అంబేద్కర్ పుట్టిన గడ్డ ఒకనాటి సెంట్రల్ ప్రావిన్సెస్‌లో సైనిక స్థావరమైన (ఇప్పటి మధ్యప్రదేశ్ రాష్ట్రం) మౌ పట్టణానికి ప్రధాని మోడీ వెళ్ళారు. అంబేద్కర్ సమాధి వద్ద మోకరిల్లి ‘ఓ అంబేద్కర్ దేవుడా మీరు లేకుంటే నేను దేశానికి ప్రధాని అయ్యేవాడిని కాదని’ అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత భారత రాజ్యాంగాన్ని గుండెకు హత్తుకుని ‘మేము రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేశాయి. కానీ మేమే అసలైన రాజ్యాంగ రక్షకులమని’ సెలవిచ్చారు. రాజ్యాంగ రక్షకులు అయితే దాని మౌలిక లక్ష్యాలైన ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సమాఖ్య స్ఫూర్తి, సామాజిక న్యాయం వంటి వాటి మూలలను ఎందుకు దెబ్బతీస్తున్నారు? పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తన ఆరెస్సెస్ గొంతు ద్వారా అంబేద్కర్‌ను కించపరిచాడు. అంబేద్కర్ బతికున్నకాలంలో నేనుంటే ఆయన్ను తుపాకీతో కాల్చి చంపేవాడినని ఆరెస్సెస్ కార్యకర్త హమారా ప్రసాద్ అన్నారు. కర్నాటక మంత్రి అనంతరావు హెగ్డే మాకు 400సీట్లు ఇస్తే భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తామన్నాడు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ రాజ్యాంగాన్ని మార్చే హక్కు మాకుంది. భాజప్తా మార్చేస్తాం. అందులో ఉన్న సెక్యులర్, సోషలిస్టు వంటి పదాలను తొలగిస్తాం’ అన్నాడు. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత కాదు, ఆయనొక్కడే రాయలేదని పలుమార్లు అవమానిస్తూ ఆరెస్సెస్, బీజేపీ నేతలు మాట్లాడారు. ఈ వ్యాఖ్యలన్ని వాళ్లు వ్యక్తులుగా చేసినవి కావు వారి ఆరెస్సెస్-బీజేపీ మూల సిద్ధాంతం మనుస్మృతి గొంతు నుండి వచ్చినవే.
1925లో ఏర్పడిన ఆరెస్సెస్ అంబేద్కర్ పట్ల భారత రాజ్యాంగం పట్ల స్పష్టమైన వైఖరి కలిగి ఉన్నది.అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇది ఒక అతుకులబొంత లాంటిది. ఇది బ్రిటన్ అమెరికా ఇంగ్లాండ్ నుండి అరువు తెచ్చుకున్నది.వేల ఏండ్ల కిందటే మన హైందవ ధర్మము, దేశాన్ని నడిపించే చాతుర్వర్ణ మనుస్మృతి ధర్మమే మన ప్రాచీన భారత రాజ్యాంగం అని ప్రకటించింది.అంబేద్కర్ కీర్తి ప్రతిష్టలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అమెరికా కొలంబియా విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం ఎదుట 300 అడుగుల స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని నెల కొల్పారు. ఐక్యరాజ్యసమితి అంబేద్కర్ 125వ జయంతిని అంతర్జాతీయ విజ్ఞాన దినోత్సవంగా ప్రకటించింది. రష్యా అధ్యక్షులు పుతిన్ తన ఛాబర్ వెనక అంబేద్కర్ చిత్రపటం పెట్టుకున్నాడు. ప్రపంచమంతటా ఆయన ప్రతిష్ట పెరుగుతుంటే మన దేశంలో మాత్రం అంబేద్కర్ విగ్రహాలకు నిప్పుపెట్టే నీచత్వాలు, కాళ్లు చేతులు తీసేసే దుర్మార్గాల్ని పాలకలు పెంచి పోషిస్తున్నారు! అంబేద్కర్ మనదేశంలో అంటరాని కులంలో పుట్టడమే నేరమా? ఆయనకు దేశ పాలకులు ఇచ్చే గౌరవం ఇదేనా? ఈ సందర్భంగానైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అంటే రాజ్యాంగం రాశాడు, రిజర్వేషన్లు ఇచ్చాడు అనే పరిమిత అవగాహనతో మాత్రమే ఆయన్ను చూస్తు