మాతృమూర్తులందరూ ‘యోధ’లే

All matrimurtis are 'yodhas'The house remains dark till the mother wakes up – Khalil Gibran….
ఖలీల్‌ జిబ్రాన్‌ చెప్పిన ఈ మాట మన జీవితాల్లో ప్రతి సందర్భంలో వర్తిస్తుంది. చీకటి ఆవరించిన ఇంటిలోకి అమ్మ వెలుగు తెస్తుంది. ఆ ఇంటిలో కకలావికలమైన కుటుంబాన్ని ఒక దగ్గరకు చేరుస్తుంది. ఆ కుటుంబాలన్నీ తల్లులు చేస్తున్న అనేకానేక త్యాగాల వల్లనే నిలబడి వున్నాయి. అమ్మల మెలకువ, తెలివిడి వలనే ఆ కుటుంబాలు మనగలుగుతున్నాయి. ఇంటా బయటా కుటుంబాల మనుగడ కోసం అమ్మలు చేసే పోరాటం యుద్దంతో పోల్చదగిందే. ఇది అమ్మలు తమ ఆత్మగౌరవాన్ని, తమ కుటుంబాల్ని, సమాజంలో తమ స్థానాన్ని నిలుపుకోవడానికి సర్వశక్తులు ఒడ్డి చేసే యుద్దం. ఈ యుద్దంలో ముందుగా ఎదురయే శత్రువులు చాలావరకు స్వార్థసమాజానికి ప్రతిబింబమయిన తన అయినవాళ్ళే. అమ్మలకు సొంత ఇష్టాఅయిష్టాలుండవు. సొంత నిర్ణయాలు వుండవు. అసలు తనకంటూ సొంత జీవితమూ, ఆ జీవితంలో తమదైన సమయమూ వుండదు. అంతా కుటుంబం, పిల్లలని చూసుకోవడం అనే సాదాఖర్చులో కొట్టుకుపోతుంది.
బాధ్యతలే కాకుండా స్త్రీల హక్కుల గురించి పట్టించుకోవడం గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. అప్పుడే స్త్రీవాదం తెలుగు సాహిత్యంలోకి అనేక ప్రశ్నలు, సవాళ్ళతో దూసుకొచ్చింది. అందులో స్త్రీల మాతత్వం అంశం కూడా ఒకటి. ఒక స్త్రీ తాను మాతమూర్తి కావాలా వద్దా అనే విషయం సమాజమూ, ఇంట్లో వాళ్ళు, భర్త కాకుండా తానే స్వయంగా నిర్ణయం తీసుకోవడం సముచితం అని ఆలోచనాపరులు భావిస్తున్నారు. దీని కోసం ముందు మాతత్వం చుట్టూ ఏర్పరిచిన భావజాలాన్ని బద్దలు కొట్టాల్సి వుంది.
ఈ విషయమే మాట్లాడుతూ ప్రముఖ రచయిత్రి ఓల్గా గారు ఈ పుస్తకం ముందుమాటలో ” 1.వ్యక్తులుగా స్త్రీల మీద పురుషులు విధించే కంట్రోలుకి ఆధారాలు మతంలో, రాజ్యంలో వుంటాయి. వీటిని నిర్దేశించేది పితస్వామ్యం. 2. పితస్వామ్య నిర్మాణం జరిగే క్రమంలో మాతత్వమనే భావజాల నిర్మాణాన్ని ప్రారంభించారు. స్త్రీలను లొంగదీసుకోవడానికి ఇది అత్యున్నతమైన, మిరుమిట్లు గొలిపే పదునైన ఆయుధమైంది. 3. సమాజ ఆర్థిక నిర్మాణాలలో ఎన్ని మార్పులు వచ్చినా, ఉత్పత్తి సంబంధాలలో ఎన్ని మార్పులు వచ్చినా, పునరుత్పత్తిలోని సాంఘిక సంబంధాలలో మార్పు రాదు. ఆ సాంఘిక సంబంధాల చక్రాన్ని తిప్పే ఇరుసు మాతత్వ భావజాలం. 4. ఇవన్నీ జరగాలంటే ఈ విషయం (మాతత్వం) గురించిన మిత్‌ (అభూత కల్పన, మాయ)లను ఛేదించాలి.
