చైనా ఎలక్ట్రిక్‌ కార్లపై అమెరికా యుద్ధం

America's War on China's Electric Carsఅమెరికా ఆటోమొబైల్‌ పరిశ్రమను రక్షించడానికి చైనీస్‌ స్మార్ట్‌ కార్ల పై దర్యాప్తును ప్రారంభిస్తున్నట్లు బిడెన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రకటించింది. చైనీస్‌ కార్లను ”జాతీయ భద్రతా ముప్పు”గా పేర్కొంటూ, ఎటువంటి ఆధారం చూపకుండా చైనీస్‌ కార్లు చైనాకు వ్యక్తిగత డేటాను పంపగలవని అమెరికా ఆరోపించింది. చైనీస్‌ ఉత్పత్తులను లేదా సేవలను బ్లాక్‌లిస్ట్‌ చేయడానికి, అమెరికాలో ప్రవేశించకుండా మినహాయిం చటానికి ”జాతీయ భద్రతకు ప్రమాదం” అనే సాకును అమెరికా వాడుతుందని అందరికీ తెలుసు. అలా అమెరికా నుంచి బహిష్కరించిన ఇతర చైనీస్‌ కంపెనీలలో హువే కూడా ఒకటి. సాధారణంగా అమెరికా ప్రతిస్పందన చాలా హిస్టీరికల్‌గా ఉంటుంది.
ఇందుకు సంబంధించిన ఒక ఉదాహరణ ఇలా ఉంది. చైనా ఎగుమతి చేసిన వెల్లుల్లితో అమెరికా జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడిందని ఫ్లోరిడా సెనేటర్‌ రిక్‌ స్కాట్‌ చెప్పాడు. అదే సాంకేతికత విషయాలకు వచ్చినప్పుడు చైనా నుంచి దిగుమతి అయ్యే సాంకేతికతలకు గూఢచర్యం లక్ష్యంగా ఉంటుందనే ఆరోపణ చేయబడుతుంది. అలా చైనా పట్ల అమెరికా అవలంభిస్తున్న కఠినమైన చర్యలను తీసుకోవటాన్ని సమర్థించడానికి రాజకీయ ఏకాభిప్రాయం ఏర్పడుతుంది.చైనా సాంకేతిక, పారిశ్రామిక పురోగతిని నిరోధించడానికి ప్రయత్నించడం, గ్లోబల్‌ వాల్యూ చైన్‌ లో చైనా విలువ పెరగకుండా చూడటం, కీలక పరిశ్రమలలో అమెరికా ఆధిపత్యానికి భంగం కలగకుండా చూడటంవంటి విషయాలు బైడెన్‌ విదేశాంగ విధాన లక్ష్యాలుగా ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా చైనీస్‌ సెమీకండక్టర్‌ పరిశ్రమను నాశనం చేసేందుకు ప్రయత్నించడంపైన వైట్‌ హౌస్‌ తన దృష్టిని సారించింది, అధునాతన సెమీకండక్టర్లను, వాటి ఉత్పాదక పరికరాలను చైనీస్‌ కంపెనీలకు అందకుండా చేయటానికి అమెరికా తన ఎగుమతి నియంత్రణ విధానాలను ఆయుధాలుగా ఉపయోగిస్తోంది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సల్లివన్‌ దీనిని ”చిన్న పెరడుకు వేసిన ఎత్తైన కంచె” అనే వ్యూహంగా పేర్కొన్నాడు. అమెరికా తన ఆటోమొబైల్‌ పరిశ్రమను రక్షించుకోవటానికి మిత్రులు, శత్రువులు అనే తేడాలేకుండా చాలా కఠినంగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన పరిశ్రమను ముందుకు తీసుకెళ్లడానికి గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ ప్రేరణ ఉంది.
ఇది అంతర్జాతీయంగా ఎలక్ట్రికల్‌ కార్లు, బ్యాటరీలు, సోలార్‌ ప్యానెల్లు మరియు ఇతర వస్తువులకు డిమాండ్‌ పెరగడానికి దారితీసింది. ఈ క్రమంలో చైనా అతిపెద్ద ఎలెక్ట్రిక్‌ కార్ల తయారీదారుగాను, పునరుత్పాదక ఇందన ఉత్పత్తి కోసం వినియోగించే సామాగ్రి ఎగుమతిదారుగాను నిలిచింది. అలా జపాన్‌ను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద కార్‌ ఎగుమతిదారుగా అవతరించింది. చైనీస్‌ ఎలక్ట్రిక్‌ కార్లకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ పుంజుకుంది. ఇప్పటికే చైనాలో తయారైన కార్లపైన అమెరికాలో 25 శాతం సుంకం విధించటం జరిగింది. పోటీపడే చైనా కార్ల సామర్థ్యం, అవి చౌక ధరలకు లభ్యమవటం వలన మార్కెట్‌ లో వాటి ప్రాబల్యాన్ని అడ్డుకోవటం అమెరికాకు సాధ్యపడటం లేదు. అంతే కాదు, మెక్సికోలో తన వాహనాల తయారీని ప్రారంభించడం ద్వారా అమెరికన్‌ మార్కెట్‌ లోకి ప్రవేశించే అవకాశాలను చైనా ఉపయోగించుకోగలిగింది. మెక్సికోలో తయారైన కార్లకు నార్త్‌ అమెరికన్‌ ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌ (ఎన్‌ఏఎఫ్‌టీఏ) కారణంగా అమెరికాలోకి ప్రవేశించడానికి వీలు కలగటమే కాకుండా, అలా ప్రవేశించిన కార్లపైన విధించే సుంకం కూడా తక్కువగా ఉంటుంది.
దీనితో బైడెన్‌ అడ్మినిస్ట్రేషన్‌పై రాజకీయ ఒత్తిడి పెరిగింది. ఈ సంవత్సరం ఎన్నికలు రాబోతున్నందున, సహజంగానే రాబోయే నెలల్లో చైనాకు వ్యతిరేకంగా బైడెన్‌ కఠినంగా వ్యవహరిస్తాడని చెప్పవచ్చు. ఎందుకంటే అతను చైనాపై మరింత కఠినంగా ఉండాలని పిలుపునిచ్చే డొనాల్డ్‌ ట్రంప్‌ ను రాజకీయ ప్రత్యర్థిగా ఎదుర్కొంటున్నాడు. ట్రంప్‌ తన మునుపటి అధ్యక్ష పదవీ కాలంలో అమెరికా రక్షిత ఆర్థిక విధానాలవైపు మొగ్గేలా చేశాడు. .మరో విధంగా చెప్పాలంటే, ట్రంప్‌ ఆర్థిక ఆలోచనలపైన స్పందించవలసిన అవసరం బైడెన్‌ కు ఏర్పడుతుంది. అమెరికన్‌ కార్మికుల ఓట్లను పొందడానికి అమెరికన్‌ ఉద్యోగాల కోసం పోరాడుతున్నానని బైడెన్‌ చూపించాల్సి ఉంటుంది, అందువల్ల చైనా ఎలక్ట్రిక్‌ వాహనాలను లక్ష్యంగా చేసుకోవడం బైడెన్‌ ఎజెండాలో ఉంటుంది.

Spread the love