న్నారు. కానీ, అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం, రాష్ట్రాలు- మైనార్టీలు, కులనిర్మూలన వంటి గ్రంథాలు అధ్యయనం చేస్తే భారత భవిష్యత్తు కోసం ఆయన కన్న కలలు ఏమిటో అవగతమవుతుంది. ఓ వైపు సంఫ్‌ు పరివార్ అంబేద్కర్‌ను అవమానిస్తుంటే ఆయన లక్ష్యాలను తుంగలో తొక్కుతుంటే, మరోవైపు అంబేద్కర్ ఆశయాలు సాధిస్తామనే వాళ్తు అంతకన్నా ఎక్కువే ఉద్భవిస్తున్నారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి దండేసి దండాలు పెట్టి ‘జై భీం’ అని గట్టిగా నినదించి ఆ తర్వాత ఆయన్ను విస్మరిస్తున్నారు. అంబేద్కర్ ఆశయ వ్యతిరేకులు కూడా ఆ ఒక్కరోజు ఆయన్ను కొనియాడుతున్నారు. ఓవైపు మనువాద ఆధిపత్య శక్తులు అంబేద్కర్‌ను అంటరానివానిగా చూస్తే మరోవైపు దళితుల్లోని మెజార్టీగా ఉన్నవాళ్లు అంబేద్కర్ తమ కులం వాడిగా, ఇంకా దిగజార్చబడి ఉపకులం వాడిగా మార్చేస్తున్నారు. అంబేద్కర్ ఈ దేశం కోసం కన్నకలలు, చేసిన కృషిని పట్టించుకోవట్లేదు. ఆయన్ను అందరివాడిగా చూడటానికి అంగీకరించట్లేదు. కులం ఆధారంగానే చూస్తూ అవమానిస్తున్నారు.
ఆరెస్సెస్ డీఎన్‌ఏతో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుల మత విద్వేషాలు పతాక స్థాయికి చేరాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారం మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో 2326మంది, 2016లో 2541 మంది, 2017లో 2714 మంది ,2018లో 2936 మంది దళిత మహిళలు లైంగికదాడులకు గురయ్యారు. ఒక్క 2024లోనే 50893 ఘటనలు జరిగాయి. ఏడాదికి వెయ్యి చొప్పున హత్యలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టడానికి తీసుకొచ్చిన ఎసీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నీరుగార్చబడుతున్నది.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భూమి జాతీయకరణ జరగాలని, పరిశ్రమల్లో కార్మికులకు యాజమాన్య వాటా ఉండాలని, కార్మికులకు కనీస వేతన చట్టం అమలుకావాలని 1948లోనే చెప్పారు. మహిళ స్త్రీ పురుష సమానత్వం కోరుతూ హిందూ కోడ్ బిల్లు తెచ్చారు. ఆ బిల్లు పార్లమెంటులో ఆనాటి కాంగ్రెస్ అంగీకరించకపోతే కేంద్ర కేబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేస బయటకొచ్చారు. ‘కులం పునా దుల మీద ఒక జాతిని, ఒక నీతిని నిర్మించలేం. ముందు కులం పునాదులను కూకటి వేళ్లతో పెకిలించాలి’ అన్నారు అంబేద్కర్. కులం పునాదులు హిందూ మతం లో, భూస్వా మ్య వ్యవస్థలో ఉన్నాయని ఆనాడే చెప్పారు. భారతదేశ ప్రజలకు బ్రాహ్మణిజం, క్యాపిటలిజం శత్రువు లుగా ఉంటాయని అప్పుడే ఉపదేశించారు.ఆయన రాసిన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 నుండి 19వరకు కుల, మత, భాష, లింగ భేదం లేకుండా పౌరులందరికి సమాన హక్కులుం డాలని కోరారు. ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛను, ఆర్టికల్ 21 తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతకాలని , ఆర్టికల్ 25 నుండి 28 వరకు వ్యక్తిగత మత స్వేచ్ఛను రూపొందించారు. మతాన్ని, దేవుడిని రాజకీయాల్లోకి, పరిపాలనలోకి తేవడం దేశ సమైక్యతను దెబ్బతీస్తుందని నాడే హెచ్చరించారు. కానీ దేశాన్ని ఏలుతున్న బీజేపీ సరిగ్గా మతోన్మాద రాజకీయాలతో దేశభవిష్యత్తును నాశనం చేస్తున్నది.
