ఎమెన్‌పై అమెరికా దాడి, గాజాలో తిరిగి మారణకాండ!

US attack on Yemen sparks another massacre in Gaza!సామ్రాజ్యవాదులకు ప్రత్యేకించి ప్రపంచాన్ని తన చంకలో పెట్టుకోవాలని చూస్తున్న అమెరికాకు నిత్యం ఎక్కడో ఒక చోట ఉద్రిక్తతలు లేదా యుద్ధం ఉండాల్సిందే. అప్పుడే అక్కడి మిలిటరీ పరిశ్రమలు పని చేస్తాయి, బిలియన్ల కొద్దీ లాభాలు సంపాదించి పెడతాయి. ఒక వైపు ఉక్రెయిన్‌లో పోరు నివారిస్తా, పుతిన్‌తో మాట్లాడతా అంటున్న ట్రంప్‌ మరోవైపు మధ్య ప్రాచ్యంలోని ఎమెన్‌పై శనివారం నుంచి వైమానిక దాడులకు తెరతీశాడు. దీనికి కారణమేమిటి ? ఈ సందర్భంగా తోడేలు – మేకపిల్లను కథను గుర్తుకు తెచ్చుకోవాలి. కాలువ నీటిని మురికి చేస్తూ నేను తాగేందుకు పనికి రాకుండా చేస్తున్నావంటూ మేకపిల్లతో తోడేలు దెబ్బలాటకు దిగింది. అదేమిటి నువ్వు ఎగున ఉన్నాను, నేను దిగువ ఉన్నాను, పైన నీళ్లు ఎలా మురికి అవుతాయని మేకపిల్ల ప్రశ్నించింది. నువ్వు గాకపోతే నీ అమ్మ మురికి చేసిందంటూ తోడేలు మేకపిల్ల మీద దాడి చేసి మింగేసింది. తాజా దాడులకు ట్రంప్‌ చెబుతున్న కారణం కూడా అదే మాదిరి ఉంది. ఎర్ర సముద్రంలో నౌకలపై జనవరి 19 తర్వాత ఎమెన్‌ ఎలాంటి దాడులు జరపలేదు కదా ఇప్పుడెందుకు దానిపై యుద్ధానికి దిగారని ప్రశ్నిస్తే గతంలో వారు చేసిన దాడులతో మాకు ఎంతో నష్టం జరిగింది, ప్రాణాలకు ముప్పు తలెత్తిందని ట్రంప్‌ చెబుతున్నాడు. నిజానికి దుష్టాలోచనతోనే అమెరికా తెగించింది. గాజాలో కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇజ్రాయిల్‌ మరోసారి అక్కడి పౌరులను హత్య చేసేందుకు పూనుకుంది. సోమవారం రాత్రి నుంచి ఆకస్మి కంగా వైమానిక దాడులు జరిపి వందలాది మంది ప్రాణాలు తీసింది. ఎలాంటి ముందస్తు ప్రకటనలూ చేయలేదు. మానవతా పూర్వక సాయం చేస్తున్న ప్రాంతాలను కూడా వదల్లేదు. ఇదే సమయంలో దానికి మద్దతుగా ఎమెన్‌పై అమెరికా దాడులు ప్రారంభించింది.ఈ రెండింటిని వేర్వేరుగా చూడలేము.
ఉద్రిక్తతలను సడలించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అగ్రరాజ్యం అమెరికా మధ్య ప్రాచ్యంలో మరోసారి అగ్నికి ఆజ్యం పోసింది. శనివారం నుంచి ఎర్ర సముద్ర తీరంలోని ఎమెన్‌పై వైమానిక దాడులకు పూనుకుంది. రాజధాని సనా నగరంతో సహా ముప్పై ప్రాంతాల మీద దాడులు జరుగుతున్నట్లు పెంటగన్‌ వర్గాలు పేర్కొన్నాయి. దానికి ప్రతిగా ఆ ప్రాంతంలో తిష్టవేసిన అమెరికా విమానవాహక యుద్ధనౌక, ఇతర మిలిటరీ నౌకలపై హౌతీ సాయుధులు దాడులు చేస్తున్నారు. అమెరికా దాడులకు తక్షణ కారణంగా చెబుతున్న సాకును చూస్తే దుష్టాలోచన కడుపులో పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. గాజాపై ఇజ్రాయిల్‌ జరుపుతున్న మారణకాండకు విరామంగా శాంతి ఒప్పందం కుదిరింది. దాన్ని అడుగడుగునా ఉల్లంఘిస్తున్న ఇజ్రాయిల్‌ను పల్లెత్తు మాట అనని ట్రంప్‌ ఎమెన్‌పై దాడులకు ఆదేశించాడు. పదిరోజులుగా గాజాలోని పాలస్తీనియన్లకు బయటి నుంచి వస్తున్న సాయాన్ని అందనీయకుండా ఇజ్రాయిల్‌ అడ్డుకుంటున్నది. అలాగే కొనసాగితే తాము అటువైపు వెళ్లే నౌకలపై దాడులకు దిగుతామని హౌతీలు ప్రకటించారు తప్ప కొత్తగా ఎలాంటి దాడి చేయలేదు.ఈ ప్రకటనను సాకుగా తీసుకొని తమ నౌకలకు ముప్పు తలెత్తిందని, స్వేచ్చగా నౌకాయానం జరగాలంటూ దాడులు జరుపుతున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ దాడుల్లో కొంత మంది నేతలను చంపివేసినట్లు అధ్యక్ష భవనం ఒక ప్రకటన చేసింది. మొత్తం యాభైమూడు మంది మరణించారు.
