– 18వ శతాబ్దం నాటి చట్ట పునరుద్ధరణకు యత్నాలు
– వెనిజులా ప్రజల నిరసన
కారకాస్ : అమెరికా అధ్యక్షుడుగా రెండోసారి ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి చట్టబద్ధమైన పత్రాలు లేకుండా నివసిస్తున్న వారి పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారతీయుల చేతులకు కాళ్లకు సంకెళ్లు వేసి ఖైదీలు మాదిరిగా వారిని యుద్ధ విమానంలో స్వదేశానికి పంపారు. ఈ విధమైన చర్యనే వెనిజులన్లపై కూడా అమెరికా చేపట్టింది. సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న వెనిజులన్లను మెడలు వంచి సంకెళ్లు వేసి, మరీ స్వదేశానికి పంపారు. ట్రంప్ చర్యలపై వెనిజులా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 18వ శతాబ్దం నాటి ఎలియన్ ఎనిమీస్ (విదేశీ శత్రువుల చట్టం) చట్టాన్ని అమలుచేస్తూ వందలాదిమంది వెనిజులన్లకు చట్టపరమైన రక్షణ లేకుండా బహిష్కరిస్తోందని విమర్శించారు. ట్రంప్ చర్యలకు వ్యతిరేకంగా వెనిజులా ప్రజలు ఆందోళనకు దిగారు. శుక్రవారం కొవ్వొత్తుల ర్యాలీ చేశారు.
ఈ చర్యలను పౌర హక్కుల సంఘాలు కూడా విమర్శిస్తున్నాయి. ఎలియన్ ఎనిమీస్ యాక్ట్ 1798 (విదేశీ శత్రువుల చట్టం)ని పునరుద్ధరిం చాలని ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నాయి. ముందస్తు నోటిఫికేషన్ లేకుండా, న్యాయవాదుల సలహా తీసుకోకుండా వెనిజులన్లను బహిష్కరించడానికి ఈ చట్టాన్ని ఇలా అమలుచేయడం దారుణమని ఎసిఎల్‌యు (ది అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్)కు లెక్కలేనన్ని ఫిర్యాదులు అందాయి.