– 737 మ్యాక్స్ విమానాలపై నిషేధం
– భారత సంస్థలపైనా ప్రభావం..!
వాషింగ్టన్ : దిగ్గజ విమానాల తయారీ కంపెనీ బోయింగ్‌కు అమెరికా ఊహించని షాక్ ఇచ్చింది. ఆ కంపెనీ తయారు చేసే బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల తయారీ విస్తరణపై నిషేధం విధిస్తూ అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్ ఎఫ్‌ఎఎ) నిర్ణయం తీసుకుంది. ఈ విమానాలు పలు ప్రమాదాలకు గురి కావడంతో వేటు వేసింది. జనవరి ప్రారంభంలో అలష్కా ఎయిర్ లైన్స్‌కు చెందిన 737 మ్యాక్స్ విమానం టైర్ ఆకాశంలోనే పేలిపోయింది. ఈ విమానాన్ని పూర్తి స్థాయి తనిఖీలు చేసిన తర్వాతే సర్వీస్‌లను తిరిగి ప్రారంభించిన్పటికీ తాజాగా తయారీ, విస్తరణపై నిషేధం విధించడం బోయింగ్ సహా విమానయాన కంపెనీల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే అనేక 737 మ్యాక్స్ విమానాలను పలు కంపెనీలు కొనుగోలు చేసి ఉండటం.. ఆర్డర్లు కూడా ఇచ్చి ఉండటంతో ఇరు వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే అలస్కా ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లు 737 మ్యాక్స్ సేవలను రద్దు చేసుకున్నాయి. ఐదేళ్ల క్రితం నెలల వ్యవధిలోనే ఇండోనేషియా, ఇథియోపియాల్లో రెండు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు కూలి 346 మంది ప్రయాణికులు మరణించారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఏడాదిన్నర పాటు ఈ రకం విమానాలను పక్కనపెట్టారు. కాగా.. పరిశ్రమలో మ్యాక్స్ 737 విమానాలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి పెంచేందుకు అనుమతించాలని ఎఫ్‌ఎఎను బోయింగ్ కోరినప్పటికీ తిరస్కరించింది. 737 మ్యాక్స్ విమానాల్లో క్వాలిటీ కంట్రోల్ సమస్యలు పరిష్కారం అయ్యాయని తాము సంతృప్తి చెందే వరకు ఎలాంటి విజ్ఞప్తులను అంగీకరించమని ఎఫ్‌ఎఎ అడ్మినిస్ట్రేటర్ మైక్ వైటేకర్ తెలిపారు. నాణ్యతమపై బోయింగ్ యాజమాన్యం ఇచ్చే హామీలు ఆమోదయోగ్యంగా లేవన్నారు. ప్రస్తుతం నెలవారీగా ఇచ్చిన లక్ష్యం వరకు మాత్రం బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల తయారీకి మాత్రమే అనుమతిస్తామన్నారు. తయారీ పెంపుపై విధించిన ఆంక్షలు ఎంత కాలం అమల్లో ఉంటాయనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. భారత్ నుంచి మ్యాక్స్ 737 విమానాల కోసం ఎయిరిండియా 181 విమానాలను, ఆకాశ్‌ఎయిర్ 204, స్పైస్‌జెట్ 142 చొప్పున ఆర్డర్ల కోసం ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రస్తుత పరిణామంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.