గాజా ప్రాంతంపై దాడులకు తెగబడి 2023 అక్టోబరులో మారణకాండకు పాల్పడిన ఇజ్రాయిల్‌ చర్యలను ఖండిస్తూ అప్పటి నుంచి ఇటీవలి శాంతి ఒప్పందం వరకు 136 యుద్ధ, వాణిజ్య నౌకలు ప్రత్యేకించి ఇజ్రాయెల్‌ వైపు ప్రయాణించేవాటిమీద హౌతీలు దాడులు జరిపారు.క్షిపణులు, డ్రోన్లతో జరిపిన దాడుల్లో రెండు నౌకలు మునిగిపోగా నలుగురు నావికులు మరణించారు. శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చిన జనవరి 19 నుంచి ఎలాంటి దాడుల్లేవు. గాజాలోని పౌరులకు అందచేస్తున్న సాయాన్ని అడ్డుకుంటున్న ఇజ్రాయిల్‌ నౌకల మీద దాడులు చేస్తామని గత బుధవారం నాడు హౌతీలు ప్రకటించగా ఆ సాకుతో శనివారం నుంచి అమెరికా దాడులకు తెగబడింది.” హౌతీల దాడుల కారణంగా అమెరికా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బిలియన్ల డాలర్ల నష్టం జరిగింది.అమాయకుల ప్రాణాలకు ముప్పు తలెత్తింది ” అని ట్రంప్‌ సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టాడు. గాజాను మొత్తంగా సర్వనాశనం చేసి వేలాది మంది పౌరులను ఊచకోత కోసి ఇజ్రాయిల్‌ కలిగించిన బాధ, వేదనలు ట్రంప్‌కు కనిపించలేదు. ప్రస్తుతం ఎర్ర సముద్రంలో యుఎస్‌ఎస్‌ హారీట్రూమన్‌ విమానవాహక నౌక, మూడు నౌకాదళ డెస్ట్రాయర్లు, ఒక క్రూయిజర్‌ను అమెరికా మోహరించింది. ఇవిగాక యుఎస్‌ఎస్‌ జార్జియా అనే క్రూయిజ్‌ క్షిపణి జలాంతర్గామి కూడా ఆ ప్రాంతంలో సంచరిస్తున్నది. అమెరికా షిప్పింగ్‌, వైమానిక, నౌకాదళ ఆస్తుల రక్షణకు, స్వేచ్చగా నౌకా విహారం కోసం దాడులు చేసినట్లు ట్రంప్‌ చెప్పాడు.హౌతీల చర్యలకు పూర్తి బాధ్యత ఇరాన్‌దే అని ఆరోపించాడు. హౌతీల దాడులను ఇరాన్‌ చేసినట్లుగానే పరిగణిస్తామన్నాడు. నౌకలపై దాడులను ఆపేంతవరకు తమ దాడులు కొనసాగుతాయని చెప్పాడు.2025 జనవరి 20న రెండవసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరొక దేశంపై ట్రంప్‌ జరిపిన తాలిదాడిగా చరిత్రలో నమోదైంది.