ఈ ప్రతిపాదనలు అర్థం చేసుకుంటే తప్ప, ఆచరిస్తే తప్ప, ఈ మాతత్వ భావనల, కనపడని హింసల నుండి స్త్రీ విముక్తం కాదు. ఆ మేరకు స్త్రీలను చైతన్యపరుస్తూ రాసిన 53 కథల సమహారమీ ‘యోథ’ పుస్తకం. ఓల్గా గారి సూత్రీకరణల ఆధారంగా చూసినప్పుడు ఈ కథలు మరింతగా అర్థం అయేందుకు అవకాశం వుంది.
ఎండపల్లి భారతి కథ ‘తల పండిన గొడ్రాలు’ నేరుగా స్త్రీల మాతత్వం గురించి సమాజంలో చలామణీలో వున్న విలువల గురించి మాట్లాడుతుంది. కలిగిన కుటుంబాలలో కన్నా దిగువతరగతి వాళ్ళలో పిల్లలు లేని వాళ్ళను గొడ్రాలుగా ముద్రవేసి కించపరుస్తూ వుండడం చాలా ఎక్కువ. కనకవ్వదీ ఇక్కడ అదే పరిస్థితి. వాడకట్టు అంతా గొడ్డిదని ఈసడిస్తూ వుంటారు. ఏ రంపులోనయినా ఈ మాటతో కనకవ్వని గుచ్చిగుచ్చి పొడుస్తూ వుంటారు. కనకవ్వ గర్భం దాల్చకపోవడానికి మేల్నరుసు (పెద్ద డాక్టరమ్మ) కారణం చెప్పినా నాటువైద్యానికి మొగ్గు చూపే నిరక్షరాస్యులైన జనం, సరైన వైద్యం చేయించుకోవడానికి సిద్దపడరు. ఆమె వాడే భాష కూడా ఆమె కథలకు ఒక విధమైన శైలీగత సొబగును అద్దుతుంది. సామెతలు, నుడికారం, యాస ఆమె కతల్లో సునాయాసంగా దొర్లిపోతుంటాయి.
మాతత్వం అంటే పిల్లని కనడమే కాదు..సరైన విధానంలో పెంచడం కూడా. పిల్ల పెంపకం అనివార్యంగా స్త్రీల మీద అనాయాసంగా తోసేసే పురుషాధిక్య వ్యవస్థ వేళ్ళూనుకొని వున్నప్పుడు, పిల్లలను పెంచాల్సిన బాధ్యత ఎలా ఆ స్త్రీల కుటుంబ సభ్యుల మీదకు మోపబడితుందో సమ్మెట ఉమాదేవి గారి కథ చర్చిస్తుంది.
వి.శాంతి ప్రబోధ గారి కథ ‘గణేష్‌ అలియాస్‌ గౌరీ’ భిన్నమైన కథ. తనలో స్త్రీని కనుగొన్న గణేష్‌ గౌరిగా మారి, తను ఒక బిడ్డకు జన్మనివ్వాలని కోరుకోవడం, ట్రాన్స్‌ మహిళ శరీరస్వభావ రీత్యా అది సాధ్యం కాదని, ప్రాణాలకి ప్రమాదమని వైద్యులు తేల్చడంతో పురుషుడు (యువరాజు)గా మారిన యమున సహకారంతో గౌరి ఎలా తన కోరిక తీర్చుకోగలిగిందనేది కథ. ట్రాన్స్‌ జెండర్‌ గా మారడమే మనకు ఒక వండర్‌ అయితే మాతత్వ స్పర్శను అనుభవించాలనుకోవడం మరొక వండర్‌. వారు తమకిష్టమైన జీవితాన్ని జీవించడానికి చూపించే తెగువ మనకు అర్థం కావాలంటే we must stand on their shoes. ఈ కథలోని multidimensions మనల్ని ఆలోచనకు, ఆశ్చర్యానికి గురి చేస్తాయి.LGBTQ సమూహాల గురించిన లోతైన అవగాహన వుంటే తప్ప ఇటువంటి కథలు రావు.
