
మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో సోమవారం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పంచాశీలా జెండాను ఆవిష్కరించారు. మండలంలోని ఉప్లూర్ లో నిర్వహించిన జయంతి వేడుకల్లో మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు, న్యాయవాది సుంకరి విజయ్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం ఒక్క కులానికో, మతానికో, జాతికో, ప్రాంతానికో మాత్రమే అంకితం కాదన్నారు. ఆయన ఒక గొప్ప సామాజిక శాస్త్రవేత్త, ప్రపంచంలో మరెవరూ చదవలేనన్ని డిగ్రీలను అందుకున్న ప్రపంచ మేధావి అన్నారు.భారత రాజ్యాంగ నిర్మాత, అన్నిటికంటే ముఖ్యంగా ఒక మానవతావాది, స్వేచ్చ, సమానత్వ స్థాపన కోసం జీవితాంతం పోరాడిన గొప్ప సామాజిక విప్లవకారుడని తెలిపారు. ప్రపంచమే అతని పుట్టినరోజును జ్ఞానం పుట్టినరోజుగా, ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా అభివర్ణించింది అంటే అర్థం చేసుకోవచ్చన్నారు. అటువంటి మహనీయుడు మన భారత భూమిపై పుట్టినందుకు భారతీయులందరం గర్వపడాల్సిన విషయమని పేర్కొన్నారు.ఆయన భారత భూమిపై నడయాడిన ఒక గ్రేటెస్ట్ ఇండియన్ అని తెలిపారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, ఆయా పార్టీల నాయకులు, గ్రామ యువకులు, తదితరులు పాల్గొన్నారు.