ఇరాన్‌ షాడో ట్యాంకర్లపై అమెరికా ఆంక్షలు

On Iran's shadow tankers US Sanctions– భారత కంపెనీలపైనా ప్రభావం
వాషింగ్టన్‌ : ఇరాన్‌ నుంచి చమురును ఎగుమతి చేయకుండా అడ్డుకొనేందుకు అమెరికా చర్యలు చేపట్టింది. ఇరాన్‌ షాడో ట్యాంకర్లు, వాటి ఆపరేటర్లు, మేనేజర్లను లక్ష్యంగా చేస్తూ అమెరికా తాజాగా ఆంక్షలు విధించింది. వివిధ దేశాలకు చెందిన 30మంది వ్యక్తులు, కంపెనీలు, ట్యాంకర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో భారతీయుల పేర్లు కూడా చేర్చినట్లు సమాచారం. వీరంతా ఇరాన్‌ చమురు విక్రయాలు, బ్రోకరేజీల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. హాంకాంగ్‌, యుఎఇలోని చమురు బ్రోకర్లు, నేషనల్‌ ఇరానియన్‌ అయిల్‌ కంపెనీలు ఉన్నాయి. ‘ఇరాన్‌ తరచూ లక్షల పీపాల చమురును ఎగుమతి చేయడానికి రహస్య ట్యాంకర్లు, షిప్పింగ్‌ కంపెనీలు, బ్రోకర్లపై ఆధారపడుతోంది. ఇలా వచ్చిన నిధులను ఇతర దేశాలను అస్థిరపరిచే చర్యలకు వాడుతోంది. ఇరాన్‌ చమురు సరఫరా గొలుసుకట్టు వ్యవస్థలను దెబ్బతీయడానికి అమెరికా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగిస్తోంది. ఎవరైనా ఇరాన్‌తో ఆయిల్‌ డీల్స్‌ చేస్తే తమ ఆంక్షల పరిధిలోకి వస్తారు” అని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్‌ బెస్సాంట్‌ తెలిపారు.ఈ తాజా ఆంక్షల పరిధిలోకి భారత్‌లోని కొన్ని కంపెనీలు రానున్నాయి. బిఎస్‌ఎం మారిటైమ్‌ లిమిటెడ్‌ లైబులిటీ పార్టనర్‌షిప్‌, ఆస్టిన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేటు లిమిటెడ్‌, కాస్మోస్‌ లైన్స్‌ ఐఎన్‌సీ సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగానే ఇరాన్‌తో కలిసి చమురు రవాణా, కొనుగోలు, మార్కెటింగ్‌ వంటి కార్యకలాపాలకు పాల్పడినట్లు అమెరికా చెబుతోంది. అలాగే, ఫ్లక్స్‌ మారిటైమ్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థ ఓ నౌకకు టెక్నికల్‌ మేనేజర్‌గా పనిచేసింది. ఆ ఓడ లక్షల టన్నుల ఇరాన్‌ ముడి చమురును రవాణా చేసిందని అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ పేర్కొంది. ఇరాన్‌పై వీలైనంత ఆర్థికఒత్తిడిని పెంచాలని ట్రెజరీ సెక్రటరీని ఆదేశిస్తూ ఈనెల ప్రారంభంలో ట్రంప్‌ ఓ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ను జారీ చేశారు. అలాగే, విదేశాంగ శాఖను కూడా ఆయన ఆదేశించారు. ఇరాన్‌ నుంచి చమురు ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయేలా చూడాలన్నారు.

Spread the love