వి.ప్రతిమ గారి ‘ నిగూఢ’ కథ మహిళల్లో ఆధునిక పద్దతుల ద్వారా గర్భం ధరించడం గురించి చెబుతుంది. సరోగసీ,IVF విధానాల ద్వారా కత్రిమ గర్భధారణ ధరించి సంతానం పొందే విధానం అన్నమాట. పిల్లలు లేరనే వ్యధను, ఇరుగుపొరుగు వెక్కిరింపులు ఇప్పుడు మహిళలు పడనవసరం లేదు. శారద కోడలు పవిత్రకు పిల్లలు లేకపోతే శారద స్నేహితురాలు డాక్టర్‌ జయప్రద IVF పద్దతి ద్వారా పవిత్రకు గర్భం వచ్చేలా చేసి, కుటుంబంలో సంతోషం నింపుతుంది. చాలాకాలం తర్వాత ఇండియా వచ్చిన జయప్రద శారదను కలిసి రెండు రోజులు కలిసి వుంటుంది. అంతకాలం తను మోస్తున్న ఒక చిన్న గిల్ట్‌ను శారదకు చెప్పేస్తుంది. ఆ నిగూఢ రహస్యం ఏమిటో కథ చదివి తెలుసుకోవాల్సిందే.
కల్పనా రెంటాల గారి కథ ‘నో రిగ్రెట్స్‌’ పిల్లలు వద్దనుకునే శ్రీజ, అనీష్‌ జంట నిర్ణయం మింగుడు పడని కుటుంబ సభ్యుల తీవ్ర ఒత్తిడుల మధ్య వారిని సమాధానపరచలేక ‘Motherhood is not my cup of Tea’ అని తెగేసి అంటుంది శ్రీజ. పిల్లల్న కన్నంత మాత్రాన తల్లి కాలేమని చర్చ చేస్తుంది. Child free గా వుండదలుచుకోవడం వెనుక పిల్ల పెంపకం ఒక పెద్ద సామాజిక బాధ్యత అనే విషయం undercurrentగా చెపుతుందీ కథ.
‘మార్పు అనివార్యం’ కథలో భండారు విజయ గారు చర్చించిన సమస్య మన సమాజంలో ఎప్పటి నుంచో వున్నా, ఆధునిక సమాజం ఇచ్చిన ఆధునిక ఆలోచన ధోరణి వల్ల ప్రతి సమస్యను సహానుభూతితో చూసే ఒక పద్దతి అలవడింది. సభ్యసమాజం ఏకపక్షంగా తిరస్కరించే అనేక వ్యవస్థీకత సమస్యలను కూడా నేడు పరిష్కారం దిశగా ఆలోచిస్తున్నారు. ఈ కథలో విజయ గారు హార్మోన్స్‌ ఇన్‌బ్యాలెన్స్‌ వల్ల యువతీయువకుల శరీరాల్లోనూ, తదనుగుణంగా వారిలో మానసికంగా వచ్చే మార్పుల వల్ల ఉత్పన్నమయే సమస్యలను చర్చించారు. కొడుకు మధు ప్రవర్తనలో తేడా కనిపెట్టిన వరుణ కొడుకు ‘గే’ అని తెలుసుకొని, బాధపడి ఆ సమస్యకు పరిష్కారం కోసం స్నేహితులను సంప్రదిస్తుంది. డాక్టర్స్‌ సలహా కూడా తీసుకుంటుంది. కానీ పరిష్కారం దొరకదు. క్లాస్‌మేట్‌ లలిత అక్క మాలతిని కలుస్తారు. మాలతి కొడుకు ఆనంద్‌ తల్లి సాయంతో జెండర్‌ ఆపరేషన్‌ చేసుకొని తనకిష్టమైన అనామికగా మారి, ఒక స్వచ్ఛంద సంస్థలోLGBTQ సమూహం కోసం పని చేస్తూ వుంటుంది. కొడుకు పట్ల ఎంతగానో ఆందోళన చెందుతూ వున్న వరుణను ఉద్దేశించి అనామిక చెప్పిన మాటలు ఈ సమాజమూ, ముఖ్యంగా ఇటువంటి హార్మోన్స్‌ ఇన్‌బ్యాలెన్స్‌ వల్ల వచ్చే జెండర్‌ సెన్సివిటీ సమస్యలు ఎదుర్కొనే తలిదండ్రులు తప్పక చదవాల్సినవి.
