18 ఏండ్ల తర్వాత తమ్ముడిని కలిసిన అక్క..

నవతెలంగాణ – లక్నో : సోషల్‌మీడియాలో రీల్స్‌ని చూసి ఓ సోదరి 18 ఏళ్ల తర్వాత తన తమ్ముడిని కనిపెట్టింది. సినిమాని తలపించే ఈ ఘటన రియల్‌గానే జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌జిల్లాలో జరిగింది. ఫతేపూర్‌లోని ఇనాయత్‌పూర్‌ గ్రామానికి చెందిన బాల గోవింద్‌ అనే వ్యక్తి పనికోసం ఇంటిని వీడి ముంబై వెళ్లాడు. అతను ముంబైలో పనిచేస్తుండగా.. కొద్దిరోజులకే అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ముంబైని వదిలి సొంత ఇంటికి చేరుకునేందుకు అతను రైలు ఎక్కాడు. అయితే అతను పొరపాటున ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కి బదులు, రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌కి వెళ్లాడు. అక్కడ గోవింద్‌కి జైపూర్‌లో ఓ వ్యక్తిపరిచయమయ్యాడు. అనారోగ్యంతో ఉన్న అతనికి ఆ వ్యక్తి చికిత్స చేయించి మాములు మనిషిని చేశాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి బతుకుతెరువుకు ఓ ఫ్యాక్టరీలో గోవింద్‌కి ఉద్యోగాన్ని కూడా ఇప్పించాడు. ఇక గోవింద్‌ ఈశ్వర్‌ దేవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోయాడు. వాళ్లకి ఇద్దరు పిల్లలున్నారు. అయితే గోవింద్‌కి తన స్వగ్రామం కానీ, చిన్ననాటి స్నేహితులు, కుటుంబ సభ్యులెవరూ అతనికి గుర్తులేరు.
మరోవైపు గోవింద్‌ సోషల్‌మీడియాలోనూ ఫేమస్‌ అయ్యాడు. జైపూర్‌లోని పలు ప్రాంతాలను సందర్శించి రీల్స్‌ చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసేవాడు. ఈ రీల్స్‌ని ఓరోజు రాజకుమారి అనే ఓ మహిళ చూసింది. ఆ రీల్స్‌లో గోవింద్‌ విరిగిన పంటిని ఆమె గమనించింది. అలా చాలా రీల్స్‌ని పరిశీలించిన తర్వాత… కొనేళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయిన తన తుమ్ముడు గోవింద్‌నే అని రాజకుమారి కనిపెట్టింది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అతడిని సంప్రదించి వివరాలు అడిగింది. గోవింద్‌తో ఫోన్‌లో మాట్లాడిన రాజకుమారి.. అతన్ని సొంత గ్రామానికి తిరిగి రావాలని కోరింది. జూన్‌ 20న అతను తన గ్రామానికి చేరుకున్నాడు. 18 ఏళ్ల తర్వాత అక్కా తమ్ముళ్లు ఇద్దరూ కలుసుకున్నారు.

Spread the love