కాళేశ్వరంపై విచారణకు కదలిక

కాళేశ్వరంపై విచారణకు కదలిక– నేడు రిటైర్డ్‌ జస్టీస్‌ పినాకిని చంద్రఘోష్‌ రాక : మూడు నెలల్లో నివేదిక
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ (కెఎల్‌ఐఎస్‌)లో అవకతవకలపై విచారణకు అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన న్యాయకమిషన్‌ తన పనిని త్వరలో ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ఆర్థిక అవకతవకలు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పిల్లర్ల పగుళ్లు, సీపేజీలపై సమగ్ర వచారణ చేయాలంటూ సీఎం రేవంత్‌ సర్కారు కమిషన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌కు జస్టిస్‌ ఘోష్‌ రానున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేసిన విషయం విదితమే. 100 రోజుల్లోపు కాళేశ్వరం నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సర్కారు క్యాబినెట్‌లో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం విషయాన్ని జస్టీస్‌ ఘోష్‌కు సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌బొజ్జా కోల్‌కతా వెళ్లి వివరించారు. క్యాబినెట్‌ తీర్మానం, ప్రభుత్వం జీవో, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలు, విజిలెన్స్‌ నివేదిక, ఎన్‌డిఎస్‌ఏ పర్యటన సమచారం అంతా అందజేసినట్టు తెలిసింది. ఘోష్‌కు సచివాలయం పక్కనున్న బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. దాదాపు మూడు నెలలకుపైగా కమిషన్‌ విచారించనుంది.
ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన అధికారులు, కాంట్రాక్లర్లు, వర్కింగ్‌ ఏజెన్సీలకు నోటీసులు ఇవ్వడం ద్వారా విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి. వేగంగా విచారించడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీల్లో లోపాలకు బాధ్యులను గుర్తించి, చట్టం ప్రకారం ఎలాంటి శిక్షలు విధించాలో జస్టీస్‌ ఘోష్‌ తన నివేదికలో పొందుపరచనున్నారు. ఘోష్‌ కమిషన్‌ ప్రాజెక్టు సాంకేతిక అంశాలను సైతం అధ్యయనం చేయనుంది. కాగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జూన్‌ 30 లోగా నివేదిక సమర్పించాలని కోరింది. కాగా ఇప్పటికే నెల సమయం గడిచిపోయింది. ఇక మిగిలింది మే, జూన్‌ రెండు నెలలు మాత్రమే. జస్టీస్‌ ఘోష్‌ బాధ్యతల్లోకి రావడానికి ఆలస్యం కావడంతో సమయం పొడిగించే అవకాశం లేకపోలేదనే ప్రచారం జలసౌధలో జరుగుతున్నది. ఇదిలావుండగా అన్నారం బ్యారేజీ ఎగువన ఉన్న ఇసుక మేటల తొలగింపు పనులు సైతం శ్రీకారం చుట్టారు. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) ఆదేశాల మేరకు పియర్స్‌ వద్ద సౌండింగ్‌, ప్రోబింగ్‌ పరీక్షలు చేయాల్సి ఉండగా, వీటికి ఇసుక మేటలు అడ్డుగా ఉన్న నేపథయంలో వాటిని తొలగించే ప్రక్రియ పనులను అధికారులు చేపట్టడం గమనార్హం.

Spread the love