డా.దుట్టా శమంతకమణి కథ ‘మదుమధురం’ పిల్లల పెంపకం బాధ్యత తండ్రి తీసుకోవడం గురించి మాట్లాడింది. నిజంగానే పిల్లలను పెంచాలనుకుంటే మగవారు ఆ పని భేషుగ్గా చేయవచ్చు. కానీ, లోకరీతి ప్రకారం భారం తల్లి తీసుకుంటుంది కాబట్టి ఊరకుండిపోతారు. కానీ, కొన్ని చోట్ల అరుదుగానైనా భిన్నంగా జరగడానికి ఆస్కారం వుంటుంది కదా! ఈ కథలో అదే జరిగింది. మధు తనని విడిచి వెళ్ళిన భార్య నుండి పిల్లలను తెచ్చుకొని సక్రమంగా, బాధ్యతగా పెంచాడు. మధు స్నేహితురాలు మదుల కూడా ఇటువంటి పరిస్థితులలోనే పిల్లలను పెంచుతుంది. వీరిద్దరికీ ఎటువంటి ప్రేమభావనలు లేనప్పటికీ రచయిత్రి ఈ కథకు మదుమధురం అని ప్రధాన పాత్రల పేర్లు పెట్టడం, వీరి నైతిన ప్రవర్తన పట్ల కలిగిన ఏకీభావం వలన కావొచ్చు. అవసరమైనప్పుడు పిల్లల పెంపకం బాధ్యత తండ్రి తీసుకోవడం జరగాలనేది కథ సారాంశం.
మాతత్వం – భిన్న ధోరణలు అన్నట్టు గానే కథలన్నీ మాతత్వం చుట్టూ, మాతత్వం చుట్టూ అల్లుకున్న మాయ చుట్టూ, పునరుత్పత్తి రాజకీయం చుట్టూ, అనేక పొరలుగా అల్లుకున్న మాతత్వ అనుబంధాల చుట్టూ తిరిగాయి. అనేక ఆశ్చర్యకరమైన కోణాల నుంచి విలువైన చర్చ చేసాయి. కొన్ని సమస్యలకు కొన్ని పరిష్కారాలు ఇచ్చాయి. అయితే ఇన్ని కథల్లో కొన్ని కథలు మాత్రం మాతత్వం అనే వస్తువు కాకుండా కడుపుతీపి, బంధం, అమ్మ ప్రేమ వంటి ఇతర అంశాల చుట్టూ తిరిగాయి. కొన్ని కథలు అతి సాధారణ స్థాయిలో వున్నాయి.
‘యోథ’ కథల సంపాదకురాలు భండారు విజయ గారు ” ‘మాతత్వ’ భావన చాటున స్త్రీలకు ఎదురైన మానసిక, శారీరక సంఘర్షణలను, హింసలను, సామాజిక సవాళ్ళను ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని, ధైర్యంగా నిలబడిన ‘ యోధ’ల జీవిత చిత్రణలే ఈ కథలు ” అన్నారు. కాబట్టి మనం ఈ కథలను ఈ వాక్యాల వెలుగులో చదవాల్సిన, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.
‘ఒక ఆడది పిల్లలు కనే విషయంలో ప్రశ్నించడమా’ అని బుగ్గలు నొక్కుకునే సభ్య సమాజానికి కూడా మాతత్వమనే మాయ వెనుక ఇన్ని రాజకీయాలు, ఇంత అణచివేత, ఇంత హింస, ఇంత వేదన, ఇంత త్యాగం వుంటాయని, ఆ కోణాలని, ఆ భిన్న వ్యక్తీకరణలను విప్పి చూపించి, అర్థం చేయించే ప్రయత్నం చేస్తాయీ కథలు. కొంత ఆలోచనా ధోరణిని మార్చే ప్రయత్నం కూడా చేస్తాయి. ఆ మేరకు హస్మిత ప్రచురణల సంపాదకుల ప్రయత్నం సఫలీకతం.
పి.శ్రీనివాస్‌ గౌడ్‌
99494 29449

Spread the love