2015లో ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందం నుంచి గతంలో ట్రంప్‌ నాయకత్వంలోని ప్రభుత్వం ఏకపక్షంగా ఉపసంహరించు కుంది. తాజాగా మరోసారి దాని గురించి చర్చించేందుకు ముందుకు రావాలని ఇరాన్‌కు లేఖ రాసినట్లు అమెరికా చెప్పింది. తాము సముఖంగానే ఉన్నామని అయితే వత్తిడి, బెదిరింపులతో చర్చలకు వచ్చేది లేదని, తమకు అందిన లేఖలో కొత్త విషయాలేమీ లేవని, దాని మీద తరువాత స్పందిస్తామని ఖమేనీ నాయకత్వం స్పష్టం చేసింది. ఒకవైపు సంప్రదింపుల ప్రకటనలు చేస్తూనే మరోవైపు రెచ్చగొట్టే విధంగా ట్రంప్‌ ఆచరణ ఉంది.తమతో ఒప్పందానికి రాకపోతే మరిన్ని ఆంక్షలు విధిస్తామని బెదిరించాడు.తమ విదేశాంగ విధానం ఎలా ఉండాలో ఆదేశించే అధికారం అమెరికాకు లేదని ఇరాన్‌ స్పష్టం చేసింది.తమపై దాడులకు దిగిన అమెరికా నౌకాదళంపై రెండుసార్లుగా పద్దెనిమిది క్షిపణులు, ఒక డ్రోన్‌తో దాడి చేసినట్లు ఎమెన్‌ హౌతీలు ప్రకటించారు. రెండు పక్షాలూ మిలిటరీ చర్యలను విరమించాలని ఐరాస కోరింది. అమెరికా దాడుల పర్యవసానాలను గల్ఫ్‌ దేశాలు పరిశీలిస్తున్నాయి, పరిమిత దాడులా లేక నిరవధికంగా సాగించేది స్పష్టం కాలేదు. తమ నౌకలపై దాడులను నిలిపివేసేంతవరకు తమ చర్యలు కొనసాగుతాయని అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సేత్‌ అన్నాడు. అమెరికా 47 వైమానిక దాడులు జరిపింది. ప్రపంచ నౌకా రవాణా ఎర్ర సముద్రం ద్వారా పన్నెండుశాతం జరుగుతోందని, అమెరికా దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని చర్చలు జరపాలని రష్యా కోరింది.చైనా కూడా అదే మాదిరి స్పందించింది.
నాలుగో వంతు షియా, నాలుగింట మూడువంతుల సున్నీ ముస్లిం తెగలతో కూడిన దేశం ఎమెన్‌. మిలిటరీ, నౌకారవాణా రీత్యా కీలకమైన అరేబియాాఎర్ర సముద్రాలను కలిపే ఏడెన్‌ గల్ఫ్‌లో ఉన్న ఆసియా దేశం. ఎదురుగా ఆఫ్రికాలోని జిబౌటీ ఉంది. సౌదీ అరేబియా, ఓమన్‌, ఎర్ర సముద్రం, అరేబియా సముద్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. అరేబియా సముద్రంలో ప్రవేశించాలంటే ఎమెన్‌ దాటి రావాల్సిందే. ఈ కీలకమైన ప్రాంతాన్ని అదుపులోకి తెచ్చుకొనేందుకు అమెరికా దీర్ఘకాలంగా ప్రయత్నిస్తున్నది. మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ కేంద్రంగా ఉన్న ఒట్టోమన్‌ సామ్రాజ్యం పతనమైనపుడు ఉత్తర ఎమెన్‌ స్వతంత్ర దేశంగా అవతరించింది. అయితే బ్రిటీష్‌ వారు ఏడెన్‌ గల్ఫ్‌ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని దక్షిణ ఎమెన్‌ ప్రాంతాన్ని తమ రక్షిత వలస దేశంగా ఉంచుకున్నారు.1960దశకంలో సోవియట్‌ యూనియన్‌ మద్దతుతో రెండు సంస్థలు వలస పాలకులపై తిరుగుబాటు చేశాయి. దాంతో ఉత్తర ఎమెన్‌లో 1967లో విలీనం చేసేందుకు ఆంగ్లేయులు ప్రతిపాదించారు. తర్వాత జరిగిన పరిణామాల్లో 1972లో ఉత్తర,దక్షిణ ఎమెన్‌ ప్రాంతాలలో అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఉత్తర ఎమెన్‌లో ఉన్నవారికి కమ్యూనిస్టు వ్యతిరేక సౌదీ అరేబియా, దక్షిణ ఎమెన్‌కు సోవియట్‌ మద్దతు ఇచ్చింది. అదే ఏడాది కైరోలో కుదిరిన ఒప్పందం మేరకు రెండు ప్రాంతాలను విలీనం చేసేందుకు నిర్ణయించారు. రెండు చోట్ల వేర్వేరు ప్రభుత్వాలు ఉన్నాయి. 1979లో తిరిగి అంతర్యుద్ధం చెలరేగింది.1990లో విలీనం జరిగే వరకు ఉత్తర ఎమెన్‌కు సౌదీ మద్దతు కొనసాగింది.
