Wednesday, August 12, 2026
E-PAPER
Homeజాతీయంమీడియా వేదికగా అమిత్‌షా, రాహుల్‌ సవాళ్లు

మీడియా వేదికగా అమిత్‌షా, రాహుల్‌ సవాళ్లు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: పార్లమెంటు ఆవరణలో బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, లోక్‌సభ ప్రతిపక్ష‍ నేత రాహుల్‌ గాంధీ మీడియా వేదికగా సవాళ్లు విసురుకున్నారు. చర్చకు సిద్ధమని, సమాధానమిస్తానని అమిత్‌షా ప్రకటించగా.. అమిత్‌ షా ఉపన్యాసం పట్ల తమకు ఆసక్తి లేదని రాహుల్‌ కౌంటరిచ్చారు. పార్లమెంటులో ఏ ప్రశ్నకైనా సమాధానమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. బుధవారం ఆయన పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. నీట్‌ అంశానికి సంబంధించిన విద్యార్థుల నిరసనలు సహా అన్ని విషయాలపై బుధవారం మధ్యాహ్నం 3.00 గంటల నుండి గురువారం మధ్యాహ్నం 3.00 గంటల వరకు సమగ్ర చర్చ చేపట్టేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు.

‘‘ఈరోజు మధ్యాహ్నం 2.00 గంటల లోపు ప్రతిపక్ష‍ాలు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లిఖితపూర్వకంగా సమాచారం ఇస్తే, ఈ రోజు మధ్యాహ్నం 3.00 గంటల నుండి గురువారంమధ్యాహ్నం 3.00 గంటల వరకు చర్చను చేపట్టవచ్చు. చర్చ మొదలైతే, గురువారం మధ్యాహ్నం 3.00గంటలకు నేను సమాధానం ఇస్తాను’’ అని హోంమంత్రి పేర్కొన్నారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి తాను సభకు వస్తున్నానని, తనకు కేటాయించిన చాంబర్‌లో కూర్చుంటున్నానని అన్నారు. తాను స్వయంగా కూర్చుని, అన్ని అంశాలను నమోదు చేసుకుని సమాధానం ఇస్తానని అన్నారు. దీంతో దేశ ప్రజలకు అన్నీ స్పష్టంగా అర్థమవుతాయని చెప్పారు.

అమిత్‌షా ప్రకటనపై లోక్‌సభ ప్రతిపక్ష‍ నేత రాహుల్‌గాంధీ ధీటుగా సమాధానమిచ్చారు. కేంద్ర హోంమంత్రి ‘అభూతకల్పనలు’ లేదా ‘ఉపన్యాసాల’ పట్ల తమకు ఆసక్తి లేదని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. చర్చ జరిపే ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు. తాను పదేపదే ‘‘మనం’’ అని అన్నప్పుడల్లా దేశ యువత గురించి ప్రస్తావిస్తున్నానని అన్నారు. విద్యార్థులపై ఎవరు కాల్పులు జరిపారు?, లాటీలు, మేకులు ఉన్న కర్రలతో విద్యార్థులను కొట్టాలని ఎవరు ఆదేశించారు?. మన పిల్లలపై కాల్పులు జరపమని అమిత్‌షా ఆదేశించారా, ఒక వేళ ఆదేశించి ఉంటే ఆయన రాజీనామా చేయాలని అన్నారు. కేంద్ర హోంమంత్రికి ఆ ధైర్యం లేదని, ఆయన సభకు రాలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.పార్లమెంట్‌ ఉభయ సభలు బుధవారం మధ్యాహ్నం 2.00 గంటల వరకు వాయిదా పడ్డాయి. విద్యార్థులపై పోలీసుల చర్యలపై కేంద్ర హోంమంత్రి సమాధానమివ్వాలని ప్రతిపక్ష‍ాలు డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -