సమ్మెలు, నిరసనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అర్జెంటైనా

– మే 6న సమ్మెకు సిద్ధమైన రవాణా కార్మికులు
– ప్రభుత్వ పొదుపు చర్యలపై ఆగ్రహం
బ్యూనస్‌ ఎయిర్స్‌ : మే 6వ తేదీన ఆర్జెంటైనా రవాణా రంగ కార్మికులు సమ్మెకు దిగనున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు నిరసనగా అన్ని రవాణా కార్యకలాపాలు నిలిచిపోనున్నాయని యూనియన్‌ ఆఫ్‌ డాక్‌ అండ్‌ బేకాన్‌ వర్కర్స్‌ కార్యదర్శి జువాన్‌ కార్లోస్‌ షామిడ్‌ తెలిపారు. భూ జల, వాయు రవాణా మొత్తంగా ప్రభావితం కానుందని చెప్పారు. మితవాద అధ్యక్షుడు జేవియర్‌ మిలె అమలు చేస్తున్న తీవ్ర పొదుపు చర్యలు, విధానాలకు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ జనరల్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ లేబర్‌ (సిజిటి) రెండోసారి సార్వత్రిక సమ్మెకు పిలుపిచ్చింది. దానికి మూడు రోజులు ముందుగా రవాణా రంగ కార్మిక లోకం సమ్మెకు సిద్దమైంది. దీనికి తోడు, మిలె అనుసరిస్తున్న ఆదాయపన్ను, కార్మిక సంస్కరణలను వ్యతిరేకిస్తూ యూనియన్‌ ఆఫ్‌ ఆయిల్‌ అండ్‌ సోయాబీన్‌ వర్కర్స్‌ ఆధ్వర్యంలో శాన్‌ లారెంజోలో కార్మికులు సోమవారం నుండి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. దీనివల్ల 80శాతం చమురు మిల్లుల కార్యకలాపాలు దెబ్బ తింటాయని యూనియన్‌ తెలిపింది. ఫుడ్‌ శానిటరీ క్వాలిటీ వర్కర్లు కూడా దేశవ్యాప్తంగా సోమవారం సమ్మెకు దిగినట్లు ప్రకటించారు. దీనివల్ల గోధమపిండి, సోయాబీన్‌ చమురు ఎగుమతులు ప్రభావితమవుతాయి. ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఆర్థిక నిబంధనలతో ప్రతి ఒక్క కార్మికుని వార్షిక స్థూల వేతనం ఏకంగా 2వేల అమెరికన్‌ డాలర్ల మేరకు ప్రభావితం కానుంది. దీంతో ఈ నిబంధనలపై కార్మిక లోకం నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

Spread the love