధికారులు గట్టిగా చెబుతున్నట్టు పొలిటికో వివరించింది. అమెరికా ప్రచారం చేస్తున్న ”నియమాల-ఆధారిత క్రమం” నయావుదారవాద విధానాలకు ముసుగని రష్యా, చైనాలు విమర్శిస్తున్నాయి. ఇతర దేశాల అభివద్ధిని అణగదొక్కడానికి, తనకు, తన మిత్రదేశాలకు ప్రయోజనం చేకూర్చే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అమలు చేయడానికి అమెరికా నైతిక వాక్చాతుర్యాన్ని ఉపయోగిస్తోందనే విమర్శ సర్వత్రా ఉంది. ఆఫ్రికాలో విఫలమవుతున్న వ్యూహంలో భాగంగా రష్యా ఉనికిని ”పరాన్నజీవి”గా చిత్రీకరించడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నం మాస్కోతో భాగస్వామ్యంలోకి రావాలనే ఆఫ్రికన్‌ నాయకుల నిర్ణయాలను మార్చలేదని తేలిపోయిందని పొలిటికో పేర్కొంది.

Spread the love