మహిళాలోకం కన్నెర్ర

Mahila Lokam Kannera– దేశ దేశాల్లో మహిళా దినోత్సవ వేడుకలు, పోరాటం
లండన్‌ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచదేశాల్లోని మహిళలు తమ హక్కుల కోసం ఉద్యమించారు. ఇటలీ నుంచి లండన్‌ వరకు, పాకిస్తాన్‌ నుంచి ఇండోనేషియా ఇలా ఆసియా,యూరప్‌ దేశాలనే తేడాలేకుండా ఆయా దేశాల పాలకులపై కన్నెర్ర చేశారు. సమాన వేతనం చెల్లించాలని, పునరుత్పత్తి హక్కులు, విద్య, న్యాయం, నిర్ణయం తీసుకునే ఉద్యోగాలు కల్పించాలని, ఇతర ముఖ్యమైన అవసరాలను తీర్చాలని కోరుతూ ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సంవత్సరం కనీసం 71 మంది మహిళలు హత్యకు గురైన టర్కీతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు మహిళల హక్కులకు హామీ ఇస్తున్నామన్న మాటలు కోటలు దాటుతున్నా, ఆచరణ గడప దాటనందునే మహిళలు ఈ విధంగా వీధుల్లోకి రావాల్సివచ్చింది. అంతర్జాతీయ మహిళా ధినోత్సవాన్ని 1977లో ఐక్యరాజ్యసమితి అధికారికంగా గుర్తించింది, మహిళలు ప్రపంచవ్యాప్తంగా తమ హక్కులను గెలుచుకోవడానికి, మెరుగుపరచడానికి చేసే పోరాటాలను స్మరించుకునే రోజుగా దీనిని పాటిస్తున్నారు.
బుర్కినా ఫాసో, రష్యా క్యూబాతో సహా 20కి పైగా దేశాల్లో ఈ రోజును అధికారిక సెలవుదినం.
ఆఫ్ఘనిస్తాన్‌లో ఇప్పటికీ అధికారిక సెలవుదినమే అయినప్పటికీ, మహిళలు విద్యతో సహా పెద్ద అవరోధాలు, ఆంక్షలను ఎదుర్కొంటున్నారు, అక్కడ బహిరంగంగా బురఖా లేదా హిజాబ్‌ ధరించమని తాలిబాన్లు బలవంతం చేస్తున్నారు. ప్రయాణ సమయంలో మగ బంధువులు వెంట ఉండాలని తాలిబాన్ల ఆంక్షలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అమెరికాలో అబార్షన్‌కు సంబంధించిన ఫెడరల్‌ హక్కును హామీ ఇచ్చే 1973 రో వి వేడ్‌ తీర్పును సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఇది మహిళల పునరుత్పత్తి హక్కులను రద్దు చేయడమేనని మహిళా సంఘాలు నిరసించాయి. అబార్షన్‌ను రాజ్యాంగ హక్కుగా స్పష్టంగా హామీ ఇచ్చిన ఏకైక దేశంగా ఫ్రాన్స్‌ సోమవారం అవతరించింది. ఇతర చోట్ల, మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని బహిరంగంగా జరుపుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది. టర్కీలో గత సంవత్సరం ఇస్తాంబుల్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ మార్చ్‌పై అధికారికంగా నిషేధం విధించారు. ఈ ఆంక్షలను ధిక్కరించి వీరోచితంగా పోరాడిన మహిళలపై ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించింది. ప్రదర్శకులను చెదరగొట్టడానికి బాష్పవాయువును ప్రయోగించడం, వందలాదిమందిని అదుపులోకి తీసుకోవడం వంటి అణచివేత చర్యలకు పాల్పడింది. ఈ ఆంక్షలను ధిక్కరించి సుమారు రెండు గంటల పాటు మహిళలు నిరసన తెలపడం విశేషం. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు టర్కీలో కనీసం 71 మంది మహిళలు హత్యకు గురయ్యారు.’విరు విల్‌ స్టాప్‌ ఫెమిసైడ్స్‌’ వేదిక తెలిపిన వివరాల ప్రకారం గత సంవత్సరం టర్కీలో 403 మంది మహిళలు హత్యకు గురయ్యారు, వారిలో ఎక్కువ మంది ప్రస్తుత లేదా మాజీ జీవిత భాగస్వాములు , వారికి సన్నిహితంగా ఉన్న ఇతర పురుషుల చేతిలో హత్యగావించబడినవారే.ఈ వేదిక సెక్రటరీ జనరల్‌ ఫిదాన్‌ అటాసెలిమ్‌ మాట్లాడుతూ పురుషులు ”మహిళల పురోగతిని అణచివేయడానికి హింసాత్మకంగా ప్రయత్నిస్తున్నారు” అని అన్నారు

Spread the love