ఆరోగ్య శాఖ మంత్రిపై కాల్పులు

నవతెలంగాణ – భువనేశ్వర్
ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నాబా కిషోర్ దాస్‌పై కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఆయన గాయపడటంతో హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. జర్సుగూడ జిల్లాలోని బ్రజరాజ్‌నగర్ సమీపంలో ఆదివారంనాడు ఈ కాల్పుల ఘటన జరిగింది. గాంధీ చౌక్‌లో జరుగనున్న ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన వెళ్తున్నారు. వాహనం నుంచి బయటకు వచ్చేందుకు ఆయన కారును ఆపినప్పుడు కాల్పుల ఘటన జరిగిందని చెబుతున్నారు.
కాగా, నాబా దాస్‌పై ఒక అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ కాల్పులు జరిపినట్టు ప్రాథమిక సమాచారం. రెండుసార్లు అతను కాల్పులు జరిపాడని, మంత్రి ఛాతీపై బుల్లెట్ గాయాలయ్యాయని తెలిసింది. ఏఎస్ఐ గోపాల్ దాస్ ఈ కాల్పులు జరిపినట్టు భ్రజ్‌రాజ్‌నగర్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి గుప్తేశ్వర్ భోయ్ మీడియాకు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మంత్రిని ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, మంత్రి తన కారు నుంచి బయటకు వస్తుండగా ఏఎస్ఐ కాల్పులు జరిపాడు. కాల్పుల్లో గాయపడిన మంత్రిని కారులో ఆసుపత్రికి తరలిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వెలుగుచూసింది. కాగా, ఏ కారణంతో మంత్రిపై ఏఎస్ఐ కాల్పులు జరిపాడనేది తెలియాల్సి ఉంది.

Spread the love