వర్తమాన విషయాలకు వస్తే పేరుకు ఎమెన్‌ దేశంగా ఉన్నప్పటికీ, మొత్తం ప్రాంతాన్ని పాలించే ప్రభుత్వం పేరుకు మాత్రమే ఉంది. మొత్తం ఆరు సాయుధ శక్తులు ఆయా ప్రాంతాలపై పట్టు కలిగి ఉన్నాయి. నిత్యం చర్చల్లో ఉండేది హౌతీలు. ఎందుకంటే రాజధాని సనాతో సహా కీలక ప్రాంతాలన్నీ వారి చేతిలో ఉన్నాయి. అమెరికా లేదా ఇజ్రాయిల్‌ చేసే దాడులన్నీ ఈ ప్రాంతం మీదనే. వీరికి ఇప్పుడు ఇరాన్‌ మద్దతు ఇస్తుండగా వ్యతిరేకించే శక్తులకు గతంలో సౌదీ అరేబియా సాయం చేసేది. చైనా మధ్యవర్తి త్వంలో ఇరాన్‌, సౌదీ సాధారణ సంబంధాలు నెలకొల్పు కొనేందుకు అంగీ కరించటంతో ఇప్పుడు సౌదీ సాయం నిలిచిపోయింది.హౌతీలను వ్యతిరేకించేవారికి అమెరికా మద్దతు కొనసాగుతోంది. ఇజ్రాయిల్‌తో పాటు తన మద్దతుదార్లకు తోడ్పడేందుకు అమెరికా గతంలో, తాజా దాడులు జరుపుతోంది. హౌతీ అంటే దేవుడి సహాయకులు అనే అర్ధంతో పాటు ముస్లింలో ఒక గిరిజన తెగ అది. ఇతర ముస్లింలకు దీనికి తేడా ఉంది, వీరు ఎమెన్‌లో తప్ప మరో ఏ ఇస్లామిక్‌ దేశంలోనూ లేరు.
శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇజ్రాయిల్‌ నిరాశ్రయులైన పాలస్తీనియన్లకు బయటి నుంచి వస్తున్న సాయాన్ని అందకుండా అడ్డుకుంటున్నది.మరోవైపు హమాస్‌ మీద నిందలు వేస్తూ సోమవారం రాత్రి నుంచి గాజాలోని గుడారాల్లో ఆశ్రయం పొందిన అభాగ్యుల మీద వైమానిక దాడులకు తెగబడి 200 మందికి పైగా ప్రాణాలు తీసినట్లు వార్తలు వచ్చాయి. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని భావిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నానికి అందిన సమాచారం మేరకు 300గా తేలింది. వీరిలో ఎక్కువ మంది పిల్లలు, మహిళలే ఉన్నారు. హమస్‌ తిరిగి సాయుధంగా తయారవుతున్నదని, వారి నేతల మీదనే దాడులు జరుపుతున్నట్లు ఇజ్రాయిల్‌ ప్రపంచాన్ని నమ్మించేందుకు పూనుకుంది. బందీల విడుదలకు హమస్‌ తిరస్కరిస్తున్నదని, కాల్పుల విరమణకు తమ ప్రతిపాదనలను ఆమోదించటం లేదంటూ పెద్ద ఎత్తున దాడులకు మిలిటరీని పంపాలని ప్రధాని నెతన్యాహు ఆదేశించాడు. గాజాలో నరక ద్వారాలు తెరుస్తామని మంత్రి ఇజ్రాయిల్‌ కాట్జ్‌ చెప్పాడు. గతంలో అంగీకరించిన ఒప్పందంలో రెండవ దశను ఉల్లంఘించేం దుకే తాజా దాడులని పరిశీలకులు చెబుతున్నారు. ఇజ్రయిల్‌ ఏకపక్షంగా కాల్పుల విరమణకు స్వస్తి పలుకుతున్నదని హమాస్‌ విమర్శించింది. మరోసారి ప్రారంభమైన దమనకాండకు అమెరికా కూడా బాధ్యత వహించాల్సిందే !
ఎం కోటేశ్వరరావు
8331013288

Spread the love