అంబేద్కర్ ఆశయవిరోధిగా ఉన్న ఆరెస్సెస్-బీజేపీ భావ ప్రకటన స్వేచ్ఛను హత్య చేస్తున్నది. నరేంద్ర ధబోల్కర్, గోవింద్ ఫన్సారే, కల్బుర్గి, గౌరీ లంకేష్ వంటి మేధావులను పొట్టన పెట్టుకుంది. కార్మికుల కనీస వేతన చట్టాన్ని అమలు చేయకపోగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎనిమిది గంటల పనిని పన్నెండు గంటలకు పెంచింది. మహిళా సమానత్వం కోసం అంబేద్కర్ కృషి చేస్తే, నేటి బీజేపీ పాలన మహిళలపై క్రూరమైన హింసను పెంచి పోషిస్తున్నది. లైంగికదాడులు, హత్యలు, గ్యాంగ్ రేపులు, లైంగిక హింస ఈ కాలంలో 250 రేట్లు పెరిగినట్టు అనేక సర్వేలు వెల్లడించాయి. మైనార్టీలను టార్గెట్ చేసుకొని దౌర్జన్యాలు చేస్తూ వారిలో అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నది. అందులో భాగమే వక్ఫ్ బిల్లు సవరణను తీసుకొచ్చి ఆమోదించింది. ఇది రాజ్యాంగ విరుద్ధ చర్య. వ్యక్తిగత మత స్వేచ్ఛను వ్యవస్థపై రుద్ది విద్వేషాలు, దాడులు పెంచి పోషిస్తున్నది. 77 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా కులవివక్ష అంటరానితనం కొనసాగడం దేశ మూఢత్వచాందస భావాల పుణ్యమే. ఆ భావాల్ని ప్రజలు తిప్పికొట్టాలి.అంబేద్కర్ ఆశయాలు సాధించా లనుకునే అభ్యుదయ ప్రగతిశీల అంబేద్కర్, పూలే భావజాలం కలిగినవారు, కమ్యూనిస్టులు ఐక్యంగా నేటి సరళీకరణ విధానాల దుష్ఫలితాలపై పోరాడాలి. పొంచి ఉన్న మతోన్మాద విధానాలపై ప్రజల్ని చైతన్య పరచాలి.భారత రాజ్యాంగాన్ని ప్రభుత్వ రంగ సంస్థలను, రిజర్వేషన్లను, కార్మిక చట్టాలను రక్షించుకోవడానికి ఐక్యమవ్వాలి. అంబేద్కర్ ఆశించిన కుల రహిత సమాజాన్ని నేటితరం సాధించడానికి సమరశంఖం పూరించాలి. అదే అంబేద్కర్ మనమిచ్చే నిజమైన నివాళి.
(ఏప్రిల్ 14 బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి)
టి. స్కైలాబ్ బాబు, 9177549646