కోదాడ పెద్ద చెరువు కబ్జా కు యత్నం..

– చెరువు రూపురేఖలు మారుస్తున్న వైనం…

– పట్టించుకోని అధికారులు…

నవతెలంగాణ – కోదాడరూరల్
కోదాడ పెద్ద చెరువు శిఖం భూముల పై చెరువు మట్టిని పోస్తూ చెరువు కబ్జాకు యత్నిస్తున్నారు. పెద్ద చెరువు సుమారు 600 పైగా ఎకరాలు ప్రస్తుతం ఉన్నది అది కూడా కబ్జా చేస్తున్నారు. వేసవి తాపానికి చెరువు ఎండిపోవడంతో చెరువు మునక భూములకు మట్టిని తోలి వాటిని  పొలాలుగా మారుస్తున్నారు. చెరువులో ప్రోక్లైన్ల సహాయంతో 50 కి పైగా ట్రాక్టర్లతో మట్టిని శిఖం భూములపై పోసి సుమారు పది ఎకరాలకు పైగా కబ్జా చేశారు. శిఖం భూమిలో ఎటువంటి నిర్మాణాలు మట్టి గాని పోయకూడదు. కానీ శిఖం భూముల్లో మట్టిని పోస్తూ చెరువు రూపు రేఖలను మారుస్తున్నారు. పట్టణంలో భూముల ధరలు ఎకరం కోట్లల్లో ఉండడంతో ఈ ఆక్రమణలు జోరుగా సాగుతున్నాయి. ఈ విధంగా చేయడం వలన చెరువులో నీటి నిల్వ తగ్గుముఖం పడుతుంది. దీనివల్ల పంటలకు భూగర్భ జలాలకు తీవ్ర ఇబ్బంది పడాల్సిన దుస్థితి ఏర్పడుతుంది అని పట్టణ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లాంటి మహానగరాలలో చెరువులు ఆక్రమణలకు గురై కనుమరుగైపోవడం వలన ఆయా పట్టణాలలో మంచినీటి సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారు. ఇప్పటికైనా చెరువులను కాపాడుకోకపోతే భావితరాలకు మంచినీటిని అందించలేము. ఇలా ఆక్రమించుకుంటూ పోతే కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ కోదాడ పెద్ద చెరువు ఉండేది అని ఓ కలలా చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. అధికారులకు  ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేని పరిస్థితి దాపురించింది. అధికారులు చెరువు మట్టిని పంట పొలాల్లో పోసుకోండి దీనివలన పంట దిగుబడి పెరుగుతుంది అని తెలిపారు. దీనిని సాకుగా చేసుకుని కొంతమంది చెరువు శిఖం భూమి, మునక భూమి గల పొలాలకు చెరువు మట్టిని తొలి ఈ విధంగా కబ్జాలకు పాల్పడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కోదాడ పెద్ద చెరువు ను కాపాడాలి అని కోరుతున్నారు.
Spread the love