మూడు నెల‌ల ముందే హెచ్చ‌రించినా..!

నవతెలంగాణ-హైదరాబాద్ : ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో జరిగిన రైలు ప్ర‌మాద ఘ‌ట‌న రైల్వే భ‌ద్ర‌తా వ్య‌వ‌స్ధ‌లోని లోపాల‌ను తేట‌తెల్లం చేస్తోంది. పెను ప్ర‌మాదానికి ఎల‌క్ట్రానిక్ ఇంట‌ర్‌లాకింగ్‌లో మార్పులే కార‌ణ‌మ‌ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ చెబుతుండ‌గా సిగ్న‌లింగ్‌ వ్య‌వ‌స్ధ‌లో లోపాల‌పై స‌ర్వ‌త్రా ఆందోళ‌న నెల‌కొంది. 300 మందిని బ‌లిగొన్న ఈ దుర్ఘ‌ట‌న నేప‌ధ్యంలో రైల్వే భ‌ద్ర‌తా వ్య‌వ‌స్ధ‌పై ప‌లు ప్ర‌శ్న‌లు ముందుకొస్తున్నాయి. మూడు నెల‌ల కింద‌టే సిగ్న‌లింగ్ వ్య‌వ‌స్ధ‌లో తీవ్ర‌ లోపాల‌పై నైరుతి రైల్వే జోన్ చీఫ్ ఆప‌రేటింగ్ మేనేజ‌ర్ హెచ్చ‌రించారు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఇంట‌ర్ లాకింగ్ వ్య‌వ‌స్ధ వైఫ‌ల్యంపై ఆందోళ‌న వ్య‌క్తం చేసిన సీఓఎం క‌ఠిన భ‌ద్ర‌తా చ‌ర్య‌లు అవ‌స‌ర‌మ‌ని నొక్కిచెప్పారు. ఎక్స్‌ప్రెస్ ట్రైన్ సిగ్న‌ల్ ఫెయిల్యూర్‌పై ఆయ‌న క‌ల‌త చెందుతూ లోకో పైల‌ట్ అప్ర‌మ‌త్త‌తో పెను ప్ర‌మాదం త‌ప్పిన విష‌యాన్ని ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. యూపీలో ఫిబ్ర‌వ‌రి 8న ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని పూర్తి వివ‌రాల‌ను లేఖ‌లో ప్ర‌స్తావించారు. సిగ్న‌లింగ్ వ్య‌వ‌స్ధ‌లో తీవ్ర లోపాలున్నాయ‌ని, భ‌ద్ర‌తా వ్య‌వ‌స్ధ‌ను ప‌టిష్టం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఉన్న‌తాధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. సిగ్న‌ల్‌పై రైలు ప్రారంభ‌మైన త‌ర్వాత రూట్ మార్చ‌డం వంటి త‌ప్పిదాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న రాసుకొచ్చారు. సిగ్న‌లింగ్ వ్య‌వ‌స్ధ‌లో లోపాల‌ను స‌రిచేసేందుకు దోషుల‌పై చ‌ర్య‌ల‌తో పాటు అవ‌స‌ర‌మైన దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరారు. విచార‌ణ చేపట్టి, అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకున్న అనంత‌రం ఈ విష‌యాన్ని సంబంధిత స్టేష‌న్ మాస్ట‌ర్లు, టీఐలు, ట్రాఫిక్ ఆఫీస‌ర్ల‌కు తెలియ‌చేయాల‌ని లేఖ‌లో ఆయ‌న సూచించారు.

Spread the love